Saturday, November 23, 2024

లక్ష్య సాధనకు సమష్టిగా ముందుకెళ్దాం

- Advertisement -
- Advertisement -

ఈ ఆర్థిక సంవత్సరం 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలి
ఇకపై రోజుకు 2.24 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా చేయాలి
జిఎంలతో సమీక్షలో సింగరేణి సిఎండి ఎన్.బలరామ్ దిశా నిర్దేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనలో ప్రతీ రోజూ విలువైనదేనని.. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సంస్థ నూతన ఛైర్మన్ ఎండి ఎన్.బలరామ్ స్పష్టం చేశారు. దేశ ఇంధన అవసరాలు, రానున్న వేసవి కాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేందుకు వీలుగా రోజుకు 2.24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని, రోజుకు 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్‌ను తొలగించాలని ఆదేశించారు.

సింగరేణి కాలరీస్ ఛైర్మన్ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అన్ని ఏరియాల జిఎంలతోపాటు వివిధ విభాగాల జిఎంలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఉత్పత్తి, అడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టు సహా పలు అంశాలపై సమీక్ష చేయడంతోపాటు సంస్థ పురోభివృద్ధిపై దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది మొదటి 9 నెలల కాలంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చితే బొగ్గు ఉత్పత్తిలో 5.15 శాతం వృద్ధితో 49.66 మిలియన్ టన్నులు, రవాణాలో 8 శాతం వృద్ధి తో 51 మిలియన్ టన్నులు, ఓవర్ బర్డెన్ తొలగింపులో 6 శాతం వృద్ధితో 306.6 మిలియన్ క్యూబిక్ మీటర్ల మేరకు లక్ష్యాలను సాధించినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న మూడు నెలల్లోనూ సమష్టిగా లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. ఒక జట్టుగా ముందుకు సాగాలని, ప్రతీ ఒక్కరి పనితీరును పరిశీలిస్తానన్నారు.

అలాగే నూతన ప్రాజెక్టులను ప్రారంభించడంలో ఎదురవుతున్న అవాంతరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భూ సేకరణ, ఇతర అనుమతులపై ప్రత్యేక చొరవ తీసుకుంటానన్నారు. సింగరేణి సంస్థ ఒడిశాలోని నైనీలో చేపట్టిన బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారని, త్వరలో ఆయన నేతృత్వంలో సింగరేణి ఉన్నతాధికారుల బృందం ఆ రాష్ట్రంలో పర్యటిస్తుందని వెల్లడించారు.

పని సంస్కృతిని మరింత మెరుగు పరచాలి…
సింగరేణిని దేశంలోనే అగ్రస్థాయి కంపెనీగా నిలపడంలో ప్రతీ ఒక్క ఉద్యోగి, అధికారి తమవంతు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుందని సిఎండి ఎన్.బలరామ్ అన్నారు. సింగరేణి పని సంస్కృతిని మరింత పెంచేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సృజనాత్మకంగా పనిచేసే ప్రతీ ఒక్కరి ప్రతిభను గుర్తిస్తామని బలరామ్ పేర్కొన్నారు. నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలన్నారు. సింగరేణిలో అనుభవజ్ఞులైన జిఎంలు ఒకేసారిగా పెద్ద సంఖ్యలో రిటైర్ అవుతున్నారని, ఈ నేపథ్యంలో యువ అధికారులను ప్రోత్సహించి సంస్థ భవిష్యత్‌కు బలమైన పునాదులు వేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణరావు(ఈ అండ్ ఎం), ఎన్.వి.కె.శ్రీనివాస్(ఆపరేషన్స్), జి.వెంకటేశ్వరరెడ్డి(ప్రాజెకట్స్ అండ్ ప్లానింగ్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూమెంట్) జె.అల్విన్, జిఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జిఎం (సీపీపీ) జక్కం రమేశ్, జిఎం(ఎంపీ) మల్లెల సుబ్బారావు, జిఎం(మార్కెటింగ్) జి.దేవేందర్, జిఎం(సివిల్) సూర్యనారాయణ, అన్ని ఏరియాల జిఎంలు, కార్పోరేట్ జిఎంలు పాల్గొన్నారు.

Singareni

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News