Saturday, November 16, 2024

అంతా కలసి పనిచేద్దాం..

- Advertisement -
- Advertisement -
  • మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడమే అందరి లక్షం..
  • ఒక్కటైన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్
  • పార్టీశ్రేణుల్లో ఉత్సాహం..

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: అందరి లక్షం ఒక్కటే.. కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా చేయడమే లక్షంగా ఎలాంటి విభేదాలు లేకుండా కలసి ఎన్నికల్లో పనిచేద్దామని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ప్రతినబూనారు. ఇన్నాళ్లు ఎడముఖం.. పెడ ముఖంగా ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రానున్న ఎన్నికల నేపథ్యంలో అందరి అంచనాలకు భిన్నంగా ఒక్కటైయ్యారు.

ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, ఆయన సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మిలు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మార్నేని వెంకన్న, మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్ చైర్మైన్ ఎండి. ఫరీద్‌లతోపాటు ఎమ్మెల్సీ రవీందర్‌రావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలసి వారు ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ చర్చలు పూర్తిగా స్నేహపూర్వకంగా సహృద్భవ వాతావరణంలో జరగడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించినట్లైంది.

దీంతో ఎవరికి వారే యమునాతీరే కాకుండా ఎమ్మెల్సీ వర్గీయులు కూడా రానున్న ఎన్నికల్లో పార్టీ అధిష్టానం నిర్ణయించిన విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌ను గెలిపించేందుకు ఎలాంటి విభేదాలను ప్రదర్శించకూడదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యే స్వయంగా ఎమ్మెల్సీ రవీందర్‌రావును కలసి తన గెలుపుకోసం ఈ ప్రాంత వాసిగా స్థానికంగానే ఎక్కువ సమయాన్ని కేటాయించి ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు కావాలని అభ్యర్థించడంతో వారి మధ్య నెలకొన్న విభేదాలు పక్కన పెట్టేందుకు ఆయన సంసిద్దులు కావడంతో శ్రేణుల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకు సానుకూల వాతావరణం కూడా ఎర్పడుతుందని భావిస్తున్నారు.

అంతకుముందు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు టికెట్ కేటాయించవద్దంటూ కూడా ఎమ్మెల్సీ వర్గీయులుగా భావిస్తున్న వారు బహాటంగా ప్రెస్‌మిట్లు ఏర్పాటు చేయడం పార్టీ శ్రేణుల్లో కొంత కలవరం నెలకొంది. ఈ పరిస్థితుల్లో నేరుగా ఎక్కడా కూడా ఎమ్మెల్సీ మాత్రం పెదవివిప్పకుండా జాగ్రత్తగా రాజకీయ పరిస్థితులను గమనిస్తు వచ్చారు. కానీ తిరిగి మూడో సారి పార్టీ టికెట్ దక్కించుకున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కొద్ది రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని శ్రీకారం చుట్టేందుకు సిద్దంఅవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీని స్వయంగా మార్యాదపూర్వకంగా కలసి తన గెలుపుకు సహకరించాలని కోరడంతో వారి మధ్య నెలకొన్న విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం తాను కష్టపడుతానని ఎమ్మెల్యేకు రవీందర్‌రావు స్పష్టమైన హామీని ఇవ్వడంతో ఇరువర్గాల మధ్య ఎన్నికల సమయంలో సయోధ్య కుదిరినట్లైంది.

మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు తాను పాటుపడుతానని, అందరిలక్షం రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కేసీఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయడమేననే సంకేతాన్ని కుండబద్దలు కొట్టడంతో ఇరువర్గాలకు చెందిన వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ తన పట్ల సానుకూలంగా ఎన్నికల ప్రచారంలో భాగస్వామిని అవుతాననే హామీ పట్ల ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాలను ఒక్కోటిగా పరిష్కరించుకుంటూ ముందుకు పోయి మూడో సారి ఎమ్మెల్యేగా గెలుపేలక్షంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టబోతున్నానని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News