కేరళ అడవుల్లో ఘటన అరెస్టులు
కొట్టాయం : అందమైన కేరళలోని ఇదుక్కి జిల్లాలోఓ చిరుతపులిని మనుష్యులు క్రూరంగా చంపి మాంసం ఆరగించారు. బాగా పెరిగిన ఈ ఆరు నుంచి ఏడేండ్ల చిరుతను కాపుకాసి మాటేసి వలపన్ని పట్టుకున్నారు. తరువాత దీనిని చంపేసి, మాంసాన్ని వండుకుని తిన్నట్లు వెల్లడైంది. పులిని చంపి తిన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు తమ వేటలో పట్టుకున్నారు. అరెస్టు అయిన వారంతా ఇదుక్కి ప్రాంతపు మనకుల్లం వారని గుర్తించారు. అరెస్టు అయిన వారి వద్ద నుంచి ఈ చిరుత చర్మం, దంతాలు , గోళ్లు స్వాధీనపర్చుకున్నారని ఆ ప్రాంత అటవీ అధికారి విబి ఉదయసూర్యన్ వార్తాసంస్థలకు తెలిపారు. జింకనో కుందేలునో పులికి ఎరగా చూపి బంధించారని తరువాత వెల్లడైంది. అయితే ఈ చిరుత తరచూ తమ పంట పొలాల్లోకి రావడం, పశువులను తినేయడం వంటి చర్యలతో దీనిని చంపి తినాలని అనుకున్నామని తప్పో ఒప్పో చూడలేదని పట్టుబడ్డ వారు చెప్పారు. వీరిపై వన్యప్రాణి రక్షణ చట్టం పరిధిలో కేసులు పెట్టినట్లు, కోర్టుకు హాజరుపర్చి, కస్టడీకి తరలించినట్లు తెలిపారు.