జీఓఎంఎస్ నెంబర్ 4 ఖచ్చితంగా అమలు కావాల్సిందే
క్రీడా సంఘాల సమావేశంలో శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన క్రీడా ఫలితాల కోసం క్రీడా సంఘాలన్నీ ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. ఇందుకు జీఓ ఎంఎస్ నెంబర్ 4 ఖచ్చితంగా అమలు కావాల్సిందేనన్నారు. రాష్ట్రంలో మెరుగైన క్రీడా సమాజాన్ని నిర్మిద్దామని , రాష్ట్ర క్రీడారంగం దేశానికే మార్గదర్శకంగా నిలవాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని దాని కోసం అందరం కలిసికట్టుగా శ్రమిద్దామని చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ క్రీడా సంఘాల ప్రతినిధులను కోరారు.
సోమవారం ఈ మేరకు ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ ఛాంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందించే వివిధ పథకాలు నిజమైన క్రీడాకారులకు అందాలంటే క్రీడా సంఘాల్లో పారదర్శకత ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, ప్రభుత్వ ఫలాలు నిజమైన క్రీడాకారులకు దక్కాలంటే ప్రభుత్వ నిబంధనల మేరకు క్రీడా సంఘాలు పనిచేయాలని ఆయనకోరారు. ఇందుకోసం అవసరమైన డాక్యుమెంట్లను వెంటనే స్పోర్ట్ అథారిటీకి సమర్పించాలని ఆయన సూచించారు. మెరుగైన క్రీడా ఫలితాలు సాధించడం కోసం స్పోర్ట్ అథారిటీ , ఒలంపిక్ అసోసియేషన్, వివిధ క్రీడా సంఘాలు సమిష్టి బాధ్యతతో కలిసి పని చేద్దామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, ప్రేమ్ రాజ్ , తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఉమేష్ కుమార్ , స్పోర్ట్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి , క్రీడా సంఘాల ప్రతినిధులు మల్లారెడ్డి ,శోభన్ బాబు,బాలరాజు తదితరులు పాల్గొన్నారు.