హుస్నాబాద్: సర్కార్ దవాఖానలో ప్రసవాలు పెరగాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరగాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం కోసం మార్పు తెద్దామని ఆరోగ్య శాఖ సిబ్బందికి మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. సర్కారు దవాఖానలో అన్నీ వసతులు ఉన్నాయని, అన్నీ రకాల వైద్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం రామవరంలో గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే సతీశ్ తో కలసి ప్రారంభించారు. ఈ మేరకు ఆశాకార్యకర్తలు, ఏఎన్ఏంలతో గ్రామాల వారీగా ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు, ప్రయివేటు ఆసుపత్రిలలో ప్రసవాలు, వాటిలో నార్మల్, సిజేరియన్ల అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రికి తేడా ఏమిటో తెలియ చేయాలని ఆరా తీశారు. ప్రయివేటు దవాఖానకు పోతే ఖర్చులు అవుతాయని, పెద్ద ఆపరేషన్లు చేయొద్దని, తల్లి, బిడ్డల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని సూచిస్తూ.., గర్భిణీలకు ఆసుపత్రిలో వ్యాయామం చేయించాలని, దీంతో నార్మల్ డెలివరీలు సులభంగా చెయొచ్చుననే విధానం తీరు, పెద్ద ఆపరేషన్ల ద్వారా జరిగే నష్టాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. గ్రామాల వారీగా ఆశాకార్యకర్తలు, ఏఎన్ఏంలు ప్రజల ప్రతీ మనిషి ఆరోగ్య స్థితిగతులైన బీపీ, షుగర్ తదితర వ్యాధులు గుర్తించిన అంశాలపై ఆరా తీసి ప్రభుత్వమే ఇంటింటికీ వెళ్లి ఎన్సీడీ కిట్లు పంపిణీ చేయాలని ఆరోగ్య శాఖ సిబ్బందిని మంత్రి ఆదేశించారు.