- బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల టౌన్: గద్వాలను నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం గద్వాల పట్టణ పరిధిలోని నదీ అగ్రహారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా కృష్ణానదీ ఒడ్డున ఉన్న ఆలయంలో గద్వాల ఎమ్మెల్యేతో పాటు, మున్సిపల్ చైర్మన్ బీఎస్‌కేశవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వృద్ధులకు, మహిళలను ఆప్యాయంగా పలుకరిస్తూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు కేసీఆర్ మేనిఫెస్టోను వివరిస్తూ మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రజా, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే మరోసారి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశామని, ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే.. మళ్లీ గెలిచి అభివృద్ధిని కొనసాగిస్తామని ఎమ్మెల్యే స్ఫష్టం చేశారు. రైతుబంధు ఆపాలని కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు ఆదరిస్తున్నారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారు గుర్తు పార్టీకి అండగా ఉంటూ కారు గుర్తు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కోరారు. అనంతరం వెంకంపేట, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.