పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ పై దౌత్య దాడికి దిగింది. ఇందులో భాగంగా భారత్ లో ఉన్నటు వంటి పాక్ పౌరులను ఆ దేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో హైదరాబాదులోని పాకిస్తానీయులకు లీవ్ ఇండియా పేరుతో అధికారులు నోటీసులు అందజేశారు. హైదరాబాదులో మొత్తం 230 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించారు. 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయని గుర్తించారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న ఎనిమిది మందికి దేశం విడిచిపోవాలని నోటీసులు జారి చేశారు. మెడికల్ వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు గడువు విధించారు. పాకిస్తానీయులు తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డిజిపి డాక్టర్ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నవారు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అందించిన వివరాల ప్రకారం హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 230 మంది ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
వీరిలో సిటీ కమిషనరేట్ పరిధిలో పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో 156 మందికి పైగా నివాసం ఉంటున్నట్లు తెలిసింది. ఇందులో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ సహా ఇతర వీసాలు కలిగి ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తు న్నారు. పాకిస్తాన్‌లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలతో డేటాను రికార్డ్ చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల అందిం చిన పాకిస్తానీయుల డేటా ఆధారంగా ఆయా అడ్రసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది వివరాలు సేక రిస్తున్నారు. ఈ క్రమంలోనే వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమం గా నివాసం ఉంటున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సోమవారం నుంచి సోదాలు తీవ్రతరం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. పర్మినెంట్ వీసాలు కలిగి ఉన్న వారి పాస్‌పోర్టులపై స్టాంపింగ్ ఆధారంగా వారి ట్రావెల్ హిస్టరీని సేకరించనున్నారు.
ఈ క్రమంలోనే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఒ) రికార్డుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పర్మినెంట్ వీసాలపై వచ్చిన వారు ప్రస్తుతం ఎలాంటి పనులు చేస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితులు, పాస్‌పోర్టులపై స్టాంపింగ్ సహా ప్రయాణ వివరాలను తెలుసుకుంటున్నారు. దీంతో పాటు పాకిస్తానీయులను దేశం నుం చి పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించే విధి విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. రోహింగ్యాలపై కూడా నిరంతర నిఘా కొనసాగు తోందని స్పష్టం చేశారు.