Thursday, January 9, 2025

నిరాశ పరచిన ఎల్ఐసి లిస్టింగ్

- Advertisement -
- Advertisement -
LIC listing at discount Price
8.62 శాతం డిస్కౌంట్ తో ఓపెనింగ్ 
లిస్టింగ్ ధర రూ. 867కు కంగుతిన్న మదుపరులు

ముంబై: దేశ స్టాక్‌ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపిఓగా నిలిచిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసి)  ఐపిఓ షేర్లు స్టాక్‌మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. 8.62 శాతం డిస్కౌంట్‌తో  రూ. 867 దగ్గర లిస్ట్ అయిన ఎల్ఐసి షేర్లు లక్షలాది మంది మదుపర్లకు నిరాశ మిగిల్చాయి. ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో మునిగిపోయిన సమయంలో ఎల్‌ఐసి లిస్ట్ కావడంతో ప్రతికూల ప్రభావం పడింది. సుమారు మూడు రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన ఐపిఓ తర్వాత ఎల్ఐసి షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి.

ఇష్యూ పరిమాణం కంటే దాదాపు మూడు రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపిఓ) తర్వాత ఎల్‌ఐసి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ కావడం గమనార్హం. ప్రభుత్వం ఎల్ఐసి షేర్ల ఇష్యూ ధరను ఒక్కొక్కటి రూ.949 గా నిర్ణయించింది. కానీ 8.62 శాతం డిస్కౌంట్‌తో రూ.867 దగ్గర ఎల్‌ఐసీ షేర్లు లిస్ట్ కావడంతో ఈ దిగ్గజ బీమా కంపెనీపై ఎంతో నమ్మకంతో బిడ్లు దాఖలు చేసిన చిన్న మదుపరులకు నిరాశ తప్పలేదు. ఐపిఓలో భాగంగా కంపెనీ 16,20,78,067 షేర్లను అమ్మకానికి పెట్టగా,  ఇష్యూ రెండో రోజైన గత గురువారం నాటికి 1.03 రెట్లకు సమానమైన (16,68,60,765) షేర్ల కొనుగోలుకు బిడ్లు లభించాయని స్టాక్‌ ఎక్స్ఛేంజీలు వెల్లడించాయి.

క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs) కోసం కేటాయించాల్సిన షేర్లు 2.83 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యాయి, అయితే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లది 2.91 రెట్లు,  రిటైల్ వ్యక్తిగత ఇన్వెస్టర్లు (RIIలు) 1.99 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేశారు. ఇవి కాకుండా, పాలసీదారుల భాగం 6.12 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, ఉద్యోగుల విభాగం 4.40 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది.

ఎల్‌ఐసి ఇష్యూకు పాలసీదారుల నుంచి భారీ స్పందన లభించింది. వారికి కేటాయించిన షేర్లకు ఇప్పటికే మూడు రెట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. కంపెనీ ఉద్యోగులకు రిజర్వ్‌ చేసిన షేర్లకు సైతం 2.21 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ లభించింది. ఇష్యూలో రిటైల్‌ మదుపర్లకు 6.9 కోట్ల షేర్లను కేటాయించగా.. అందులో 93 శాతం షేర్ల కొనుగోలుకు బిడ్లు లభించాయి. ఇంతా జరిగాక ఎల్‌ఐసీ షేర్లు ఆఫర్ ధరతో పోల్చితే 8.11 శాతం నష్టంతో లిస్ట్ కావడం మదుపర్లకు  ఊహించని పరిణామం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఎల్‌ఐసి షేర్లు రూ.872 వద్ద, బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో రూ.867.20 వద్ద నమోదు కావడం గమనార్హం. ఇది ఇనీషియల్ ఇష్యూ ధర కంటే చాలా తక్కువ. ఎల్‌ఐసి ఐపీఓ కోసం ఆశగా ఎదురుచూసిన మదుపరులు ఎల్‌ఐసి స్టాక్ రూ.900 నుంచి రూ.949 మధ్యలో అయినా లిస్ట్ అయ్యే అవకాశం ఉందన్న అంచనాల్లో ఉండగా… రూ.867 వద్ద షేర్లు లిస్ట్ కావడంతో కంగుతిన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News