రాష్ట్రవ్యాప్తంగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సచివాలయ ప్రాంగణంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలపై రూపొందించిన పోస్టర్‌ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఏటా పంపిణీ చేస్తోందని, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కలర్స్, కెమికల్స్ తో చేసిన విగ్రహాల కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణహిత గణపతులకు ప్రాధాన్యమిద్దామని మంత్రి కోరారు. మండపాల్లో, ఇళ్ళలో కూడా పర్యావరణహిత వినాయక ప్రతిమలను ప్రతిష్టించి, పూజిద్దామని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పటు మట్టి గణపతులను నిమజ్జనం చేయడం ద్వారా కలుషితమయ్యే నీటిని నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్, సైంటిస్ట్, ఎ సోమేష్ కుమార్, మీడియా కోఆర్డినేటర్ బి.నాగేశ్వరరావు, ప్రాజెక్ట్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.