తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీవారిమెట్టు ప్రాంతంలో చిరుత సంచరిస్తూ శనివారం రాత్రి కంట్రోల్ రూం వద్దకు రావడంతో శునకాలు వెంటపడ్డాయి. చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. చిరుత సంచారంపై అప్రమత్తన టిటిడి సెక్యూరిటీ గార్డు అటవీ అధికారులకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. గత ఏడాది మెట్ల మార్గంలో ఓ బాలికపై చిరుత దాడి చేయడంతో మృతి చెందిన విషయం విదితమే. ఆ ఘటనతో మెట్ల మార్గంలో టిటిడి అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఆంక్షలను విధించారు.
టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, అటవీశాఖ అధికారులు కొన్ని చిరుతలను పట్టుకుని జూలో వదిలేశారు. తాజాగా మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం చెలరేగింది. తిరుమల శ్రీవారి మెట్టువద్ద సంచరిస్తున్న చిరుతను చూసి శునకాలు వెంబడించాయని అటవీ అధికారులు వెల్లడించారు. కానీ చిరుత కుక్కలపై దాడి చేసేందుకు వెంబడించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయన్నారు. చిరుత రాత్రిపూట సంచరిస్తున్నందున దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. శ్రీవారి మెట్టునుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు ఉదయం 6 గంటల నుంచి 6 వరకు మాత్రమే అనుమతిస్తామని వివరించారు. చిరుత సంచారంతో అప్రమత్తమైన టిటిడి అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా తిరుమలకు కాలినడకన వెళ్లేందుకు పంపిస్తున్నారు.