Friday, December 20, 2024

అక్టోబర్ 19వ తేదీనే లియో విడుదల: నిర్మాత నాగవంశీ

- Advertisement -
- Advertisement -

దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘లియో’. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్ర తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లియో విడుదలకు సంబంధించి తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ కీలక విషయాలను పంచుకున్నారు.

అక్టోబర్ 19న ఉదయం 7 గంటల షోలతో లియో విడుదలవుతుంది. దసరా సెలవుల్లో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చింది. తెలుగులో లియో టైటిల్ ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిస్కారం అవుతుంది. విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదల అవుతుంది.

లియో తెలుగు టైటిల్ ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్ చేయించి ఉన్నారు. పైగా ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. కాబట్టి విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక్కడ తెలుగులో లియో టైటిల్ ని వేరొకరు కూడా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి.. వాళ్ళకి గానీ, మాకు గానీ ఎటువంటి నష్టం జరగకుండా సమస్యని పరిష్కరించుకుంటాం.

ఈ సినిమా బాగుంటుంది అనే నమ్మకంతోనే తెలుగు హక్కులు తీసుకోవడం జరిగింది. దర్శకుడు లోకేష్ నిరాశపరచరు అని అనుకుంటున్నాను. థియేటర్ల సమస్య లేదు. ఏ సినిమాకి తగ్గట్టుగా ఆ సినిమా విడుదలవుతుంది. లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు ఎటువంటి సమస్య లేకుండా ఏ సినిమాకి కావాల్సినన్ని థియేటర్లు ఆ సినిమాకి కేటాయించారు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. భగవంత్ కేసరి ఘన విజయం సాధించాలని, అంతకంటే పెద్ద హిట్ సినిమా బాలకృష్ణ గారితో మేము తీయాలని కోరుకుంటున్నాను.

మేము నిర్మించిన వాతి(సార్) చిత్రాన్ని తమిళ్ లో లలిత్ కుమార్ గారు విడుదల చేశారు. ఆ సమయంలో ఏర్పడిన అనుబంధంతో ఇప్పుడు తెలుగులో మేము లియో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ ఆదివారంలోపు హైదరాబాద్ లో లియో వేడుక నిర్వహించాలి అనుకుంటున్నాం. లోకేష్ కనగరాజ్ గారు, అనిరుధ్ గారు, త్రిష గారు వస్తారు. గుంటూరు కారం మొదటి పాట విడుదల ఎప్పుడనేది దసరా సమయంలో తెలియజేస్తాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News