Friday, December 20, 2024

అమరుల త్యాగాలను వృథా కానివ్వం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : అమరుల త్యాగాలను వృథా కానివ్వమని, అమరవీరుల ఆత్మలు శాంతించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేలా ప్రజా సేవకు పునరాంకితం అవుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శాంత కుమారి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పి కె. మనోహర్‌లతో కలిసి ప్రభుత్వ విప్,అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా జిల్లా యంత్రాంగం 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను కనీవిని ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించిందని ఆయన అన్నారు. రోజుకు ఒక రంగం చొప్పున ఆయా రంగాల వారీగా దినోత్సవాలను నిర్వహిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులను ప్రజలకు జిల్లా అధికారులు వివరిస్తూ ఘనంగా నిర్వహించారన్నారు. తొమ్మిదేళ్ల హయాంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు చేకూర్చిన లబ్ధి వివరిస్తూ కార్యక్రమాలు జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన అమరవీరులకు బాధతప్త హృదయంతో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు.

తెలంగాణ ఉద్యమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదవ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను త్యజించిన అమరుల యాదిలో జరిగిన అభివృద్ధి వెలుగులు నేడు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయన్నారు. దేశ చరిత్రలోనే ఘనకీర్తి కలిగిన తెలంగాణ మట్టిబిడ్డల మనోవేదనకు ముగింపు పడి, త్యాగాల తెలంగాణ బానిస సంకెళ్లను తెంచుకుని స్వరాష్ట్రంలో తలెత్తుకుని సగర్వంగా నిలబడి దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. అనంతరం ఎస్‌జేఆర్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ శాంత కుమారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఎంతో మంది యువతి యువకులు విద్యార్థులు, పౌరుల ఆత్మ బలిదానాలు చేసిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించి అమరుల సంస్మరణ తీర్మాణాలను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శాంత కుమారి ప్రవేశపెట్టి తీర్మాణాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన సమానత్వ విలువ కోసం జరిగిన మహత్తర పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమని ఆమె అన్నారు. అన్ని రంగాల్లో అమలైన వివక్షకు వ్యతిరేకంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆత్మగౌరవం కోసం స్వయంపాలన కోసం ఉద్యమం కొనసాగించారు. ఆరు దశాబ్దాల పాటు తొలి, మలి దశల్లో సాగిన ఈ పోరాటం త్యాగపూరితమైనదని చారిత్రాత్మకమైనదన్నారు. ఉద్యమం పొడుగునా ప్రజలు అపూర్వమైన ధైర్య సాహసాలను ప్రదర్శించారు. అణిచివేతను, హింసను లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడి 1969 తొలిదశ పోరాటంలో వందలాది మంది ఉద్యమకారులు పోలీసు కాల్పుల్లో నెలకొరిగారన్నారు.

నేడు రాష్ట్రం సాధిస్తున్న ఉజ్వల ప్రగతిలో వారి త్యాగం దేదీప్యమానమై ప్రతిఫలిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో జిల్లా పరిషత్ తెలంగాణ అమరులకు ఘనంగా నివాళులర్పింస్తుందన్నారు. అనన్య సామాన్యమైన వారి త్యాగాలను సగౌరవంగా స్మరించుకుంటుందన్నారు. చైర్‌పర్సన్ ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని సభ్యులందరు ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీర్మాణాన్ని బలపరిచారు. సభ్యులంతా హర్షాతిరేకాల మధ్య ఏకగ్రీవంగా తీర్మాణాన్ని ఆమోదించారు. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసిన వంకేశ్వర గ్రామానికి చెందిన అమరుడు నాగరాజ్ తల్లి ఈశ్వరమ్మను, ఉప్పునుంతలకు చెందిన అమరుడు బాలస్వామి భార్య అలివేలును, కల్వకుర్తికి చెందిన అమరుడు కె. కృష్ణయ్య కుమారుడు కె. రామును ఘనంగా శాలువాతో సత్కరించారు.

అమరుల కుటుంబాలకు ప్రభుత్వ విప్ పాదాభివందనం చేశారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లాలో దశాబ్ది ఉత్సవాలకు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని, అందుకు సహకరించి పాలుపంచుకున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, పత్రికేయులను అభినందించి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి కె.మనోహర్, అదనపు కలెక్టర్ మను చౌదరి, జిల్లా పరిషత్ సీఈఓ భాగ్యలక్ష్మి, వైస్ చైర్మెన్ బాలాజి సింగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, నాగర్‌కర్నూల్ జెడ్పిటిసి శ్రీశైలం, పదరా జెడ్పిటిసి రాంబాబు, బల్మూర్ జెడ్పిటిసి లక్ష్మమ్మ, పెంట్లవెల్లి జెడ్పిటిసి చిట్టెమ్మ, లింగాల జెడ్పిటిసి కేతావత్ నేజమ్మ, కో ఆప్షన్ మెంబర్ హమీద్, ఎంపిపిలు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News