మిలానో : ప్రపంచవ్యాప్తంగా పేరొందిన రేబాన్ కంటి అద్దాల అధినేత లియోనార్డో డెల్ వెచియో కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఇటలీకి చెందిన ఈ వ్యక్తి తన జీవితంలో తొలిసారిగా డోలోమైట్ పర్వతాల ప్రాంతంలో ఓ చిన్న అద్దాల షాపును పెట్టారు. తరువాత తన వినూత్నత, కంటికి ఇంపుగా ఉండే చలవ అద్దాల తయారీలో ప్రావీణ్యతను సాధించి కళ్లజోళ్ల పరిశ్రమలో ప్రపంచస్థాయిలో తిరుగులేని అధినేత అయ్యారు. ఆయన మరణం గురించి ఇటలీ పత్రిక కొరియిరే డెల్లా సెరా సోమవారం వార్త వెలువరించింది. అయితే ఆయన మరణ వార్తను ఆయన తరఫు వారెవ్వరూ ధృవీకరించలేదు. ఖండించలేదు. కష్టేఫలికి మారుపేరుగా ఈ వ్యక్తి నిలిచారు. ఇటలీలో ఓ అనాథగా ఆయన బతకాల్సి వచ్చింది. చిన్నవయస్సులోనే ముందుగా కళ్లద్దాల విడిభాగాల సరఫరాకు దిగారు. తరువాత సొంతంగా కంపెనీని ఏర్పాటు చేసుకునే స్థితికి చేరారు. ప్రపంచస్థాయి సంపన్నుల జాబితాలో నిలిచిన డెల్ వెచియో నికర ఆస్తుల విలువ జూన్ 1 నాటికి 25.7 బిలియన్ డాలర్లుగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచికలో తెలిపారు.