Monday, December 23, 2024

అవయవ దానం చేద్దాం.. సజీవంగా బతుకుదాం

- Advertisement -
- Advertisement -

మక్తల్ : నేటి సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితానంతరం అవయవ దానం చేయవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉన్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ అవయవ దానం చేద్దాం.. మన అవయవాలతో వేరే వారికి జీవితాన్ని ప్రసాదించి సజీవంగా బతుకుదామని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక వట్టం రవి కన్వెన్షన్ హాల్లో బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవల్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది అనునిత్యం ప్రజలకు సేవలందిస్తూ, ప్రశంసలు పొందుతున్నారన్నారు.

గతంలో ఉమ్మడి ఏపిలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 5మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు. కానీ సిఎం కెసిఆర్ ముందు చూపుతో నేడు వాటి సంఖ్య 26కు చేరిందన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. గతంలో కేవలం 850మెడికల్ సీట్లు ఉండగా, ప్రస్తుతం 2815సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే 1215పిజి సీట్లు సైతం పెరగడం జరిగిందన్నారు.

గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30శాతం ప్రసవాలు మాత్రమే జరిగేవని, కానీ నేడు 61శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయన్నారు. గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను అందించడం ద్వారా తల్లీబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. నియోజకవర్గంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా దాదాపు 1లక్ష 20వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 19వేల మందికి కంటి అద్దాలను, మందులను ఉచితంగా అందించామన్నారు. కరోనా మహమ్మారిని సైతం సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు.

కరోనా సమయంలో వైద్య సేవలను ఆయన కొనియాడారు. మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో రూ.38కోట్ల వ్యయంతో 150పడకల దవాఖానాను మంజూరు చేసుకోవడం జరిగిందని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. ఇందుకు గానూ 150మంది వైద్యులు, ఇతర సిబ్బంది నియామకానికి అనుమతులు తెచ్చుకోవడం జరిగిందన్నారు. తెలంగాణలో అత్యధికంగా ప్రసవాలు మక్తల్ ఆసుపత్రిలోనే జరుగుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రత్యేకంగా 50పడకలను మాతా శిశు సంరక్షణకు కేటాయించడం జరిగిందన్నారు.

నియోజకవర్గంలో మొత్తం 27పల్లె దవాఖానాల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఒక్కో పల్లె దవాఖాన నిర్మాణానికి రూ.20లక్షల వ్యయం చేయడంతో పాటు వైద్యులను ఏర్పాటు చేసుకున్నామన్నారు. అలాగే కర్ని పిహెచ్‌సి భవన మరమ్మత్తుల కోసం రూ.25లక్షలను కేటాయించామన్నారు.

తల్లీబిడ్డల సంక్షేమానికి ప్రాధాన్యం..
తల్లీబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు, ఏఎన్‌ఎంలకు బిపి పరీక్షించే యంత్రాలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు యూనిఫారాలను ఆయన అందజేశారు. అనంతరం ఉత్తమ సేవలనందిస్తోన్న వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు ప్రశంసాపత్రాలతో పాటు జాపికలను అందించారు.

కార్యక్రమంలో ఎన్‌సిడి ప్రోగ్రామ్ అధికారిణి పి.సౌభాగ్యలక్ష్మీ, వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, టిఎస్ టిపిసి మాజీ ఛైర్మన్ దేవరి మల్లప్ప, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పావని, ఎంపిడీఓ శ్రీధర్, ఎంపిపిలు వనజ, ఎల్కోటి లక్ష్మీ, నర్వ జడ్పిటిసి జ్యోతి, వైద్యులు కేశవ్, తిరుపతి, రంజిత్, వంశీ, విజయ్‌కుమార్, మునావర్ అలీ, శంకర్, సర్పంచులు, ఎంపిటిసిలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News