‘నేను బక్కపల్చగా ఉండొచ్చు, కానీ మూడు కోట్ల తెలంగాణ ప్రజల మద్దతే నాకున్న బలం. ఇదే సహకారం మద్దతు అందిస్తే శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతాం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం. ఈ లక్ష్యసాధనలో వెనకడుగు వేస్తే నన్నే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులనెవరినైనా ప్రజలు రాళ్లతో కొట్టి చంపవచ్చు. ఉద్యమ నిర్మాణంలో చిత్తశుద్ధి చూపని నాయకులను నిలదీసే విధంగా తెలంగాణ ప్రజానీకంలో చైతన్యం తీసుకురావడం మా లక్ష్యం. తెలంగాణ సింహ గర్జన సభ రాష్ట్ర ఏర్పాటును కోరుతున్నది. ఎన్నేళ్లుగా దగాపడ్డ తెలంగాణ ఇక మౌనంగా ఉండలేదు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకు మూడు కోట్ల ప్రజలు సింహాలై గర్జిస్తారు’ ఇది గులాబీ జెండా ఎగరవేసిన నెల రోజుల్లోపే మే 17, 2001 నాడు కరీంనగర్‌లో నిర్వహించిన సింహగర్జన సభలో కెసిఆర్ చేసిన ప్రసంగం. ఈ సభ ద్వారా రాష్ట్ర సాధన మార్గాలను ఉద్యమంపట్ల తనకున్న నిబద్ధతనూ తెలియచెబుతూ ప్రజల్లో రాష్ట్రం ఏర్పడుతుందనే గొప్ప విశ్వాసాన్ని కలిగించారు. దీంతో ఒక్కడుగా మొదలై పోరాటానికి పిడికిలెత్తిన కెసిఆర్‌కు లక్షలాది పిడికిళ్లు మద్దతు తెలిపి గులాబీ జెండాను అందుకొని పోరాటానికి సిద్ధం అయ్యాయి. రాజకీయ శూన్యత ఆవరించినప్పుడల్లా ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడానికి కెసిఆర్ ఎన్నుకునే పదునైన వ్యూహం బహిరంగ సభలద్వారా ప్రజల్ని మేలుకొల్పడం. తన ఆలోచనల్ని ప్రజల ముందర ఉంచి, వారిని పోరాటానికి సిద్ధం చేయడం, తనకున్న ప్రజా మద్దతును ప్రదర్శించడానికి కెసిఆర్ బహిరంగ సభల్ని నిర్వహిస్తూ వస్తున్నారు. సభల నిర్వహణలో కెసిఆర్ ది అందవేసిన చేయి. దేశవ్యాప్తంగా అత్యధిక మంది ప్రజల్ని సమీకరించి సభల్ని ఏర్పాటుచేసిన రికార్డు కూడా భారత రాష్ట్ర సమితికున్నది. కరీంనగర్ సింహ గర్జన నుంచి మొదలుకుంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి మలుపులో ప్రజల్ని మమేకం చేయడానికి కెసిఆర్ అనేక బహిరంగ సభలని నిర్వహిస్తూ వచ్చారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, నీళ్లు, నిధులు, నియామకాల్లో దోపిడీని, భాష, సంస్కృతి పట్ల కొనసాగుతున్న అవహేళనను ప్రజలకు వివరిస్తూ, వారిని ఆలోచింపచేస్తూ కెసిఆర్ తన మాటల ద్వారానే రాజకీయాల్లో భూకంపం సృష్టించేవారు. కెసిఆర్ మాట్లాడినా, నిశ్శబ్దంగా ఉన్నా 2001 నుండి నేటివరకు ఇరవై అయిదేళ్లుగా తెలంగాణ రాజకీయాలను కానీ, మీడియా కానీ తన చుట్టే గింగిరాలు కొట్టిస్తున్న అపర రాజకీయ చాణక్యుడు కెసిఆర్. అద్భుతమైన తెలంగాణ భాషలో ప్రజల్ని ఆకట్టుకునే విధంగా మాట్లాడే కెసిఆర్ ప్రసంగానికి ప్రజలెప్పుడు ఉత్సాహంగా ఎదురుచూస్తూనే ఉంటారు. కరీంనగర్ సింహగర్జన తర్వాత 2002లో నల్లగొండ నగారా, 2003లో హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండులో తెలంగాణ గర్జన, 2005, 2010 సంవత్సరాలలో వరంగల్ శంఖారావం, 2009లో సిద్దిపేట ఉద్యోగ గర్జన, 2012లో సూర్యాపేట సమరభేరి ఇలా తెలంగాణ నలుమూలలా కెసిఆర్ లక్షలాది మందిని సమీకరించి బహిరంగ సభల ద్వారా తెలంగాణ ప్రజల్ని ఏకం చేస్తే ప్రయత్నం చేశారు. శిబూసోరెన్, శరద్ పవార్, జార్జ్ ఫర్నాండేజ్, స్వామి అగ్నివేష్ లాంటి ఎంతోమంది జాతీయ నాయకుల్ని ఈ సభలకు తీసుకురావచ్చి తెలంగాణ ప్రజల్లో ఉన్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వారికి అర్థం చేయించి జాతీయస్థాయిలో వారి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ భాషలోనే కాదు తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైన ఉర్దూలో కూడా కెసిఆర్ అద్భుతంగా మాట్లాడి ముస్లిం సమాజాన్ని కూడా చైతన్యపరిచేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలను ఒప్పించే క్రమంలో కానీ, ముఖ్యమంత్రిగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ అధిపతులతో మాట్లాడి పరిశ్రమలను తీసుకువచ్చే క్రమంలో కానీ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెలంగాణ గొప్పతనాన్ని వివరించిన కెసిఆర్ బహుభాషా కోవిదుడు, రాజకీయ చాణక్యుడు అంతకుమించి మంచి పరిపాలనా దక్షుడు. 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మినహా కెసిఆర్ ఎక్కడా మాట్లాడలేదు. ప్రభుత్వంపై అవగాహన కల్గడానికి కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వాలనే ధోరణితో వేచిచూసిన కెసిఆర్ ఈ సభలో ఏం మాట్లాడతారోనని తెలంగాణ ప్రజలతో పాటు యావత్తు ప్రపంచం వేచి చూస్తున్నది. ప్రతిపక్షపాత్రలో రాబోయే రోజుల్లో ఏ విధమైన పోరాటానికి పిలుపునిస్తారో అని బిఆర్‌ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో ఎదిరిచూస్తున్నారు. ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా అనేక సభలు నిర్వహించిన భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీగా చాలా రోజుల నిశ్శబ్దం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఎల్కతుర్తి సభకు విశేష ప్రాధాన్యం నెలకొంది. ఒక వైపు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెంది విజయవంతంగా 24 ఏళ్ళు పూర్తి చేసుకొన్న పార్టీ రజతోత్సవంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంలో కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచి పార్టీని దీవించేందుకు ‘ఎట్లయినా వెళ్లి రావాలె ఎల్కతుర్తికి’ అని తెలంగాణ ప్రజానీకమంతా తయారవుతుంది. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, లారీలు, డిసిఎంలు, బస్సులు, కార్లు ఏదయితే అది దొరకబట్టుకొని ఎట్లనన్న ఎల్కతుర్తిదాక పోయిరావలెనన్న అతురత, ఆత్మీయత సన్నాహక సమావేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తింటే గారెలే తినాలి వింటే కెసిఆర్ ప్రసంగమే వినాలని అనుకునే అందరం ఆదివారం నాడు ఎల్కతుర్తి ఎల్లలు నిండేలా తరలివెల్లి, తనివితీరా కెసిఆర్ మాటలు విందాం.
ఎట్లయినా పోయొద్దాం ఎల్కతుర్తికి!
- Advertisement -
- Advertisement -
- Advertisement -