వాషింగ్టన్: ఎటువంటి ప్రతిఘటన లేకుండా తాలిబన్లకు కాబూల్‌ను వదిలిపెట్టడం అమెరికా చరిత్రలోనే పెద్ద ఓటమి అని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ అన్నారు. అఫ్గానిస్థాన్ కోసం ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ ఏమీ చేయలేదన్నారు. కాబూల్‌లోని అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు ఆక్రమించారని, ఆ దేశ అధ్యక్షుడు అశ్రఫ్‌ఘనీ తన ముఖ్య అనుచరులతో కలిసి తజికిస్థాన్ పారిపోయారన్న వార్తలు గుప్పుమన్న కొన్ని గంటల్లోనే ట్రంప్ స్పందించారు. అఫ్గాన్ పరిణామాలపై అధ్యక్షుడు బైడెన్ నుంచి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు రాకపోవడం గమనార్హం. ఆయన తన వారాంతపు సెలవుల్ని గడిపేందుకు క్యాంప్‌డేవిడ్‌కు వెళ్లారు. ఇది పూర్తిగా బైడెన్ ప్రభుత్వ వైఫల్యమని ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీహేలీ విమర్శించారు.
మరోవైపు మా సిబ్బంది ఆపరేషన్స్‌లో జోక్యం చేసుకుంటే ఇప్పుడు జరుగుతున్న(సైనిక) ఉపసంహరణలపై వేగంగా స్పందించి నిర్ణయం మార్చుకోవాల్సివస్తుందని తాలిబన్లను హెచ్చరించామని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీబ్లింకెన్ అన్నారు. అఫ్గాన్ విషయంలో బైడెన్ విధానాన్ని బ్లింకెన్ సమర్థించారు. తాలిబన్ల అధికారాన్ని అమెరికా గుర్తించినపుడు, అఫ్గాన్‌లోని భవిష్యత్ ప్రభుత్వం ఆ దేశ పౌరుల మౌలిక హక్కులకు, ప్రత్యేకించి మహిళలు, బాలికలకు రక్షణ కల్పించాల్సి ఉంటుందని బ్లింకెన్ అన్నారు. అఫ్టాన్‌ను ఉగ్రవాదుల స్థావరంగా మార్చడానికి అనుమతించమని, అలా మారుతుందని అమెరికాగానీ, దాని మిత్రదేశాలుగానీ భావించడంలేదని బ్లింకెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.