Friday, December 20, 2024

లై డిటెక్టర్ టెస్టులో నిజంగానే నిజాలు తేలుతాయా?

- Advertisement -
- Advertisement -

నిందితుడు, అరడజన్ మందికి లైడిటెక్టర్ పరీక్షలు
కోల్‌కతా లేడీడాక్టర్ దారుణాంతంలో కీలక ఘట్టం
ఇప్పటికే మాజీ ప్రిన్సిపాల్‌కు పాలీగ్రాఫ్ టెస్టులు
కోల్‌కతా సిబిఐ ఆఫీసులో ఆఘామేఘాల చర్యలు
న్యూఢిల్లీ / కోల్‌కతా: దేశ వ్యాప్త సంచలనం, ఆక్రోశానికి దారితీసిన కోల్‌కతా ఆర్‌జి కార్ మెడికల్ కాలేజీ దుర్ఘటన దర్యాప్తు కీలక దశకు చేరుకొంటోంది. లేడీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మరో ఆరుగురికి నిజాల నిర్థారణ సంబంధిత లైడిక్టెర్ పరీక్షలు శనివారం ఆరంభమయ్యాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించారు. దారుణమైన ఘటన తరువాతి క్రమంలో కేసు నమోదు, రికార్డుల సాక్షాల చెరిపివేత, ఏకంగా క్రైమ్ సీన్ తారుమారు వంటి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇప్పటివరకూ ప్రధాన నిందితుడు ఇతరులు ఘటనకు సంబంధించి పొంతన లేని విధంగా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా కేసును పక్కదోవ పట్టించే క్రమంలో జరుగుతున్నదే అని కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ నిర్థారించుకుంది. బెంగాల్ హైకోర్టును సిబిఐ ఆశ్రయించిన దశలో నిందితులకు పాలీగ్రాఫ్ టెస్టులకు అనుమతి దక్కింది. దీనితో ఇప్పుడు నిందితుల వాదనలో నిజానిజాల నిర్థారణకు పూర్తి శాస్త్రీయం అని భావిస్తున్న లై డిటెక్టర్లను రంగంలోకి దించారు.

కాగా ఈ కేసుకు సంబంధించి కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, అత్యాచార ఘటన రాత్రి డ్యూటీల్లో ఉన్న నలుగురు డాక్టర్లకు కూడా ఇప్పుడు సిబిఐ కోల్‌కతా కార్యాలయంలో లైడిటెక్టర్ పరీక్షల ప్రక్రియ సాగుతోంది. ప్రత్యేకించి ప్రిన్సిపాల్ ఘోష్ తన అధికార ముసుగులో ఆసుపత్రిలో పలు అక్రమాలకు పాల్పడినట్లు, ఏకంగా శవాలు అమ్ముకోవడం, మందులు , వ్యర్థాల రవాణా సాగించినట్లు, చట్టానికి దొరకకుండా ఉంటూ తన ఏజెంట్లుగా ఆసుపత్రిలో పనిచేసే కింది స్థాయి సిబ్బందిని వాడుకున్నట్లు ప్రాధమికంగా తెలిసింది. అంతేకాకుండా లేడీడాక్టర్ ఉదంతంలో ముందుగా దీనిని ఆత్మహత్యగా పేర్కొనడం, పోలీసు కేసు నమోదు కాకుండా చురుగ్గా వ్యవహరించడం వంటి కీలక పరిణామాల మధ్య ఆయన చెపుతున్న నిజమెంత ? అనేది తేల్చుకోవడం కేసు పురోగతికి కీలకం అయింది.

కోల్‌కతా సాల్ట్‌లేక్ సిబిఐ ఆఫీసులో సందడి
కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని సిజిఒ కాంప్లెక్స్‌లో ఉన్న సిబిఐ కార్యాలయంలో శనివారం సందడి నెలకొంది. ఇక్కడికి శనివారం ఉదయం మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వరుసగా తొమ్మిదో రోజు చేరుకున్నారు. వెంటనే అక్కడి నుంచి ఆయనను టెస్టుల విభాగానికి తీసుకువచ్చారు. ఆయనతో పాటు ఇప్పుడు లై డిటెక్టర్ పరీక్షలకు గురవుతున్న వారిలో ఇద్దరు ఫస్ట్ ఇయర్ పిజి ట్రైనీ డాక్టర్లు కూడా ఉన్నారు. నేర ఘటన జరిగిన సెమీనార్ హాల్‌లోపల మెడికో మృతదేహం కన్పించిన చోట ఈ ట్రైనీ డాక్టర్ల వేలి ముద్రలు ఉన్నట్లు తేలడంతో వీరికి కూడీ లై డిటెక్టర్ టెస్టులు అవసరం అయ్యాయని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ (సిఎఫ్‌ఎస్‌ఎల్)కు చెందిన పాలీగ్రాఫ్ స్పెషలిస్టుల బృందం ఒకటి కోల్‌కతాకు చేరుకుంది. ఈ బృందం టెస్టులు నిర్వహిస్తుంది. ప్రత్యేకించి ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు జరిపే పరీక్షలు కీలకం కానున్నాయి.

గురువారం ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జరిపిన విచారణ క్రమంలో కోల్‌కతా పోలీసుల తీరును తప్పు పట్టింది. కేసును తప్పుదోవ పట్టించేందుకు అన్ని రకాలుగా అదృశ్య హస్తాలు యత్నిస్తున్నాయని పేర్కొంది. ఇదే రోజు సిబిఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. నేర ఘటన జరిగిన స్థలాన్ని కావాలనే మార్చివేశారని దీనితో సరైన సాక్షాలు చెరిపివేసేందుకురంగం సిద్ధం అయిందన్నారు. ఇక ఆర్‌జి కార్ ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో జరిగాయని చెపుతున్న ఆర్థిక అక్రమ వ్యవహారాలపై దర్యాప్తును సిబిఐ తన ఆధీనంలోకి తీసుకుంది. రాష్ట్ర నియుక్త సిట్ నుంచి కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ బెంగాల్ హైకోర్టు వెలువరించిన ఆదేశాల మేరకు సిబిఐ రంగంలోకి దిగింది. అన్నింటిని తన దర్యాప్తు క్రమంలోకి తీసుకుంది.

లేడీడాక్టర్ల నిరసన క్రమంలో ఆసుపత్రిపై దాడి ఘటన మర్మం?
లేడీడాక్టర్‌పై హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఆసుపత్రిలోపల జరిగిన విధ్వంసకాండ ఇప్పుడు మిస్టరీగానే నిలిచింది. అక్కడికి వచ్చిన వారు ఎవరు? దుండగులకు పోలీసులు వీలు కల్పించారా? లోపలికి చేరిన వారి విధ్వంసకాండ క్రమంలో అక్కడి కీలకమైన సాక్షాలు ధ్వంసం అయ్యాయా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News