Monday, January 20, 2025

అమెరికా రక్షణ సమాచారం లీక్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో అత్యంత కీలకమైన రక్షణ రహస్య పత్రాలు ఈ ఏడాది మార్చిలో ‘డిస్కార్డ్’ అనే సామాజిక మాధ్యమంలో కన్పించాయి. ఇందులో అమెరికా రక్షణభద్రతా విభాగ వ్యూహాలు, ఇరాన్, జోర్డాన్ మొదలుకుని ఇప్పటి ఉక్రెయిన్ వరకూ రక్షణ శాఖ యంత్రాంగ వివరాలు ఉన్నాయి. ఆ తరువాత ఈ కీలక పత్రాలు మరిన్నిగా వెలువడుతూనే ఉన్నాయి. దీనితో పెంటగాన్ ఇంత అత్యల్ప దుర్భేధ్య పరిస్థితిలో ఉందనే విషయం ప్రపంచానికి తెలియడంతో బైడెన్ అధికార యంత్రాంగానికి సవాలు ఏర్పడింది. ఇంతకూ ఈ కీలక పత్రాలను లీక్ చేసింది కేవలం 21 ఏండ్ల యువకుడు జాక్ టెయిక్సిరా అని దర్యాప్తు క్రమంలో వెల్లడైంది. ఈ చాక్లెట్ బాబు అమెరికా వాయుసేనలో సైబర్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ జర్నీమెన్‌గా అత్యంత చిన్న ఉద్యోగంలో ఉన్నాడు. భద్రతా సమాచారాన్ని సంబంధిత విభాగాల రికార్డులలో భద్రపర్చడం, ఇతర సెక్షన్స్‌కు ఆన్‌లైన్‌లో పంపించడం ఈ జాబ్‌లో భాగం. ఇటువంటి ఉద్యోగానికి కావల్సింది కేవలం హైస్కూల్ డిగ్రీ, డ్రైవర్ లైసెన్సు, తరువాత 18 నెలల పాటు ఉద్యోగ శిక్షణ అంతే. కీలక రహస్య సమాచారం లీక్‌ను పసికట్టి వెంటనే ఎప్‌బిఐ రంగంలోకి దిగింది.

మసాఛూసెట్స్‌లోని దిగ్టన్‌కు చెందిన ఈ యువకుడిని అరెస్టు చేశారు. ఈ వ్యక్తి తాను చేస్తున్న జాబ్‌ను దుర్వినియోగపరుస్తూ వస్తున్నాడని అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ తెలిపారు. సమాచారం సేకరణ, తొలిగింపు, అనధికారికంగా ఈ సమాచారాన్ని తన వద్ద పెట్టుకోవడం , అత్యంత కీలకమైన జాతీయ స్థాయి రక్షణ సమాచారాన్ని ఇతరులకు పంపిణీ చేయడం జరుగుతోందనే అభియోగాలతో అరెస్టు చేశామని తెలిపారు. 2019లో ఈ వ్యక్తి ఎయిర్ నేషనల్ గార్డ్ విభాగంలో ఓ విధంగా కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉండే ఈ ఉద్యోగంలో చేరాడు. అయితే ఇంత తక్కువ స్థాయి ఉద్యోగంలో ఉన్న తెలిసితెలియని ప్రాయంలో ఉన్న వ్యక్తిద్వారా కీలక రక్షణ సమాచారం ఏ విధంగా లీక్ అవుతుందనే ప్రశ్న తలెత్తింది. నిజంగా ఇది పెంటగాన్‌కు తలవంపుల తంతు అయిందని అమెరికా అధ్యక్షుడి వద్ద గతంలో అధికార ప్రతినిధిగా పనిచేసిన డెన్సిస్ వైల్డర్ వ్యాఖ్యానించారు. సమాచారం పెద్దగా లీక్ కాలేదని ప్రెసిడెంట్ బైడెన్ కొట్టిపారేస్తున్నారు.

అయితే ఇప్పటి ఉక్రెయిన్ యుద్ధం తాజా దైనందిన సమాచారం కూడా సోషల్ మీడియాలో వెల్లడికావడం దారుణం అని, ఇక అమెరికా భద్రతా వ్యవహారాలకు భద్రత ఎక్కడుంది? వ్యూహాలకు విలువెక్కడుంది? అని పలువురు నిపుణులు, మాజీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు లీక్ కేసులో అరెస్టు అయిన యువకుడు సమాచారంతో ఆటలాడుకున్నట్లు తేలింది. తన ఆన్‌లైన్ ఆడ మగ స్నేహితులకు ఈ సమాచారం ఫోన్‌ద్వారా పంపించడం, తనతోటి టీనేజర్స్‌లో ఈ తీవ్రస్థాయి విషయాలపై జోక్‌లకు దిగడం వంటి విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అయితే కోవిడ్ తీవ్రస్థాయి సమయంలో లాక్‌డౌన్ల దశలో ఏం చేయాలో తెలియక తీరిక దొరికిందని తన వద్ద ఉన్న సమాచారాన్ని ఈ విధంగా తన స్నేహితులకు పంపిస్తూ వచ్చానని ఈ యువకుడు చెపుతున్నాడు.

దీనితో ఇప్పటికైతే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికా తన లోగుట్టును కాపాడుకోవడం కుదరదా? అనే ప్రశ్న వస్తోందని ప్రముఖులు కొందరు ప్రశ్నించారు. ప్రస్తుత విషయం రచ్చకావడంతో రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ స్పందించారు. పెంటగాన్ కీలక సమాచారం ఏ విధంగా వెల్లడైందనే విషయంపై ఆరా తీయాలని తాము ఆదేశించినట్లు , సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటువంటివి ఇక ముందు జరగరాదు. జరిగిన దానికి ఎవరు జవాబుదారి? నియంత్రణ చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఉంటాయనేది వెంటనే బేరీజు వేసుకుని తనకు తగు వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News