హైదరాబాద్: రంగారెడ్డి శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ప్రాంతంలో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. పెద్దగోల్కొండ గ్రామ శివారు ప్రాంతం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయ రన్‌వే వైపు చిరుత వెళ్లినట్లు ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అటవీ అధికారులు సోమవారం ఉదయం నుంచి చిరుత జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్ద గొల్కొండలో బ్లూడాట్ సంస్థకు చెందిన గోదాం వెనకాల నుంచి చిరుతపులి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఒకటి రెండు రోజులపాటు నిఘా పెట్టి చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని అటవీ అధికారులు తెలిపారు.తుక్కుగూడ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు పరిసర ప్రాంతాల ప్రజలు ఇప్పటికే అటవీ అధికారులకు తెలిపారు. అదే ఇటువైపు వచ్చుండొచ్చని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.