Monday, January 20, 2025

లిబియా జలప్రళయం.. 5 వేల మందికి పైగా మృతి

- Advertisement -
- Advertisement -

డెర్నా: ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఇప్పటివరకు 5300 మంది మృతి చెందారని , ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 30,000 మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది. బుధవారం వరకు 2 వేలకు పైగా మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారు. వరద ఉద్ధృతి కారణంగా రెండు భారీ డ్యామ్‌లు బద్దలవ్వడమే ఇంత భారీ ఎత్తున ప్రాణనష్టానికి కారణమైంది.

అనేక నగరాలు వరద ప్రవాహానికి దెబ్బతిన్నా సముద్రతీర పర్వత ప్రాంతమైన డెర్నా నగరం లోనే విపరీత నష్టం జరిగింది. గుర్తించిన 2 వేల మృతదేహాల్లో సగానికి పైగా మృతదేహాలను డెర్నా నగరం లోని సామూహిక సమాధుల్లో ఖననం చేయడమైందని తూర్పు లిబియా ఆరోగ్యమంత్రి ఓథ్‌మన్ అబ్దుల్ జలీల్ వెల్లడించారు. నగరం లోని శిధిలాల కింద, వీధుల్లో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలను రేయింబవళ్లు సేకరించే పనిలోనే సహాయక సిబ్బంది నిమగ్నమయ్యారు. కొన్ని మృతదేహాలు సముద్రం నుంచి గాలించి తీసుకురావడమైంది.

డెర్నాలో రోడ్లు ధ్వంసం… సహాయ కార్యక్రమాలకు ఆటంకం
వరదలు డెర్నా లోని రోడ్లను పూర్తిగా ధ్వంసం చేయడంతో ఎవరైనా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నగరానికి వెళ్లే ఏడు రోడ్లలో రెండు రోడ్లు మాత్రమే దక్షిణ వైపు నుంచి వెళ్లడానికి వీలుగా ఉన్నాయి. నగరం లోని తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలిపే డెర్నా నదిపైన వంతెనలు కూలిపోయాయి. ఈ కారణంగా ఇళ్లు వాకిళ్లు పోగొట్టుకున్న వేలాది మంది నిర్వాసితులకు సహాయం చేసే అంతర్జాతీయ సహాయక బృందాలు రావడానికి, మానవతా సహాయం అందించడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. 7 మీటర్ల ఎత్తున వచ్చిన కెరటాలు నగరాన్ని పూర్తిగా తుడిచిపెట్టాయని లిబియా లోని రెడ్‌క్రాస్ అంతర్జాతీయ కమిటీ ప్రతినిధి యాన్ ఫ్రిడెజ్ పేర్కొన్నారు.

గత రెండు రోజులుగా బుల్‌డోజర్లు వచ్చి రోడ్లపై శిధిలాలను తుడిచిపెడుతున్నాయి. బెంఘాజీ నగరానికి తూర్పు వైపున 250 కిమీ దూరంలో ఉన్న నగరంలో అంతర్జాతీయ సహాయక బృందాలు మంగళవారం నుంచి సహాయం ప్రారంభించాయి. ఈజిప్టు, అల్జీరియా, టునీషియా, టర్కీ , యుఎఇ దేశాలు సహాయక బృందాలను పంపించాయి. అమెరికా అత్యవసర నిధులను సహాయక సంస్థలకు పంపుతోందని, లిబియా అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తోందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి అదనపు సహాయం అందిస్తుందన్నారు.

ఎక్కడ చూసినా శవాల గుట్టలే
అధికారయంత్రాంగం వందలాది మృతదేహాలను పట్టణాలకు సమీపాన ఉన్న శవాగారాలకు పంపుతున్నారు. డెర్నాకు తూర్పున 169 కిమీ దూరంలో ఉన్న టోబ్రక్ నగరంలో మెడికల్ సెంటర్ శవాగారానికి 300 మృతదేహాలు చేరుకున్నాయి. వీటిలో ఈజిప్పు ప్రజల మృతదేహాలు 84 వరకు ఉన్నాయి. బేనీ సుయెఫ్ ప్రావిన్స్‌లో ఎల్‌షరీఫ్ గ్రామంలో బుధవారానికి 22 ఈజిప్టు మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. బెహేరియా ప్రావిన్స్‌లో నైలు నది డెల్టా ప్రాంతంలో మరో నాలుగు శవాలను పూడ్చి పెట్టారు. డెర్నా, మరికొన్ని పట్టణాల్లో 40 వేల మంది నిర్వాసితులయ్యారని రెడ్ క్రాస్‌కు చెందిన లిబియా రాయబారి టామెర్ రమడాన్ చెప్పారు.

రెండు ప్రభుత్వాలు… ఇద్దరు పీఎంలు
కొన్నేళ్లుగా ఆ దేశంలో నెలకొన్న పాలనాపరమైన సంక్షోభంతో మౌలిక సదుపాయాల కల్పనను గాలికి వదిలేయడం, ఈ ఉత్పాతానికి దారి తీసిందని తెలుస్తోంది. ఒకప్పుడు లిబియాను పాలించిన నియంత గడాఫీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ఆయన గద్దె దిగిపోయారు. అప్పటి నుంచి అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడలేదు. 2014 నుంచి రెండు ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయి. అబ్దుల్ హమీద్‌బీబా రాజధాని నగరం ట్రిపోలి నుంచి పాలన సాగిస్తున్నారు. ఆయన ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. మరో పెద్ద నగరం బెంఘాజీ నుంచి ఒసామా హమద్ పాలిస్తున్నారు. దేశ తూర్పు ప్రాంతం ఆయన నేతృత్వంలో ఉంది. ఒసామాకు శక్తివంతమైన మిలిటరీ కమాండర్ ఖలిఫా హిఫ్తార్ మద్దతు ఉంది.

ఇలా ఒకే దేశాన్ని ఇద్దరు ప్రధానులు పాలిస్తుండడం విశేషం. ఇప్పుడు వీరంతా లిబియా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడతామని చెబుతున్నా పనులు మాత్రం అంతంతగానే ఉంటున్నాయి. ఇదిలా ఉండగా డెర్నాలో చాలా కట్టడాలు 20 వ శతాబ్దం మొదట్లో నిర్మించినవి. గడాఫీ ప్రభుత్వం కూలిన తరువాత అవి ఆ ప్రాంతం అతివాద గ్రూపులకు ఆవాసంగా మారింది. 2011 తర్వాత అక్కడ పెద్దగా మౌలిక నిర్మాణాల కల్పన జరగలేదు. దెబ్బతిన్న డ్యామ్ ఒకదాన్ని 1970లో నిర్మించారు. నేతల నిర్లక్షంతో పెనునష్టం సంభవించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News