బిఎసిలో నిర్ణయం
అజెండా ఖరారు
తొలి రోజు మల్లు స్వరాజ్యం,
జనార్దన్‌రెడ్డిలకు
అసెంబ్లీ సంతాపం
అనంతరం సోమవారానికి
వాయిదా పడిన సభ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 12,13 తేదీల్లో శాసనసభ సమావేశాలు జరపాలని బిఎసి ( బిజినెస్ అడ్వైజరి క మిటి) నిర్ణయించింది. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత జరిగిన భేటీలో సమావేశాల నిర్వహణపై చ ర్చించారు. అలాగే సమావేశాల్లో చర్చించాల్సిన ఎజెండాను కూడా ఖరారు చేశా రు. కాగా బిఎసి సమావేశంలో పాల్గొన్న మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు సమావేశాల నిర్వహణ తేదీలు మరీ తక్కువ ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో సభను వీలైనంత మేరకు ఎక్కువ రోజులు జరపాలని కోరాయి. అయితే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల దృష్ట్యా సమావేశాల నిర్వహణను తర్వాత చూద్దామని ప్రభుత్వం తెలిపింది. పని దినాలు తగ్గినా ఎక్కువ సమయం నడుపుతున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
కాగా సభలో మైనార్టీ అంశాలపై చర్చించాలని మజ్లిస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ కోరారు. కాగా రైతులు, నిరుద్యోగం, ధరలు, వరదలపై చర్చించాలని కాంగ్రెస్ పక్ష నాయకుడు భట్టి విక్రమార్క కోరారు. అయితే కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై చర్చిద్దామని శాసనసభా వ్యవహరాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అలాగే మరో రెండు రోజుల పాటు జరగనున్న సమావేశాలలో కొన్ని బిల్లులు, తీర్మానాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే బిఎసి సమావేశానికి బిజెపిని ఆహ్వానించకపోవడంతో ఆ పార్టీ శాసనసభ్యులు ఈటెల రాజేందర్, రఘునందన్‌రావులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మల్లు స్వరాజ్యం, జనార్దన్‌రెడ్డిలకు శాసనసభ సంతాపం
రాష్ట్ర శాసనసభలో ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. తుంగతుర్తి మాజీ ఎంఎల్‌ఎ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ ఎంఎల్‌ఎ పరిపాటి జనార్దన్‌రెడ్డిలకు సభ్యులు సంతాపం తెలిపారు. మంగళవారం సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించారు. అంతకుముందు స్పీకర్ మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌రెడ్డి సేవలను కొనియాడారు.సూర్యాపేటలోని తుంగతుర్తి నియోజకవర్గ మాజీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నదని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నదని స్పీకర్ పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 1978- నుంచి 1983 వరకు, 1983 నుంచి -84 వరకు తుంగతుర్తి ఎంఎల్‌ఎగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారని, 1945 నుంచి 48 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. సాయుధ పోరాటంలో మొట్టమొదట తుపాకీ పట్టిన మహిళ మల్లు స్వరాజ్యం అని పేర్కొన్నారు.
1981 నుంచి -2002 వరకు ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘంలో చురుగ్గా పాల్గొని, సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేశారని చెప్పారు. 1993లో అప్పటి ఏపీలో జరిగిన సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని, ఆమె నియోజకవర్గ అభివృద్ధి ఎనలేని కృషి చేశారని, 2022 మార్చి 19న 90 సంవత్సరాల వయసులో మరణించారని అన్నారు. అలాగే కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ నియోజకవర్గం మాజీ సభ్యుడు పరిపాటి జనార్దన్‌రెడ్డి మృతి పట్ల సభ తీవ్ర సంతాపం తెలుపుతున్నదని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నదని పేర్కొన్నారు. జనార్దన్‌రెడ్డి 1972 నుంచి -78 వరకు, 1978 నుంచి -1983 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారని, 1959 నుంచి -71 వరకు హుజూరాబాద్ సమితి అధ్యక్షుడిగా పని చేశారని అన్నారు.
జమ్మికుంటలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారని చెప్పారు.లెప్రా సొసైటీలో సభ్యుడైన ఆయన.. 1968 హిందూ కుష్ఠు నివారణ సమితిని స్థాపించి.. వ్యాధిగ్రస్తులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారని తెలిపారు. 1974 సంవత్సరంలో గ్రామ నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగంలో ప్రజలకు సేవలందించారని కొనియాడారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారని, సోషలిస్ట్ నేతగా గొప్ప పేరు సంపాదించారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని చెప్పారు. 2022, మార్చి 28న 87 సంవత్సరాల వయసులో మరణించారని తెలిపారు. వారిద్దరి మృతికి సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు సభ్యులంతా మౌనం పాటించారు. అనంతరం సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.