Thursday, January 23, 2025

దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

చికిత్స పొందుతూ ముంబయి ఆస్పత్రిలో తుదిశ్వాస
భారత చిత్రసీమను కొత్త పుంతలు తొక్కించిన ఘనుడు
సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగిన బెనెగల్
ఎన్నో పౌర పురస్కారాలు, జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న హైదరాబాదీ
ప్రముఖుల సంతాపాలు
ముంబయి/న్యూఢిల్లీ: భారతదేశంలో సరికొత్త సినీ ఉద్యమానికి అంకురార్పణ చేసిన ప్రముఖ దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్(90) కన్నుమూశారు. కొంత కాలంగా వృద్ధాప్య, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని వోక్‌హార్డ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారంనాడు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కూతురు పియా ఒక ప్రకటన విడుదల చేశారు.‘కొద్ది సంవత్సరాలుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆసుపత్రిలో చికిత్సపొందూతూ సాయంత్రం 6.30గంటలకు ఈ లోకాన్ని వదిలి వెళ్లారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. వివిధ రకాల భాషల్లో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. అంకుర్, నిషాంత్, మంథన్, భూమిక తదితర చిత్రాలతో భారతీయ సినీ యవనికపై బెనెగల్ తనదైన ముద్ర వేశారు.

ఇంకా జునూన్, మండి, సూరజ్ కా సత్వాన్, ఘోడా, మమ్మో, సర్దారీ బేగమ్, జుబైదా లాంటి చిత్రాలు కూడా ఆయనకు అశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి. హిందీ సినీ నిర్మాణ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఆయనకే దక్కుతుంది. భిన్నమైన అంశాలను ఎంచుకుని సినిమా చిత్రీకరణ చేయడంలో బెనెగల్ దిట్ట. పలు డాక్యుమెంటరీలు, టెలివిజన్ సీరియళ్లు కూడా తెరకెక్కించారు. వాటిలో అత్యంత ప్రజాదారణ పొందిన భారత్ ఏక్ ఖోజ్, సంవిధాన్ ఉన్నాయి. పది రోజుల క్రితమే అంటే ఈ నెల 14న బెనెగల్ 90వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయసు మీరుతున్న కొద్దీ సమస్యలు ఎదురవుతూ ఉంటాయన్ని, తరచూ ఆస్పత్రికి వెళ్తూ డయాలసిస్ చేయించుకుంటున్నట్లు చెప్పారు. బెనెగల్‌కు భార్య నీరా బెనెగల్, కూతరు పియా ఉన్నారు.

హైదరాబాద్‌లో జననం..
బెనెగల్ 1934లో అప్పటి హైదరాబాద్ స్టేట్‌లోని తిరుమలగిరిలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీధర్ బి బెనెగల్ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్. శ్యామ్ బెనెగల్ సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీలో విద్యనభ్యసించారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఎ ఎకనామిక్స్ చేశారు. కాపీ రైటర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన బెనెగల్ 1962లో గుజరాతీ భాషలో తొలి డాక్యుమెంటరీ ‘గెర్ బెతా గంగా’ తెరకెక్కించారు.

జాతీయ చలన చిత్ర అభివృద్ధి కార్పొరేషన్(ఎన్‌ఎఫ్‌డిసి) చైర్మన్‌గా 198086 వరకు బెనెగల్ పనిచేశారు. రాజకీయాలు, వ్యభిచారం ఇతివృత్తంగా సెటైరికల్‌గా 1983లో తెరకెక్కించిన ‘మండి’ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. మానవ సంబంధాల గొప్పదనాన్ని త్రికాల్ చిత్రం ద్వారా సినీ అభిమానులకు పంచారు. బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన ఆఖరి చిత్రం ‘ముజిబ్:దిమేకింగ్ ఆఫ్ ఏ నేషన్’. ఇక సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారాన్ని అందుకున్నారు. సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్నారు. 2013లో ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు సైతం ఆయనను వరించింది. మొత్తం ఏడుసార్లు శ్యామ్ బెనగల్ జాతీయ అవార్డు అందుకోవడం విశేషం.

ప్రముఖుల సంతాపం…
శ్యామ్ బెనెగల్ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. దర్శకుడు శేఖర్ కపూర్ మాట్లాడుతూ అంకూర్, మంథన్ సినిమాల ద్వారా హిందీ సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. స్మితా పాటిల్, షబానా ఆజ్మీ లాంటి నటీనటులను బెనెగల్ సృష్టించారని ప్రశంసించారు. దర్శకుడు అతుల్ తివారీ మాట్లాడూతూ ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచినందుకు ఆయన ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. నటుడు అక్షయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో అత్యుత్తుమ దర్శకుల్లో ఆయన అగ్రభాగాన నిలుస్తారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News