ఐపిఒ వివరాలను వెల్లడించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఎల్‌ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఐపిఒ మే 4న రానుంది. దీని ధర శ్రేణి రూ.902 నుంచి రూ.949 మధ్య ఉంటుందని డిఐపిఎఎం కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. దీనిని ఎల్‌ఐసి 3.0 దశగా ఆయన పేర్కొన్నారు. రూ.21,000 కోట్లు సమీకరించే లక్షంగా ఈ ఐపిఒతో ఎల్‌ఐసి వస్తోంది. ఎల్‌ఐసి పాలసీని కలిగి ఉంటే ఒక్కో షేరుపై రూ.60 తగ్గింపు లభిస్తుంది. ఎల్‌ఐసి పాలసీని కలిగి ఉంటే, ఐపిఒలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా ఎలా, ఎంత ప్రయోజనం పొందుతారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఐపిఐ గురించి తెలుసుకోవాల్సినవి..
డిఆర్‌హెచ్‌పి ప్రకారం, 10 శాతం (2.21 కోట్ల షేర్లు) షేర్లు ఎల్‌ఐసి పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేస్తారు. ఐపిఒలో పాలసీదారులకు రూ.60 తగ్గింపు లభిస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఎలాంటి లాక్-ఇన్ పిరియడ్ ఉండదు. పాలసీదారులు లిస్టింగ్ చేసిన వెంటనే షేర్లను విక్రయించవచ్చు.
ఐపిఒ ధర శ్రేణి రూ.902 నుండి రూ.949 మధ్య నిర్ణయించారు. ఒక లాట్‌కు 15 షేర్లు వస్తాయి. పాలసీ హోల్డర్ కోటా నుండి ఐపిఒ కోసం దరఖాస్తు చేస్తే (949-60=889X15=రూ. 13,335), కనీసం రూ.13,335 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ.900 తగ్గింపును పొందుతారు. ఒక సాధారణ ఇన్వెస్టరు ఎగువ ధర వద్ద అయితే లాట్‌కు రూ. 14,235 పెట్టుబడి పెట్టాలి.
పాలసీదారులు డిస్కౌంట్ పొందడం వల్ల షేర్ మార్కెట్‌లో రూ.949 వద్ద లిస్ట్ అయినప్పటికీ, మీరు ఒక్కో షేరుకు రూ.60 లాభాన్ని పొందుతారు. అలా కాకుండా రూ.949 పైన లిస్ట్ అయితే లాభం ఎక్కువగా ఉంటుంది.
పాలసీ హోల్డర్లు షేర్లను కొనుగోలు చేయడానికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. పాలసీ హోల్డర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు ఎవరైనా డీమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి.
పాలసీదారులు అతను, ఆయన భాగస్వామి పేరు మీద వేర్వేరుగా డీమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి, తద్వార దరఖాస్తు చేయవచ్చు. ఎన్‌ఎస్‌డిఎల్, సిడిఎస్‌ఎల్ ద్వారా డీమ్యాట్ ఖాతాను తెరవాలి. ఏదైనా బ్రోకరేజ్ హౌస్‌లో ట్రేడింగ్ ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతాను తెరవడానికి మీరు పాన్, బ్యాంక్ ఖాతా, గుర్తింపు కార్డు, చిరునామా రుజువు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. నేను ఎల్‌ఐసి లాప్స్ పాలసీ కొనుగోలు చేయవచ్చా? అంటే పాలసీదారుల మెచ్యూరిటీ, సరెండర్ ద్వారా ఎల్‌ఐసి రికార్డు తీసుకుంటే పాలసీదారుల రిజర్వేషన్ కింద అర్హులు అవుతారు.