Monday, December 23, 2024

కొలంబియాలో వామపక్షం ముందంజ!

- Advertisement -
- Advertisement -

లాటిన్ అమెరికాలో మరో వామపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. ఆదివారం నాడు కొలంబియాలో జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికలలో వామపక్ష, పురోగామి ‘చారిత్రాత్మక ఒప్పంద’ కూటమి అభ్యర్ధి గుస్తావ్ పెట్రో ముందంజలో ఉన్నారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్ల లో సగానికిపైగా తెచ్చుకున్నవారినే విజేతగా గుర్తిస్తారు. మొత్తం ఎనిమిది మంది పోటీ పడగా పెట్రోకు 40.33 శాతం, స్వతంత్రుడిగా పోటీ చేసిన మితవాద వాణిజ్యవేత్త రుడాల్ఫో హెర్నాండెజ్‌కు 28.15 శాతం ఓట్లు, మూడో పక్ష అభ్యర్ధి ఫెడరికో గూటిరెజ్‌కు 23.92 శాతం రాగా మిగిలిన ఐదుగురికి 5.87 శాతం వచ్చాయి. తొలి దఫా ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాకపోవటంతో జూన్ 19 మొదటి రెండు స్థానాల్లోన్న వారి మధ్యపోటీ జరగనుంది. రెండు, మూడు స్థానాల్లో వచ్చిన వారిద్దరూ మితవాద శక్తులే. తుది పోటీల్లో తాను హెర్నాండెజ్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు గూటిరెజ్ ప్రకటించటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో పెట్రో ముందంజ లాటిన్ అమెరికాను ఆశాభావంతో నింపిందని, జనాలు సంప్రదింపులు, సామాజిక సమానత్వం, ఏకీకరణ వంటి అంశాలతో కొత్త ఊపిరి పీల్చటం ప్రారంభించినట్లు పందొమ్మిది లాటిన్ అమెరికా దేశాలకు చెందిన వామపక్ష నేతలు, మేధావులతో కూడిన ప్యుబెలా బృందం ఒక ప్రకటనలో హర్షం వెలిబుచ్చింది. కొలంబియా వామపక్ష పురోగమన ఆశల వ్యక్తీకరణ అని కూడా పేర్కొన్నది. నూతన కొలంబియా గురించి కలలు గన్న యువత అసమాన కృషి ‘చరిత్రాత్మక ఒప్పంద’ కూటమి అభ్యర్ధుల విజయం వెనుక ఉందని, విస్మరణకు గురైన స్త్రీ, పురుషులందరికీ గుర్తింపు ఇవ్వాలని పేర్కొన్నది. నిష్పాక్షికమైన, ప్రజాస్వామిక, శాంతియుత కొలంబియా నిర్మాణం జరగాలని ఆకాంక్షించింది. 2019 జూన్ 1214 తేదీలలో మెక్సికోలోని ప్యుబెలా పట్టణంలో జరిగిన సమావేశంలో పది దేశాలకు చెందిన 30 మందితో ఈ బృందం ప్రారంభమైంది. దీనిలో ఇప్పుడు ఐరోపాలోని స్పెయిన్‌తో సహా19 లాటిన్ అమెరికా దేశాలకు చెందిన 200 మంది గతేడాది నవంబరు 29, 30, డిసెంబరు ఒకటవ తేదీల్లో ఇంటర్నెట్ ద్వారా జరిగిన ఐదవ సమావేశంలో పాల్గొన్నారు. ఈ బృందంలో లూలా డ సిల్వా, దిల్మా రౌసెఫ్ (బ్రెజిల్), ఆల్బర్టో ఫెర్నాండెజ్ (అర్జెంటీనా) రాఫెల్ కొరెయా (ఈక్వెడోర్) ఇవో మొరేల్స్ (లీవియా) వంటి నేతలున్నారు.

ఒకవైపు మితవాద పురోగామివాద శక్తుల రాజకీయ సమీకరణలు, మరోవైపు హింసాకాండ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఎనిమిది సంవత్సరాల పాటు 2002 10 మధ్య అధికారంలో ఉన్న ఆల్వారో ఉరిబి కొలంబియా వామపక్షశక్తుల అణచివేతలో, మాదకద్రవ్యాల మాఫియాలను ప్రోత్సహించటంలో పేరుమోశాడు. వేలాది మంది పౌరులను హతమార్చేందుకు కారకుడు. ప్లాన్ కొలంబియా పేరుతో అమెరికా అందచేసిన 280 కోట్ల డాలర్లతో ప్రైవేటు సాయుధ మూకలను తయారు చేసి మిలిటరీకి అనుసంధానించాడు. వామపక్ష గెరిల్లా ఉద్యమాలు నిర్వహించిన ఎఫ్‌ఎఆర్‌సి, ఇఎల్‌ఎన్ సంస్థలు, వాటి మద్దతుదార్లను హతమార్చటం, దాడులు చేయటమే వాటిపని.

తాజా ఎన్నికల్లో కూడా ఆ మూకలు వామపక్ష కూటమి అభ్యర్ధులను హతమారుస్తామని ప్రకటనలు, కుట్రలు చేశాయి. గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఇవాన్ డ్యూక్ ఉరుబి కీలుబొమ్మ. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వారు మరోసారి పోటీ చేసేందుకు అవకాశం లేనందున ఇతగాడు ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. రెండవది ఈ పార్టీ అనుసరించిన విధానాల కారణంగా జనాలకు దూరమైంది. ఈ ఎన్నికల ప్రక్రియను అడ్డుకోకుండా చూసేందుకు మే 25 నుంచి జూన్ మూడు వరకు ఏకపక్షంగా కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు వామపక్ష జాతీయ విముక్తి సైన్యం (ఇఎల్‌ఎన్) ప్రకటించింది.

కొలంబియా ఎన్నికల నిబంధనల ప్రకారం అధ్యక్ష అభ్యర్ధికి వచ్చిన ఓట్లనే ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన వారికీ వర్తింప చేసి విజేతగా ప్రకటిస్తారు. అందువలన రెండు పదవులకూ పోటీ చేసే వారి పేర్లు బాలట్‌లో ఉంటాయి. 2010లో తొలిసారి పోటీ చేసి నాలుగవ స్థానంలో నిలిచి, తిరిగి 2018 ఎన్నికల్లో పోటీ చేసిన గుస్తావ్ పెట్రోకు తొలి రౌండులో 25.09, రెండవ రౌండ్‌లో 41.77 శాతం వచ్చాయి. గత ఎన్నికల్లోనూ ఐదు పార్టీల కూటమి తరఫున పోటీచేయగా ఈసారి ఆరు వామపక్ష, ప్రజాతంత్ర పార్టీల, ఉద్యమ సంస్థల కూటమి తరఫునే పోటీ చేశారు. గత ఎన్నికల కంటే తొలి రౌండులో 15 శాతం పైగా ఓట్లు అదనంగా వచ్చాయి. కమ్యూనిస్టు లేదా ఒక వామపక్ష పార్టీ పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నిర్ణయించిన తరువాత ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం లేనపుడు, తమ ఎన్నికల అజెండాకు అనుగుణంగా భావసార్యూత కలిగిన పార్టీలతో కలసి పోటీ పడటం అనివార్యం. కొలంబియాలో గత ఎన్నికల్లోని వామపక్షకూటమి పార్టీల బదులు ఈ ఎన్నికల్లో కొత్తవి రంగంలోకి వచ్చాయి. గుస్తావ్ పెట్రో విషయానికే వస్తే 1970లో ఎన్నికల అక్రమాలను నిరససిస్తూ తలెత్తిన ‘ఏప్రిల్ 19 ఉద్యమం’ గెరిల్లా సంస్థలో 17 ఏండ్ల వయస్సులో (1977లో) చేరాడు. తరువాత దాని విధానాలు నచ్చక ఎం19 డెమొక్రాటిక్ అలయన్స్ అనే పార్టీ లో పని చేరాడు.ఇలా ఆరు పార్టీల్లో పని చేశాడు. 2011లో హ్యూమన్ కొలంబియా పేరుతో తాను ఏర్పాటు చేసిన పార్టీలో అప్పటి నుంచి కొనసాగుతున్నారు. ఎన్ని పార్టీల్లో పని చేసినా పురోగామి భావజాలాన్ని వదులుకోలేదు. సైద్ధాంతిక, ఎత్తుగడల అంశంలో విభేదాలతో పార్టీలను వీడాడు.

ఎన్నికల్లో ఒక కూటమిగా కొన్ని పార్టీలు ఏర్పడిన తరువాత అభ్యర్ధి ఎవరనే ప్రశ్న తలెత్తవచ్చు. ఏకాభిప్రాయం లేనపుడు మద్దతుదారులతో జరిపే ఎన్నికల ద్వారా నిర్ణయిస్తారు. తాజా ఎన్నికల్లో ఆరు పార్టీల ‘చరిత్రాత్మక ఒప్పంద’ కూటమి తరఫున ఆరుగురు పోటీపడగా హ్యూమన్ కొలంబియా పేట్రియాటిక్ పార్టీల తరఫున ఉన్న గుస్తావ్ పెట్రోకు పోలైన వాటిలో 80.55 శాతం ఓట్లు వచ్చాయి. రెండవ స్థానంలో ‘ప్రత్నామ్నాయ ప్రజాస్వామిక కేంద్రం’ అభ్యర్ధి ఫ్రాన్సియా మార్కెజ్‌కు 14 శాతం వచ్చాయి. ఆమె ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఉన్నారు.ఆ మె ఆఫ్రో కొలంబియన్ మానవ హక్కుల, పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్తగా కూడా ఉన్నారు. మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను రూపుమాపేందుకు ప్రయత్నించిన శక్తులకు ప్రతిరూపంగా నిలిచాడు. ఆ బాటలో నడిచేవారిని ఉరిబిస్టులని, వ్యతిరేకిస్తున్న వారిని ఉరిబిజం వ్యతిరేకులని పిలుస్తున్నారు. వీరిలో వామపక్షవాదులే ఉండనవసరం లేదు, ప్రజాతంత్ర విధానాలను కోరుకొనేవారు కూడా ఉంటారు. గుస్తావ్ పెట్రో ఇలాంటి శక్తులకు ప్రతినిధిగా పోటీపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

పార్లమెంట్ సెనెటర్‌గా గుస్తావ్ ఉన్న సమయంలో ఉరిబి విధానాలను గట్టిగా ప్రతిఘటించాడు. అందువలన ఉరిబి మద్దతుదార్లు ఎన్నికల ప్రచారంలో గుస్తావ్‌ను వామపక్షవాదిగా పేర్కొంటూ పెట్రో గెలిస్తే వెనెజులాలో ఛావెజ్ అమలు జరిపిన విధానాలనే ఇక్కడ కూడా ప్రవేశపెడతారని తప్పుడు ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే తమ కూటమి హరిత ఇంధనాన్ని ప్రోత్సహించి చమురు వాడకాన్ని తగ్గిస్తుందని పెట్రో చెప్పాడు. ఆర్ధిక అసమానతల తగ్గింపు, ధనికుల మీద పన్నుల పెంపుదల చేస్తామని, దేశాన్ని నాశనం చేసే నయా ఉదారవాద విధానాల నుంచి వైదొలుగుతామని చెప్పాడు.2021లో జరిగిన నిరసనల మీద ప్రదర్శించిన పోలీసు జులుం గురించి దిగిపోనున్న అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ మీద విచారణ జరుపుతామని కూడా వాగ్దానం చేశాడు. మాదకద్రవ్యాల ఉత్పత్తిశక్తుల చేతుల్లో ఉన్న విస్తారమైన భూములన్నింటిలో ఆహార ఉత్పత్తుల పునరుద్ధరణకు కోటిన్నర హెక్టార్లలో సంస్కరణలు చేపడతామని, కొత్తగా చమురు ఉత్పత్తి నిలిపివేస్తామని, ప్రైవేటీకరించిన ఆరోగ్యరంగంలో సంస్కరణలు తెస్తామని, ప్రభుత్వ విద్యారంగంలో పెట్టుబడులు పెంచుతామని, నీరు, రైలు సౌకర్యాలను మెరుగుపరుస్తామని, తమ ప్రభుత్వ తొలిచర్యగా ఆకలి నిరోధానికి ఆర్ధిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తామని వాగ్దానం చేశారు. మహిళల హక్కులను కాపాడతామని, వెనెజులాతో దౌత్యసంబంధాలను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో ఎదురైన కొన్ని అంశాల మీద గుస్తావ్ స్పందన ఎలా ఉందో చూద్దాం. వెనెజులాలో నియంతృత్వం ఉన్నందున దానితో సంబంధాలు ఎలా పెట్టుకుంటారని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సిద్ధాంతం ప్రకారం వెనెజులా నియంతృత్వ దేశమైతే మనం దౌత్యసంబంధాలు పెట్టుకోకూడదు, మరి మన ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సంబంధాలు కలిగి ఉంది, అక్కడ బహుశా మీరు చెబుతున్న వెనెజులా కంటే దిగజారిన నియంతృత్వం ఉంది, దాని సంగతేమిటి? అని ప్రశ్నించాడు. దౌత్యసంబంధాలనేవి దేశాల మధ్య ఉంటాయి తప్ప వ్యక్తులతో కాదు అన్నాడు. సమానత్వ సాధనకు వెనెజులా నేత ఛావెజ్ తీసుకున్న చర్యలను పెట్రో ప్రశంసించాడు. సామాజిక కార్యక్రమాన్ని చమురు ఆదాయంతో ముడిపెట్టటం ఛావెజ్ తప్పిదమని ఫ్రెంచి పత్రిక లీమాండ్‌తో చెప్పాడు. గుస్తావ్ పెట్రో వెలిబుచ్చిన కొన్ని అంశాలపై విమర్శలు వెలువడినప్పటికీ వామపక్షవాదిగానే ఎన్నికల్లో ప్రతిపక్షాలు చూశాయి. గుస్తావ్ పెట్రో ఎన్నికైతే తమ ఆటలు సాగవని అక్కడి అమెరికా పాలకులు, కార్పొరేట్, ధనిక శక్తులు భావిస్తున్నాయి. అందుకే వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను హతమార్చేందుకు నిరంతరం కుట్రలు చేస్తున్నాయి. పెట్రోతో పాటు ఫ్రాన్సియా మార్‌క్వెజ్‌ను హతమారుస్తామని ప్రభుత్వ మద్దతు ఉన్న మూకల నుంచి అనేక బెదిరింపులు ఎన్నికల ప్రచారంలో వచ్చాయి. ఆ కారణంగానే కాఫీపండే ప్రాంతంలో పెట్రో ప్రచారం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వారి భద్రత గురించి 20 దేశాలకు చెందిన 90 మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఒక లేఖలో ఆందోళన వెల్లడించారు. కార్మిక, సామాజిక ఉద్యమ, పర్యావరణం, సామాజిక తరగతుల నేతలు 50 మందిని హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక తొలి రౌండులో రెండవ స్థానంలో ఉన్న రోడాల్ఫో హెర్నాండెజ్ హింసాత్మక, చవకబారు స్వభావం కలిగిన ధనికుడిగా పేరుమోశాడు. కొందరు అతడిని కొలంబియా ట్రంప్ అని ఎద్దేవా చేశారు. ఉరిబిజంతో కొన్ని అంశాల్లో విభేదించినప్పటికీ పచ్చిమితవాది. అలాంటి వ్యక్తి నేరుగా వామపక్ష నేతతో పోటీ పడనున్నారు. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప రెండవ దఫా ఎన్నికల్లో గుస్తావ్ పెట్రో విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే లాటిన్ అమెరికా ఎర్రపూలవనంలో మరో మందారం మొగ్గ తొడగనుందని చెప్పవచ్చు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News