Monday, December 23, 2024

రక్తదానం చేద్దాం.. తోటి వారి ప్రాణాలు కాపాడుదాం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : సమాజంలోని అన్ని దానాల్లో ఉత్తమమైన దానం రక్తదానం మాత్రమే అని, ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానం అవుతుందని,రక్తదాతలు అందరూ ప్రాణదాతలే నని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఎం.ఈ.ప్రభులత పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పిలుపు మేరకు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్త రక్తదాన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం ఖమ్మంలోని ఆర్టీసీ నూతన ప్రయాణ ప్రాంగణం సమావేశ మందిరంలో ఖమ్మం డిపో మేనేజర్ బి.శ్రీనివాస్, అసిస్టెంట్ డిపో మేనేజర్ (ట్రాఫిక్) రామిశెట్టి రామయ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఎవి.గిరిసింహారావు పర్యవేక్షణలో, ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది సహకారంతో ఏర్పాటు చేసిన సామూహిక మెగా రక్తదాన శిబిరాన్ని ఆర్టీసీ ఖమ్మం రీజనల్ మేనేజర్ ఎం.ఈ.ప్రభులత ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమే మాట్లాడుతూ సమాజంలో చాలా మంది వ్యక్తులు, సంస్థలు రకరకాల దానాలు చేస్తూ ఉంటారన్నారు. అయితే ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమై, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి మనిషిని కాపాడేందుకు అవసరమైన రక్తాన్ని దానం చేయడం అన్నిటికంటే మించిన దానమని పేర్కొన్నారు. ప్రతి మనిషి శరీరం ఒక కర్మాగారంలాగా రక్తాన్ని తయారు చేస్తున్నందుకు గర్వించాలన్నారు. మంచి కార్యక్రమంలో భాగస్వాములైన ఆర్టీసీ లోని పలు విభాగాల ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, అద్దె బస్సు యజమానులు, డ్రైవర్లు, కళాశాల విద్యార్థులు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులందరినీ ఆమె అభినందించారు. ఆర్టీసీ ఖమ్మం రీజియన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎవి గిరిసింహారావు ప్రసంగిస్తూ, ప్రపంచంలోని ఏ ప్రయోగశాల లోనూ కృత్రిమంగా రక్తం తయారు చేసే పరిస్థితులు లేవని, ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మన తోటి వారికి గర్భిణీ స్త్రీలకు అవసరమైన రక్తాన్ని రక్తదాతల నుండే సేకరించడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామూహిక మెగా రక్తదాన శిబిరంలో 63 మంది రక్తదానం చేశారు.

రక్తదానం చేసిన వారందరికీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ),హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు వారి సౌజన్యంతో పండ్లు, పండ్ల రసాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్, ఖమ్మం డిపో మేనేజర్ బి.శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) రామిశెట్టి రామయ్య, ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు శ్రీ బాలు, మహమ్మద్ ఫసీలు, స్టాఫ్ నర్సులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ మేనేజర్ వి.సతీష్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్స్, బస్ స్టేషన్ మేనేజర్ ఆర్.రఘుబాబు, ఉద్యోగుల సంక్షేమ మండలి సభ్యులు దమ్మాలపాటి శ్రీనివాసరావు, కంట్రోలర్ ఆకుతోట శ్రీనివాసరావు, ఆర్టీసీ ఉద్యోగులు అనిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News