Wednesday, January 22, 2025

24 గంటల ఉచిత కరెంట్‌పై రిఫరెండంతో ఎన్నికలకు వెళదాం!.. మీకు దమ్ముందా?

- Advertisement -
- Advertisement -
కాంగ్రెస్‌కు మంత్రి హరీశ్‌రావు సవాల్

హైదరాబాద్ : 24 గంటల ఉచిత కరెంట్‌పై రిఫరెండంతో ఎన్నికలకు వెళదాం.. మీకు దమ్ముందా? అని కాంగ్రెస్‌కు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. పిసిసి చీప్ రేవంత్‌రెడ్డిది నాలుకా? తాటిమట్టా? అని ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పించారు. రేవంత్ నోరు తెరిస్తే చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. కాంగ్రెస్ విధానాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్ వద్దని అన్నవాళ్లకు ప్రజలు రాజకీయంగా సమాధి కట్టారని, కాంగ్రెస్‌కు కూడా తెలంగాణ ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్న యూపీ, మహారాష్ట్రలో ఆయిల్ ఇంజిన్లు ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుందని ఆరోపించారు. రైతుల పట్ల హస్తం పార్టీ విధానం ఏమిటో తెలిసిపోయిందని విమర్శిం చారు. సాగుకు 3 గంటల విద్యుత్ చాలని రేవంత్‌రెడ్డి అన్నారని.. ఈ క్రమంలోనే 8 గంటల కరెంట్ చాలు అని మరో కాంగ్రెస్ నేత పేర్కొన్నారని దుయ్యబట్టారు. కానీ ఉచిత విద్యుత్‌కు వ్యతిరేకమని సోనియాగాంధీ మాట్లాడారని దుయ్యబట్టారు. ఇదంతా ఎందుకు కాంగ్రెస్ నేతలు నేరుగా వెళ్లి కరెంట్ తీగలను పట్టుకోండని పేర్కొన్నారు. అప్పుడు నిరంతరం విద్యుత్ వస్తుందో.. లేదో తెలిసిపోతుందని చెప్పారు.
ఇంతకంటే జోక్ ఉంటుందా…!?
టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కరెంటు బిల్లులు పెంచితే తీవ్రంగా వ్యతిరేకించింది కెసిఆర్ మాత్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. బషీర్‌బాగ్ కాల్పులకు కెసిఆర్ కారణమని అంటున్నారు. ఇంతకంటే జోక్ ఉంటుందా? తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్ అంశంపై అని హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. ఎంఎల్‌ఎ పట్నం నరేందర్‌రెడ్డి, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. నాటి సిఎం చంద్రబాబు కరెంటు బిల్లులు పెంచితే తీవ్రంగా వ్యతిరేకించింది కెసిఆర్ అని హరీశ్ రావు తెలిపారు. 2000, ఆగస్తు 28 బషీర్‌బాగ్ కాల్పులు జరిగితే అదే రోజు అప్పటికప్పుడు రైతు హృదయంతో కెసిఆర్ స్పందించారు. అధికార పార్టీలో ఉండి, డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలనిప కోరారు. ఈ ఛార్జీలు తెలంగాణ రైతాంగానికి గుది బండగా మారుతాయని, తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ఖతమై పోతుందని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే తెలంగాణ జెండా ఎత్తి పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. అదే రోజు కెసిఆర్ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి చంద్రబాబుకు లేఖ రాశారు. నాడు చంద్రబాబు రైతులను కాల్చి చంపితే, కడుపు రగిలి మా రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి, బిల్లులు తగ్గించాలని లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని లేఖలో పేర్కొన్నారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ప్రజల కోసం కెసిఆర్ పదవులను వదులుకున్నారు
ఇప్పుడు మాట్లాడే వారి నొటికి మొక్కాలి అని హరీశ్‌రావు అన్నారు. ‘ఏదంటే అది మాట్లాడితే సమాజం సహించదు. సమాజం తెలివైనటువంటిది. విశ్లేషించుకోగల సామర్థం ఉంది. ఉద్యమం పుట్టిందే విద్యుత్‌లో నుంచి అయితే. కాల్పులకు కెసిఆర్ కారణం అనడం సరికాదు, డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి పదవి, ఎంపి పదవులను గడ్డిపోచ మాదిరిగా కెసిఆర్ వదిలేశారు. మీరేమో పదవుల కోసం చొక్కాలను మార్చినట్లు పార్టీలను మారు తున్నారు. కెఆనీ కెసిఆర్ ప్రజల కోసం పదవులను వదులుకున్నారు. ఇవాళ కెసిఆర్‌ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరు. కరెంట్ వస్తలేదని అంటున్నారు కదా.. డైరెక్ట్‌గా వెళ్లి కరెంట్ తీగలను పట్టుకుంటే తెలుస్తుంది కదా’ అని హరీశ్‌రావు సూచించారు.
ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ
ఈ రోజు రైతు వ్యతిరేక వైఖరిని, తమకున్న అభిపరాయాన్ని వ్యక్తపరిచి కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలపై రైతులు తిరగబడుతున్నారు. చేసేదేమీ లేక కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు. విద్యుత్ విషయంలో కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్ పార్టీని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఈ దేశంలో నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నాటి పరిస్థితులు పునరావృతం…
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గంటలు కూడా రైతులకు కరెంట్ ఇవ్వలేదు అని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆరు గంటల కరెంటు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో.. ఆరు గంటల కరెంట్ ఓ అబద్ధం అని నాటి ప్రముఖ పత్రికలు రాశాయి. పంట కరెంట్‌కు సర్కార్ స్విచాఫ్.. రైతులకు కరెంట్ ఇవ్వకుండా చేతులెత్తేసిందని, చేలకు చీకట్లు అని పత్రికలు వార్తా కథనాలు రాశాయి. ఇవన్నీ కాంగ్రెస్ పర్భుత్వంలో వచ్చిన వార్తలు అని గుర్తు చేశారు. రైతుల ఆత్మ హత్యలపై కూడా పలు పత్రికలు కార్టూన్లు వేశాయి. రైతులకు ఏడు గంటల కరెంటు కూడా ఇవ్వలేమని నాటి ముఖ్యమంత్రి స్టేట్‌మెంట్లు ఇచ్చారు. వ్యవసాయానికి పగటిపూట రెండు గంటల కరెంట్ కూడా లేదు అని వార్తా కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, మళ్లీ నాటి కాలాన్ని తీసుకువస్తామని ఆ పార్టీ నేతలు చెప్పకనే చెప్పారు. కాంగరెస్ పార్టీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుందని హరీశ్‌రావు మండిపడ్డారు.
రైతుల భవిష్యత్తే ముఖ్యం…
దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రైతుల్లో ఆందోళన రేకెత్తించే విధంగా కాంగ్రెస్ నేతల మాటలు వున్నాయని విమర్శించారు. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టం అని అసెంబ్లీలో కెసిఆర్ చెప్పారన్నారు. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టకపోవడం వలన తెలంగాణ కేంద్రం నుండి 35 వేల కోట్లు నష్టపోయిందని గుర్తు చేశారు. 35 వేల కోట్లు కాదు 65లక్షల రైతుల భవిష్యత్ ముఖ్యం అని కేసీఆర్ నిరూపించారన్నారు. మీటర్లు పెట్టాలని భావిస్తే ఎప్పుడో పెట్టే వాళ్ళం కదా, కానీ రైతుల కోసం మీటర్లు పెట్టలేదన్నారు.

కాంగ్రెస్ విధానాలపై మా పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్ మాట్లాడితే బెదిరింపు ఫోన్స్ వచ్చాయని, రాజకీయంగా ఎదుర్కోక చేతకాక బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏం సంకేతం ఇస్తుంది? సమాధానం చెప్పాలన్నారు. దాసోజు శ్రవణ్ పై బెదిరింపులను ఖండిస్తున్నామని వెల్లడించారు. ఎంఎల్‌ఎ రాజా సింగ్ తన నియోజకవర్గంలో ఆసుపత్రి సమస్యలపై కలిశారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News