Thursday, November 21, 2024

చెత్తను ఆదాయ వనరుగా మార్చుకుందాం

- Advertisement -
- Advertisement -

Let's turn garbage into a source of income Says Minister Harish Rao

సిద్దిపేట: చెత్తను చెత్త లాగా కాకుండా ఆదాయ వనరుగా మార్చుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ డంపు యార్డు వద్ద రూ. 12 లక్షలతో ఏర్పాటు చేసిన వే బ్రిడ్జిని ప్రారంభించడంతో పాటు రూ.2 కోట్ల 25 లక్షలతో మానవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, రూ. 50 లక్షలతో తడి, పొడి చెత్త వ్యర్థాలను వేరు చేసే ప్లాస్టిక్ పునః సంవిధాన కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రోజు రోజుకు చెత్త సమస్య ఎంతో పెరిగిపోతుందని ఈ సమస్యను అధిగమించడానికి సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేసి చెత్తతో వివిధ అవసరాలకు ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు ఆదాయం వచ్చే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ తో రంగురంగుల ఇటుకలు తయారు చేయడంతో పాటు పూల కుండీలు, ట్రేలు తయారు చేయడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఇటుకలు ఎంతో గట్టిగా నాణ్యంగా ఉంటాయన్నారు.

అలాగే ప్లాస్టిక్ నుంచి ప్రయోగాత్మకంగా బీటీరోడ్లను సైతం వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రోజుకు సిద్దిపేటలో 40 టన్నుల చెత్త తయారవుతుందని, ఈ చెత్తను శుద్ధి చేసి రోజుకు 800 కిలోల ఎరువును తయారు చేస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎఫ్‌ఎస్‌టి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. రాష్ట్రంలోనే సిద్దిపేట బుస్సాపూర్‌లో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుని ప్రారంభించుకున్నామన్నారు. ఈ ప్లాంట్ 20వేల లీటర్ల సామర్థం ఉందని, 20వేల లీటర్లలో 16వేల లీటర్ల వ్యర్థాలను శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని బయటకు తీసుకురావడం జరుగుతుందన్నారు. 4వేల ఘన పదార్థాలను తయారు చేసి దీనితో 800 కిలోల ఎరువును తయారు చేయవచ్చని తెలిపారు. సిద్దిపేట డంపు యార్డును పార్కును తలపించేలా చెత్త వ్యర్థాలతో తయారు చేశామన్నారు.

సిద్దిపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి సేకరించే సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను ఈ ప్లాంట్‌కే తీసుకురావాలని ఎక్కడైనా.. బయటి ప్రాంతాల్లో పారవేస్తే క్రిమినల్‌కేసులు నమోదుచేయడంతో పాటు జరిమానాలు విధిస్తామన్నారు. త్వరలోనే సెప్టిక్ ట్యాంకుల వారితో సమావేశం నిర్వహించి ఎఫ్‌టిఎఫ్ ప్లాంట్‌ను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుస్సాపూర్ డంపు యార్డులో వే బ్రిడ్జిని ఏర్పాటు చేయడంతో రోజుకు ఎంత చెత్త సేకరణ అవుతుందో ఏ వాహనం ఎంత తీసుకువస్తుందో తెలుస్తుందన్నారు. ఎవరైనా చెత్త సేకరణ వాహన దారులు డంపు యార్డుకు తీసుకురాకుండా వాటిల్లో చెత్త సేకరించకుంటే తెలిసిపోతుందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలన్నదే తన ముఖ్య లక్షమన్నారు. సిద్దిపేట ప్రజలు సైతం చెత్తను వేర్వేరు చేసి ఎంతో సహకరిస్తున్నారని అన్నారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావు మున్సిపల్ కార్మికునిగా అవతారమెత్తి చెత్తను వేర్వేరు చేసే శుద్ధి కేంద్రంలో చెత్తను వేస్తూ కార్మికుల్లో ఉత్సాహం నింపారు. త్వరలో చెత్త నుంచి బయో గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఈ మేరకు గ్యాస్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News