Tuesday, November 5, 2024

వయనాడ్‌లో రాహుల్ పోటీకి వామపక్షాలు వ్యతిరేకం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సిపిఎం, సిపిఐ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సీట్ల పంపకంపై ఒకపక్క కసరత్తు ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ వచ్చే ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తారా లేదా అన్న విషయమై ఆందోళన చెందుతున్నాయి.

కేరళలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వామపక్షాలు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీచేయడం వల్ల బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో జరగనున్న ఇండియా కూటమి పోరాటం బలహీనపడుతుందని అభిప్రాయపడుతున్నాయి. ప్రాంతీయ స్థాయిలో పొత్తులు కొనసాగుతాయని ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ కేరళలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండనున్నది.

కేరళలో కాంగ్రెస్-ఐయుఎంఎల్ కూటమి, సిపిఎం-కూటమి, సిపిఐ కూటమి మధ్యనే ముఖాముఖీ జరగనున్నది. ఇది జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది.

గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని వయనాడ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో దింపి కాంగ్రెస్ తప్పు చేసిందని సిపిఎం నాయకులు అభిప్రాయపడుతున్నారు. కేరళలో బిజెపి ప్రభావం నామమాత్రమేనని, ఇక్కడ ప్రధానంగా పోటీ కాంగ్రెస్‌కేరళలో కాంగ్రెస్-ఐయుఎంఎల్ కూటమికి, సిపిఎం- సిపిఐ కూటమి మధ్యనే ఉంటుందని వారు చెబుతున్నారు.

కాంగ్రెస్ ఈసారి ఈ తప్పు చేయకుండా వేరే రాష్ట్రం నుంచి పోటీ చేస్తే మంచిదని వారు తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తమిళనాడు నుంచి పోటీ చేసి ఉంటే తాము కూడా ఆయనకు మద్దతుగా ప్రచారం చేసి ఉండేవారమని వామపక్షాల నాయకులు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రాధాన్యతను కాంగ్రెస్ గుర్తించి బిజెపి ఓటమికి అనుగుణంగా వ్యవహరిస్తే బాగుంటుందని కేరళకు చెందని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ అభిప్రాయపడ్డారు.

అయితే ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాత్రం ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. రాహుల్ మళ్లీ వయనాడ్ నుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వడానికి నిరాకరించారు. కేరళలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కలసి ఐక్యంగా పోటీ చేయడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేరళలోని 20 స్థానాలలో 19 స్థానాలలో స్వీప్ చేసింది. వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ 4 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News