Thursday, January 23, 2025

ప్రభుత్వరంగ సంస్థల దీనస్థితి

- Advertisement -
- Advertisement -

జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, పివి నరసింహారావు తమ పరిపాలనలో దేశంలో వందల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి, జాతి అభివృద్ధిలో తమ వంతు కృషి చేసి దేశోన్నతికి బాటలు వేశారు. ఆ సంస్థలు ఇప్పుడు దేశాన్ని పోషిస్తున్నాయి. అప్పట్లో దేశాభివృద్ధి కోసం 17 కీలక రంగాలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని నాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయంలో భాగంగానే దేశ వ్యాప్తంగా ఉన్న వందలాది ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలన్నిటినీ కలిపేసి, కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రభుత్వ రంగంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేరుతో జీవిత బీమా సంస్థను ఏర్పాటు చేశారు.

లక్షల కోట్ల విలువైన సంపదతో ప్రపంచంలోనే మూడో అతి గొప్ప సంస్థగా వెలుగు వెలుగుతున్న ఎల్‌ఐసిలో 3.5 శాతం పబ్లిక్ వాటాగా కేంద్ర ప్రభుత్వం విక్రయించింది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ మంగళం పాడుతున్నది. అందు లో భాగంగానే మెల్లమెల్లగా ఒక్కొక్కటి అమ్మేస్తున్నారు. కొన్నిటిని పెట్టుబడిదారులకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించినారు. ఎల్‌ఐసి వంటి బంగారు బాతును ఒక్కసారిగా అమ్మేయకుండా దశలవారీగా అమ్మేందుకు నిర్ణయం చేస్తున్నది. షేర్లు విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని ద్వారా సుమారు లక్ష కోట్లు వస్తాయని మోడీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. పైగా ఇందులో 20 శాతం వరకు విదేశీ పెట్టుబడిదారులు కొనేందుకు కూడా అనుమతివ్వబోతోంది.

ఎల్‌ఐసి పాలసీ హోల్డర్లకు కూడా 10 శాతం వాటాలు అమ్మేందుకు నిర్ణయం చేసింది. దేశంలో ఆశ్రిత పక్షపాతం ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం బంగారు గుడ్లు పెడుతున్న బాతును కోసుకు తినేయాలని ఆరాట పడుతోంది. మీ సంక్షేమం మా బాధ్యత అనే నినాదంతో 65 సంవత్సరాలుగా జీవిత బీమా సంస్థ దేశ ప్రజలలో మమేకమైపోయింది. దేశంలో ప్రస్తుతం 25 కోట్ల మంది పాలసీదారుల విశ్వాసంతో, వారి పెట్టుబడులతో దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది ఎల్‌ఐసి. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా వస్తున్నా దేశంలోని మూడింట రెండొంతుల మంది పాలసీదారులు ఇప్పటికీ ఎల్‌ఐసితోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నమ్మకంతో పాలసీలు తీసుకుంటున్న ప్రజల నమ్మకాన్ని పెంచుకునే విధంగా వారి పెట్టుబడులను సురక్షితంగా వృద్ధి చేస్తూ లాభాలను పంచుతోంది. తనకు వచ్చే లాభాల్లో 95 శాతాన్ని పాలసీదారులకు, 5 శాతాన్ని యజమాని అయిన కేంద్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నది. వందల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఎల్‌ఐసి పెట్టుబడి పెట్టింది.

ముఖ్యంగా కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఎల్‌ఐసి పెట్టుబడులున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్న ఆదాయాన్ని అక్కడే అన్నట్లుగా ఆయా రాష్ట్రాల అభివృద్ధికి రుణాల రూపంలో ఎల్‌ఐసి ఇస్తోంది. ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ. లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. కొన్ని రూ. లక్షల కోట్ల వరకు ప్రైవేటు రంగంలో పెట్టింది. మోడీ ప్రభుత్వం వచ్చిన తదుపరి ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల శాతం చాలా వేగంగా పెరిగింది. ప్రభుత్వ రంగంలో ఎల్‌ఐసి పెట్టుబడులు ప్రతి సంవత్సరం కొంత శాతం పెరుగుతున్నది. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బీమా వ్యాపారం కొంత మందగించింది. 2021లో ప్రపంచ బీమా విలువ 6 శాతం క్షీణించింది. కాని మన దేశంలో ఎల్‌ఐసి వ్యాపార విలువ 6.8 శాతం పెరిగింది. అందుకే ప్రపంచంలోని 500 అత్యుత్తమ బ్రాండ్లలో ఎల్‌ఐసి స్థానం 238 నుంచి 206కు చేరింది. 2022లో ఎల్‌ఐసి మార్కెట్ విలువ 43.40 లక్షల కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు.

ఒకప్పుడు నష్టాలు వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలని నిర్ణయించారు. తర్వాత నష్టాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ రంగాన్ని మొత్తంగా అమ్మేయడానికి మోడీ సర్కార్ నిర్ణయించింది. అందుకే రైళ్ళు, రైల్వే స్టేషన్లు, రోడ్లు, విమానాశ్రయాలు, పెట్రో పైప్ లైన్లు, పెట్రోలియం కంపెనీలు, స్టీల్ కంపెనీలు అదీ ఇదీ అని లేకుండా అమ్మడమా లేదా లీజుకు ఇవ్వాలని నిర్ణయించుకుని ముందుకు సాగుతోంది. వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని, అందుకు ప్రైవేటు సంస్థలున్నాయని అంటున్నది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ ప్రభుత్వమూ వ్యాపారం చేయదని, కేవలం మధ్యవర్తిత్వం మాత్ర మే పోషిస్తుందని చెబుతున్నది. మన దేశం అప్పుడే అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరిందని మోడీ సర్కారు భ్రమపడుతోంది.

ఉపాధి పోయి, ఉద్యోగాలు రాక, అప్పుల పాలై, పంటలు చేతికందక కుటుంబాలకు కుటుంబాలే ఏటా లక్షల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్న దేశం మనది. కరోనా కాలంలో హఠాత్తుగా లాక్‌డౌన్ విధిస్తే వందల కిలోమీటర్లు కాలినడకన సొంతూళ్ళకు చేరుకున్న లక్షలాది అభాగ్యుల్లో అనేక వందల మంది దారిలోనే పిట్టల్లా రాలిపోయారు. వైద్యం అందక, ఖరీదైన వైద్యం చేయించుకోలేక లక్షలాది మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటికీ అనేక మౌలిక రంగాల్లో మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉన్న భారత్‌లో దేశాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ రంగాన్ని తెగ నరకడం సమంజసమేనా! భారత దేశంలో ఇప్పటి వరకు 18 వేల కోట్ల రూపాయలతో అతి పెద్ద పబ్లిక ఇష్యూ జారీ చేసిన సంస్థగా పేటిఎం మాతృసంస్థ రికార్డు కొనసాగుతోంది.

ఆ తర్వాత రూ. 15 వేల కోట్లతో కోల్ ఇండియా రెండో స్థానంలో నిలిచింది. కాని గత ఏడాది ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినపుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. లక్షా 75 వేల కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సంపాదించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే కొవిడ్ కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇప్పటి వరకు కేవలం కొన్ని వేల కోట్లు మాత్రమే సాధించగలిగారు. ఎల్‌ఐసి ద్వారా లక్ష కోట్లు సంపాదించి మూడింటి రెండు వంతుల టార్గెట్ అయినా సాధించాలని కేంద్ర ప్రభుత్వ గట్టిగా నిర్ణయించుకుంది.

దండంరాజు రాంచందర్ రావు
9849592958

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News