Monday, December 23, 2024

మన్నెంపల్లిని అందంగా తీర్చిదిద్దుతాం

- Advertisement -
- Advertisement -

తిమ్మాపూర్: దాదాపు అరకోటి రూపాయలతో మండలంలోని మన్నెంపల్లి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దనున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవారం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో సర్పంచ్ మేడి అంజయ్య, ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ముందుగా రూ. 20లక్షలతో నిర్మించనున్న పీహెచ్‌సీతో పాటు రూ. 4లక్షలతో మహిళా సమాఖ్య, రూ. 4లక్షలతో మాలసంఘం, రూ. 3లక్షలతో అంబేద్కర్ సంఘం కాంపౌండ్ వాల్, రూ. 4లక్షలతో నిర్మించనున్న మైనార్టీ సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పనులు పూర్తి చేసుకున్న కుమ్మరిసంఘంతో పాటు గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలాభివృద్ధే లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. వానను సైతం లెక్కచేయకుండా కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ మేడి అంజయ్య మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధిలో ప్రజలందరూ పాలుపంచుకోవాలని కోరారు. పార్టీలకతీతంగా పనిచేసి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందామని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఇంత పెద్దమొత్తంలో గ్రామానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే రసమయికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అడ్డుకున్న మహిళలు.. ఎమ్మెల్యే హామీ..
మన్నెంపల్లి గ్రామంలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రసమయికి మహిళల నుంచి నిరసన ఎదురైంది. పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించే క్రమంలో మహిళా సంఘాలు అడ్డుపడ్డాయి. ఇప్పటికే భవన నిర్మాణానికి రెండుసార్లు శిలాఫలకం వేశారనీ, నేటికీ పనులు మాత్రం ప్రారంభించడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే గ్రామంలో రెండు వీఓ సంఘాలు ఉన్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, రెండింటికీ భనవాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో శాంతించారు. ఎంపీపీ వనితా దేవేందర్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు ఇనుకొండ శైలజ జితేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పాశం అశోక్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పుప్పాల కనుకయ్య, వార్డు సభ్యులతో పాటు ఆయా కులసంఘాల నాయకులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News