Sunday, December 22, 2024

పాటెల్లిపోయింది

- Advertisement -
- Advertisement -

Leading singer Lata Mangeshkar passed away

సుమధుర స్వర చిరంజీవి లతా మంగేష్కర్ అస్తమయం

92వ ఏట కన్ను మూసిన ప్రముఖ గాయని లతా మంగేష్క్కర్
రాష్ట్రపతి, ప్రధాని ప్రభృతుల సంతాపం
రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం

ముంబయి: ప్రముఖ గాయని, భారత రత్న పురస్కార గ్రహీత, ‘గాన కోకిల’ లతా మంగేష్కర్ (92) ఆదివారం ఉదయం కన్నుమూశారు. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తితం ఆమెది. 30కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో వేల గీతాలను ఆమె ఆలపించారు. అత్యధికంగా హిందీ, మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్ స్వల్ప లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కోలుకున్నట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ప్రకటించారు.ఈ క్రమంలోనే శనివారం మరోసారి లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించడానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.

లత కన్ను మూసిన విషయాన్ని ఆమె చిన్న చెల్లెలు ఉషా మంగేష్కర్ ధ్రువీకరించారు. 28 రోజుల పాటు కొవిడ్ చికిత్స అనంతరం లతా మంగేష్కర్ ఈ రోజు ఉదయం 8.12 గంటలకు తుది శ్వాస విడిచినట్లు ఆమెకు చికిత్స అందించిన బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ప్రతీత్ సందానీ విలేఖరులకు చెప్పారు. ‘ భారత రత్న’ లతా మంగేష్కర్ స్మృత్యర్థం రెండు రోజులపాటు జాతీయ సంతాప దినాలుగా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని అవనతం చేసి ఉంచుతారు. అలాగే ఈ సమయంలో ఎలాంటి అధికారిక కార్యక్రమాలను నిర్వహించరు. లతా మంగేష్కర్ మృతి పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటుగా వివిధ రంగాలప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

గుండె బద్దలు చేసింది: రాష్ట్రపతి

లతాజీ మరణం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులలాగానే నాకు కూడా గుండె బద్దలు చేసే విషయం అని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆమె పాడిన వేలాది పాటల్లో భారతీయత, భారత దేశ సౌందర్యం కొట్టొచ్చినట్లు కనిపించేది. ఆమె పాటలు అనేక తరాలను అలరించాయి. భారత రత్నతో పాటుగా లతాజీ సాధించిన విజయాలు అనితర సాధ్యమని రాష్ట్రపతి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

భర్తీకాని శూన్యాన్ని మిగిల్చింది: మోడీ

లతాజీ దేశంలో ఎన్నటికీ భర్తీ కాని శూన్యాన్ని మిగిల్చి వెళ్లారని ప్రధానినరేంద్ర మోడీ అన్నారు. తాను మాటలతో వర్ణించలేనంత ఆవేదనకుగురయ్యానని అన్నారు. ఇతరుల పట్ల దయ, సంరక్షణ భావాలు గల లతా దీదీ మనల్ని వదిలి వెళ్లారన్నారు. భారతీయ సాంస్కృతిక దిగ్గజంగా ఆమెను రానున్న తరాలు గుర్తు చేసుకుంటాయన్నారు. ఆమె అద్భుత గళం ప్రజలను సాటిలేని రీతిలో మంత్రముగ్ధులను చేసిందన్నారు. ఆమె పాటలు అనేక భావాలను పలికించాయన్నారు. భారతీయ సినీ ప్రపంచంలో ఆమె దశాబ్దాల పాటు సన్నిహితంగా చూశారన్నారు. సినిమాలతో పాటుగా భారత దేశ అభివృద్ధి పట్ల ఆమె నిరంతరం తపించే వారని అన్నారు. ఆమె ఎల్లప్పుడూ బలమైన, అభివృద్ధి చెందిన భారత దేశాన్ని చూడాలనుకున్నారని అన్నారు. ‘ లత దీదీనుంచి నేను ఎల్లప్పుడూ అమితమైన ఆప్యాయతను పొందడం నాకు లభించిన గౌరవంగా భావిస్తాను.ఆమెతో నా సంభాషణలు మరపు రానివి. లత దీదీ మరణం పట్లు నా తోటి భారతీయులతో కలిసి దుఃఖిసుస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సంతాపం తెలిపాను. ఓం శాంతి’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

ఆమె గళం నిత్యం మార్మోగుతుంది: రాహుల్

లతా మంగేష్కర్ మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు, మిత్రులకు, సన్నిహితులకు సానుభూతి తెలిపారు. అనేక దశాబ్దాల పాటు ఆమె అత్యంత ప్రియమైన భారతీయ గళంగా కొనసాగారన్నారు. ఆమె బంగారు గళం శాశ్వతమైనదని, ఆ గళం ఆమె అభిమానుల హృదయాల్లో నిరంతరం మార్మోగుతుందని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా ఇచ్చిన ట్వీట్‌లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఇండియన్ నైటింగేల్ లతా మంగేష్కర్ ఉన్న ఫోటోను పెట్టారు. లతా మంగేష్కర్ మరణం భారతీయ కళా ప్రపంచానికి తీరని నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వరమే కాదు.. వ్యక్తిత్వమూ బంగారమే
73 ఏళ్ల పాటు నిర్విరామంగా సాగిన లతా దీదీ స్వర ప్రయాణం

ముంబయి: లతా మంగేష్కర్..ఆమె అసలు పేరు హేమ. హేమ అంటే బంగారం. ఆమె గాత్రమే కాదు.. వ్యక్తిత్వం కూడా బంగారమే ముప్ఫైకి పైగా ప్రాంతీయ, కొన్ని విదేశీ భాషలతో కలిపి దాదాపు 30 వేల చలనచిత్ర గీతాల్లో ఆమె మనకు కనిపిస్తారు. మనసులను తన స్వరంతో వికసింపజేస్తారు. ఆమె రాగాలు మన మనసులను ఉత్తేజితం చేస్తే.. ఆమె జీవనయానం మన హృదయాల్లో స్ఫూర్తి నింపుతుంది. సంగీత అభిమానులకు ఆమె మెలోడీ క్వీన్, ఇండియన్ నైటింగేల్ అయితే చాలా మందికి లతా దీదీ. లతాజీ పుట్టింది ఇండోర్‌లో. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్. ఆయన గాయకుడే కాక రంగస్థల నటుడు కూడా. తల్లి శేవంతీ మంగేష్కర్. తండ్రి రాసిన ‘ భవబంధన్’ నాటకంలో నాయిక పేరు లతిక. ఆ పాత్రను చూసిన లతాజీ తన పేరును లతా మంగేష్కర్‌గా మార్చుకున్నారు. తండ్రి నడుపుతున్న నాటకాల కంపెనీలో ప్రదర్శించే సంగీత ప్రధానమైన నాటకాల్లో లత నటించడమే కాకుండా పాటలు పాడే వారు. కూతురిలో గాయనిని మొదట గుర్తించింది ఆమె తండ్రే. 5వ ఏటనుంచే నటించడం మొదలు పెట్టారామె. స్కూలుకు వెళ్లి తోటి విద్యార్థినులకు పాటలు నేర్పే వారు. దీన్ని గమనించిన టీచర్ ఆమెను బడికి రావద్దని చెప్పేశారు. అంతే లతాజీ బడికి వెళ్లడం మానేశారు. అయితే తన చెల్లెలు ఆశాభోంస్లేను తనతో పాటుగా బడికి రానివ్వనందుకే తాను బడి మానేసినట్లు లతాజీ ఓ అంగ్ల పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పడం గమనార్హం.

13వ ఏటే తొలి సినిమా పాట

తొలి గురువయిన తండ్రి సప్తస్వర జ్ఞానం అందిస్తే ఉద్దండ హిందుస్థానీ సంగీత గురువులైన అమన్ అలీఖాన్,అమానత్ ఖాన్‌ల వద్ద శిష్యరికం చేసి గాన కోకిలగా మారారు.ఆమెకు 13 ఏళ్ల వయసులో అంటే 1942లో ‘కిటి హసల్’ అనే మరాఠీ చిత్రం కోసం మొదటిసారిగా రికార్డింగ్‌స్టూడియోలో తన తొలి సినిమా పాటను రికార్డు చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ చిత్రంలో ఆమె రెండు పాటలు పాడారు. వీటిలో ‘నాచు యా గాదె’ పాటను చిత్రం నిడివి ఎక్కువైందని ఎడిట్ చేశారు. రెండో పాట‘ నటాలీచైత్రాచి నవలాయ్’ మాత్రం లత తొలి మరాఠీపాటగా గ్రామఫోన్ రికార్డుల్లోకి ఎక్కింది.

1942లో తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబ పెద్దగా ముగ్గురు చెల్లెళ్లు మీనా, ఆశా, ఉషా మంగేష్కర్‌లు, తమ్ముడు హృదయ్‌నాథ్ మంగేష్కర్‌ల పోషణా లతాజీ భుజాలపై పడింది. దీంతో లతాజీ 1948 వరకు కేవలం పాటలనే నమ్ముకోకుండా ఎనిమిది చిత్రాల్లో వేషాలువేసి కుటుంబాన్ని లాక్కొచ్చారు. కుటుంబ పోషణ కోసం పెళ్లి చేసుకోకూడదని ఆమె అప్పుడే నిర్ణయించుకున్నారు. మొదట్లో నూర్జహాన్, షంషాద్ బేగం లాంటి గాయనీమణుల స్వరం విన్న సంగీత దర్శకులకు లతాజీ పక్వత చెందని స్వరం పీలగా, కీచుగా అనిపించి ఆమెను మొదట్లో తిరస్కరించారు. అయితే 1949లో ‘మహల్’ చిత్రంలో ఆమె పాడిన ‘ ఆయేగా ఆనేవాలా’ పాటతో ఆమె సుడి తిరిగింది. వద్దన్న సంగీత దర్శకులే ఆమె చుట్టూ తిరగడం మొదలైంది.
1953లో లతకు ఉత్తమ నేపథ్య గాయనిగా తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. అయితే ఆమె సున్నిత మనస్తత్వం కారణంగా స్టేజ్ మీదికి వచ్చి అవార్డు అందుకోవడానికి నిరాకరించారు. ఒక సంప్రదాయ భారత స్త్రీగా వస్త్రాలు లేని ఒక నగ్న స్త్రీ ప్రతిమను అందుకోలేనని ఆమె నిర్వాహకులకు చెప్పడంతో ఆ అవార్డు ప్రతిమకు జేబు రుమాలు చుట్టి అందించగా అప్పుడామె దాన్ని అందుకున్నారు.1962లో చైనా యుద్ధంలో ఓడిన జవాన్లను ఓదార్చుతూ లతాజీపాడిన ‘ ఆయె మేరీ వతన్‌కి లోగొం’ అనే పాటను విని కంట తడి పెట్టానని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా ఆమెకు చెప్పడం విశేషం.

1942నుంచి 2015 దాకా అంటే అవిశ్రాంతంగా 73 ఏళ్ల పాటు స్వరగాన యజ్ఞం చేసిన రికార్డు లత సొంతం. ఆమె చివరి పాట గత ఏడాది అక్టోబర్‌లో రికార్డు అయింది. 1990లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆమెను వరించింది. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించిన భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారత రత్నను కూడా అందించి గౌరవించింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి తర్వాత భారత రత్న పురస్కారం అందుకున్న రెండో గాయని లతాజీనే. లతకి క్రికెట్ అన్నా, సచిన్ తెండూల్కర్ అన్నా ఎంతో ఇష్టం. అయిదేళ్ల పాటు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న ఆమె ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు. కోట్లాది మంది హృదయాల్లో గాన కోకిలగా మిగిలి పోయిన లతాజీ గొంతు శాశ్వతంగా మూగపోయినా ఆమె పాట మాత్రం రాబోయే తరాలకు కూడా గుర్తుండి పోతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News