Sunday, December 22, 2024

గాజాపై దాడిలో 67 మంది పాలస్తీనియన్లు మృతి

- Advertisement -
- Advertisement -

రఫా : గాజా స్ట్రిప్‌లో భద్రత బలగాల భారీ బందోబస్తులో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ను సోమవారం తెల్లవారు జామున ముట్టడించిన ఇజ్రాయెల్ దళాలు ఇద్దరు బందీలకు విముక్తి కలిగించగలిగాయి. స్వల్ప స్థాయిలో నాటకీయంగా జరిగిన దాడిలో ప్రత్యర్థి దళాల కాల్పుల మధ్య ఆ బందీలను విడిపించగలగడం ఇజ్రాయెల్‌కు ఒక విధంగా విజయమే. కానీ ఇజ్రాయెల్ దళాల దాడిలో మహిళలు, పిల్లలతో సహా కనీసం 67 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గాజా స్ట్రిప్‌కు దక్షిణ కొసన ఉన్న నగరం రఫాలో అపార్ట్‌మెంట్ సమీపాన రక్షక దళాలకు సాయంగా భారీ స్థాయిలో వైమానిక దాడులు సాగాయి. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం బారి నుంచి తప్పించుకోవడానికి 14 లక్షల మంది పాలస్తీనియన్లు పారిపోయి ఆ ప్రాంతంలో తలదాచుకున్నారు. బందీల విముక్తి కోసం జరిగిన ఆ దాడిపై ఇజ్రాయెల్‌లో విజయోత్సవాలు చోటు చేసుకున్నాయి. నిరుడు హమాస్ సాగించిన సీమాంతర దాడి ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని ఇజ్రాయెల్‌లో తాజాగా బందీల విముక్తి జనంలో ఒకింత స్ఫూర్తి నింపింది.

కానీ హమాస్, ఇతర గాజా తీవ్రవాదుల చెరలో ఇప్పటికీ 100 మందికి పైగా బందీలు ఉన్నారు. అయితే, గత అక్టోబర్ 7న యుద్ధం ప్రజ్వరిల్లిన నాటి నుంచి అధికంగా ప్రాణ నష్టాలు చూసిన గాజాలో తాజా దాడి మరొక యుద్ద కాలపు విషాదాన్ని చవి చూపించింది. అనేక మంది పాలస్తీనియన్లు మరణించడమో, గాయపడడమో జరిగింది. కాగా, హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధంలో 12300 మందికి పైగా పాలస్తీనియన్ మైనర్లు, టీన్‌లు హతులయ్యారని హమాస్ ఆధ్వర్యంలోని గాజాలో ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం తెలియజేసింది. అంటే, ఇంత వరకు హతులైన 28176 మంది పాలస్తీనియన్లలో మైనర్లు దాదాపు 43 శాతం మంది ఉంటారని విదితం అవుతోంది. మృతులలో దాడాపు 8400 మంది మహిళలు కూడా ఉన్నారు. సాధారణంగా పోరాట యోధులు, పౌరుల మధ్య అంతరం చూపని ఆరోగ్య మంత్రిత్వశాఖ అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) అభ్యర్థనపై మైనర్లు, మహిళల వివరాలు తెలియజేసింది. అయితే, వేలాది మంది హమాస్ ఫైటర్లను చంపామని ఇజ్రాయెల్ తెలిపింది. బందీల దుస్థితి ఇజ్రాయెలీలను కదలించి వేసింది.

హమాస్ సైనిక, ప్రభుత్వ సత్తాను ధ్వంసం చేయడంతో పాటు డజన్ల కొద్దీ తక్కిన బందీలను విముక్తం చేయడం తమ యుద్ధం ప్రధాన లక్షమని ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, యుద్ధం ప్రారంభమై ఐదవ నెల అవుతుండడంతో బందీలకు ఎప్పుడు విముక్తి లభిస్తుందన్నది తెలియడం లేదు. వారి నిర్బంధం అంతానికి ఎటువంటి విధానం అనుసరించాలనే అంశంపై ఇజ్రాయెల్‌లో విభేదాలు కానవస్తున్నాయి. వారి విముక్తికి సైనిక ఒత్తిడిని కొనసాగించడమే మేలు అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయగా, ఇతర ఉన్నతాధికారులు దానిని వ్యతిరేకించారు. వారి విడుదల సాధించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడమే మార్గమని అధికారులు సూచించారు. ఇది ఇలా ఉండగా, పౌరుల రక్షణకు పకడ్బందీ వ్యూహం లేకుండా రఫాలో హమాస్‌పై ఇజ్రాయెల్ సైనిక చర్యకు దిగరాదని నెతన్యాహును ఆదివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారని వైట్ హౌస్ తెలియజేసింది. కాగా, తాము విముక్తి కలిగించిన బందీల పేర్లు ఫెర్నాండో సైమన్ మర్మన్ (60), లూయిస్ హార్ (70) అని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. వారికి అర్జెంటీనా పౌరసత్వం కూడా ఉందని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News