చండీగఢ్ : పంజాబ్ ఎన్నికల ప్రచారంలో కొనసాగుతున్న ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ శనివారం అమృత్‌సర్, జలందర్ పట్టణాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను అవకాశమిస్తే మీ హృదయాలను గెలుస్తామని అభ్యర్థించారు. ఢిల్లీ లోని పారిశ్రామిక వేత్తల్లో చాలా మంది తన సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నా తన పార్టీకి ఓటు వేసేవారు కాదని, కానీ తమ ఐదేళ్ల పాలన పూర్తయ్యేసరికి వారి హృదయాలను తాము గెల్చుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా వారు ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటు వేస్తున్నారని చెప్పారు. పంజాబ్‌లో కూడా తమకు ఓ ఐదేళ్లు అవకాశం ఇచ్చి చూడాలని ఓటర్లను కోరారు.
మత మార్పిడుల నివారణకు చట్టం తప్పనిసరి
జలందర్‌లో మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ మతం అనేది వ్యక్తిగత అంశమని, ప్రతి ఒక్కరికి దేవుడ్ని ఆరాధించే హక్కు ఉందని చెప్పారు. మతమార్పిడులను నివారించడానికి కచ్చితంగా చట్టాన్ని చేయాలని , కానీ ఆ చట్టంతో ఎవర్నీ అనుచితంగా వేధించ కూడదని ఆయన సూచించారు. భయపెట్టి మతం మార్చడం తప్పుడు విధానం అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.