Thursday, December 19, 2024

ఎయిర్‌పోర్ట్‌నూ తాకిన చిరుత

- Advertisement -
- Advertisement -

అడవిలో ఉండాల్సిన క్రూరమైన జంతువులు జనావాసంలోకి ఒక్కోసారి అదుపు తప్పి వస్తుంటాయి. ఇలా వచ్చిన ప్రతిసారి స్థానికులు భయాందోళనలకు గురౌతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంటోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ విమానశ్రయంలో చిరుత పులి సంచరిస్తూ కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టు ప్రహరీ నుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటు మరో రెండు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. విమానశ్రయం ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌పోర్టు కంట్రో ల్ రూమ్‌లో అలారం మోగింది. అనంతరం భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. సిసి కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు జరిగిన విషయాన్ని తెలిపారు.

అటవీ శాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని చిరుతను బంధించేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారు. ట్రాప్ కెమెరా, బోన్లు ఏర్పాటు చేశారు. చిరుత సంచార విషయాన్ని తెలుసుకుని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. కాగా, దాదాపు మూడేళ్ల క్రితం 2019 నవంబరు 27న శంషాబాద్ ఎయిర్ పోర్టు గోడ దూకి చిరుత వెళ్లిన ఘటన జరిగింది. ఆ సమయంలో సిసి కెమెరాల్లో సంచరిస్తున్నట్లు రికార్డయింది. ఎయిర్ పోర్ట్ గోడ దూకి పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. దానిని పట్టుకోడానికి అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి ప్రయత్నించారు. రెండు గంటల పాటు అధికారులు చిరుత కోసం గాలించారు. అనంతరం అది చిరుత కాదని తేలడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. చివరికి సిసి కెమెరాల్లో చిక్కింది చిరుత పులి కాదు అడవి పిల్లి అని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం కూడా చిరుతపులి వ్యవహారం తీవ్ర అలజడి సృష్టిస్తోంది. అది అసలు చిరుతేనా? లేక గతంలో మాదిరి అడవి పిల్లా? అనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News