వైల్డ్ లైఫ్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడి
మన తెలంగాణ/ హైదరాబాద్ : జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నెహ్రూ జులాజికల్ పార్కును సియం కెసిఆర్ సహకారంతో ప్రపంచస్థాయి జూగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం అటవీ శాఖ పూర్తి సహాయసాకారాలు అందిస్తున్నదని తెలిపారు. శుక్రవారం నెహ్రూ జూలాజికల్ పార్కులో ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ డైమండ్ జూబ్లీ వారోత్సవాలు, జూ పార్క్ వజ్రోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ఇంటిగ్రేటేడ్ ఆన్‌లైన్ టికెట్ సేవలను ప్రారంభించారు.
జూ పార్క్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన వజ్రోత్సవాల లోగోను, అనంతరం డైమండ్ జూబ్లీ పైలన్, సెంట్రల్ ఫౌంటెయిన్‌ను ఆవిష్కరించారు. 30 సంవత్సరాల తరువాత మళ్ళీ 2 క్యాపిచినో మంకీస్‌ను మంకీ మోట్ లోకి, 2 వైట్ టైగర్స్ ను సందర్శకుల వీక్షణ కోసం టైగర్ మోట్ లోకి విడుదల చేశారు. రెండు వైట్ టైగర్స్‌కు శివపార్వతులుగా మంత్రి నామకరణం చేశారు. జూ సందర్శకుల కోసం ఎలక్ట్రికల్ ట్రైసైకిల్, గ్లాండ్ ఫార్మా దాతృత్వంతో కొనుగోలు చేసిన ఎలక్ట్రికల్ రోడ్ ట్రైన్ సేవలను ప్రారంభించారు. మంత్రి కాసేపు సైక్లింగ్ షికారు చేశారు. అనంతరం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినిలకు బహుమతులను అందజేశారు.
జూ పార్కులో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలను నిర్వహించిన సిబ్బందిని సత్కరించారు. సామాజిక బాధ్యతగా జూ నిర్వహణకు ఆర్ధిక చేయూతనిస్తున్న పలు కంపెనీ యాజమానులు, ఎస్బీఐ ప్రతినిధులను, విద్యాలయాల నిర్వహకులను సత్కరించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ. సామాజిక బాధ్యతగా వన్యప్రాణుల, పక్షుల అలనపాలనకు కావాల్సిన ఆర్ధిక చేయూతనిచ్చేందుకు మందుకు వస్తున్న కార్పోరేట్ కంపెనీల సేవలు అభినందనీయమన్నారు. నెహ్రూ జూలాజికల్ పార్కును దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న అటవీ శాఖ అధికారులు, జూ – పార్కు ఉద్యోగులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. పిసిసిఎస్, హెచ్‌ఎఎస్‌ఎఫ్ ఆర్. ఎం. డోబ్రియాల్, వైల్ లైఫ్ చీఫ్ వార్డెన్ లోకేశ్ జైశ్వాల్, రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు ఆర్, శోభ, పిసిసిఎస్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, పిసిసిఎస్ (ఎస్ సిఎ) ఎం.సి. పర్గెయిన్, అదనపు పిసిసిఎస్, సునీతా భగవత్, జూ డైరెక్టర్ విఎస్‌ఎల్ వి. ప్రసాద్, క్యూరేటర్ సునీల్ ఎస్ హీరేమత్ తదితరులు పాల్గొన్నారు.