మన తెలంగాణ/గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గర్కంపేట గ్రామ సమీపంలో అడవి ప్రాంతంలో గురువారం రాత్రి చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందింది. సీతాగొంది గ్రామానికి చెందిన బాధితుడు అసద్ అలీ కథనం ప్రకారం… గర్కంపేట సమీపంలో గల తన చేనులో గురువారం రాత్రి పశువులను కట్టేసి రాత్రి ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం అతనికి చెందిన లేగదూడను అటవీ జంతువు చంపిందని గర్కంపేటకు చెందినవారు సమాచారం ఇవ్వడంతో అతను అక్కడికి వెళ్లి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన స్థలానికి అటవీశాఖ అధికారులు చేరుకొని పశువైద్యాధికారులతో పంచనామా నిర్వహించి చిరుతపులి దాడిలో దూడ హతమైనట్లు నిర్థారించారు. గ్రామానికి సమీపంలో చిరుతపులి పశువులపై దాడిచేసి చంపడం పట్ల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన విషయమై పారెస్ట్ బీట్ ఆఫీసర్ శాంతను వివరణ కోరగా చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందిన సంఘటన వాస్తవమేనని తెలిపారు.
చిరుత దాడిలో లేగదూడ మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -