Saturday, December 21, 2024

రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం… ప్రాణాలు కాపాడుదాం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా కోరారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్‌పి భాస్కర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా, రహదారి ప్రమాదాలు సంభవించకుండా అధికారులు రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు బాగా లేకపోవడం, అవసరమున్న చోట సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

అలాంటి ప్రదేశాలను సంబంధిత శాఖ అధికారులు గుర్తించి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పట్టణాల్లో సరిపడా పార్కింగ్ ప్రదేశాలు లేక రోడ్లపైనే వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయని, వెంటనే మున్సిపల్ అధికారులు పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలని ఆదేశించారు.

జిల్లాలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అత్యవసరంగా స్పందించేందుకు వీలుగా జిల్లా ఏరియా ఆస్పత్రి, ప్రాంతీయ వైద్యశాలలో ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, సంబంధిత ఆస్పత్రుల పర్యవేక్షణకు అధికారులను ఆదేశించారు. హైవేల్లో ప్రమాదాలు జరిగినప్పుడు హైవేలపై ఉండే దాబాలు, గ్రామాలకు దగ్గరలో ఉన్న ఆస్పత్రుల వివరాలు తెలిపే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.

జిల్లా ఎస్‌పి భాస్కర్ మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. డిజిపి ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో జిల్లా ట్రాఫిక్ అనాలసిస్ బ్యూరోను ప్రారంభించి ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని, పోలీస్ కళాబృందాల ద్వారా జాతీయ రహదారిపై ఉన్న అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఫస్ట్ రెస్పాండర్స్‌గా ఉండేందుకు హైవేలపై ఉన్న పెట్రోల్ బంకులు, దాబాల్లో పని చేసే వారికి, యువతకు, గ్రామస్థులకుకు ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్‌పై అవగాహన కలిగించాలని కోరారు.

జిల్లాలో 55 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించడం జరిగిందని, ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పిఆర్, ఆర్‌అండ్‌బి శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో టిఎస్‌ఆర్‌టిసి రీజనల్ మేనేజర్ చంద్రరావు, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ చంద్రబాబునాయక్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్, డిటిఓ వంశీధర్, డిఎస్‌పిలు వెంకటస్వామి, శ్రీనివాస్, పిఆర్, ఆర్‌అండ్‌బి, పోలీస్ అధికారులు, రోడ్ సెప్టీ ఇంజనీర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News