ఎన్నికలలో ప్రజలను నమ్మించేందుకు అన్ని పార్టీలు కూడా ఒక మేరమితి మీరిన వాగ్ధానాలు చేయటం, పరస్పర ఆరోపణలు చేసుకోవటం ఎప్పుడూ ఉన్నదే. కాని మనం ఈసారి చూస్తున్నంతగా అబద్ధాలు, పరస్పర దూషణలు గతంలో ఎన్నడూ లేవు. ఇపుడు ఏ రోజు పత్రికలు చూసినా, టీవీలు, యూట్యాబ్‌లు చూసినా కొద్దిసేపైనా కాకుండా మనకు అలసట కలిగి తల తిరిగి పోతున్నది. పోటీ జరిగేది పార్టీలు, అభ్యర్థుల మధ్యనా లేక ఇరువురి అబద్ధాల మధ్యనా అనే సందేహం కలుగుతున్నది.
అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించినపుడు ఆ విషయమై ప్రజల వద్ద ప్రచారాలు చేసుకోవాలి. కాని ఆ పని తగ్గుతూ అబద్ధాలు, ఆరోపణలు, చివరకు ఎన్నడూ లేని విధంగా వ్యక్తిగత దూషణలు పెరుగుతున్నాయి. వారిని ఇందుకు పురికొల్పుతున్నది ఏమై ఉంటుంది? ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఎందుకీ పతనాలు? ఆలోచించినా మీదట ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, పార్టీలపై, అభ్యర్థులు రాజకీయంపై, ఒక వేళ అధికార పక్షాలు అయినట్లయితే వారు తమ పాలనా కాలంలో చేసిన మంచిపట్ల ప్రజలకు విశ్వాసాలు తగ్గుతున్నాయి.
అయినప్పటికీ అధికారం కోసం గెలవక తప్పదు. అది జరగాలంటే ప్రజలను తమ ఘనత గురించి, లేదా తమ అబద్ధాలతో, లేదా ప్రత్యర్థులపైన ఆరోపణలతో ఏదో ఒక విధంగా మెప్పించాలి. ఆ విధంగా తమ స్వంత వైఫల్యాలను, బలహీనతలను ప్రజల దృష్టిలో మరుగునపడేట్లు చేయాలి. వైఫల్యాలు, లోపాలు ఎంత ఉంటే తమ పట్ల ప్రజలకు ఎంత అపనమ్మకం ఉందనుకుంటే అంతగా, వాటిని మరపింపజేసేందుకు, ప్రజల దృష్టిని పక్క దారి పట్టింంచేందుకు, తమ అబద్ధాలు, ఆరోపణలు, దూషనలతో అంత హంగామా సృష్టించాలి. దీనిని పొగబాంబుల ప్రచారం అనవచ్చునేమో. ఇద్దరూ పొగబాంబులు విసురు తారు. ఉక్కిరి బిక్కిరియేది ప్రజలు, ప్రజాస్వామ్యం.
ఇది ఒకటి కాగా, రెండవది పార్టీలు ఏవి అయినపుటికీ అభ్యర్థులుగా వ్యక్తులు స్థాయి, సంస్కృతి, సంస్కారం, నాగరికత, ప్రజాస్వామిక విలువలు పతనమవుతుండటం. మరొక వైపు అధికారం పట్ల , సంపదలను పోగుచేసుకోవడం పట్ల దాహం పెరుగుతుండటం. ఈ విధంగా పైన చెప్పుకున్న మొదటి కారణం, ఈరెండవ కారణం కలగలిసినపుడు మనకు ఈ విధమైన ధోరణులే కనపిస్తాయి. అవి ఎన్నికలు ప్రచారాలు కావచ్చు, మరొకటి కావచ్చు. అసందర్భం కాదనుకుంటే మరొకటి కూడా చెప్పాలి. అది పార్టీల మార్పిడి. ప్రస్తుతం మనం చూస్తున్న స్థాయిలో గాని, ఆపద్ధతిలో ఎపుడు ఎటుపోతారో ఊహించలేకపోవటంగాని పార్టీ మార్పిడులు లోగడ ఎప్పుడూ లేవు. ఇందుకు ఏకైక కారణం పదవీ దాహం, ధన దాహం, విలువల పతనమనేది స్పష్టం.
ఈ సందర్భంలో అర్ధం చేసుకోవలసింది మరొకటి ఉంది. ఈ విధమైన పరిణామాలకు మూలూలు రెండింటిలో ఉన్నాయి. ఒకటి, మనకు స్వాతంత్రం లభించినప్పటి నుంచి పాలించిన పార్టీలు గాని, తర్వాత ఉనికిలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలు, కులపార్టీలు, వేర్వేరు సిద్ధాంతాల పార్టీల గాని క్రమంగా తమ పరిపాలనలో విఫలమవుతూ వచ్చాయి. మరొక స్థాయిలో తమ సిద్ధాంతాలకు దూరమవుతూ వచ్చాయి. ఆ విధంగా ప్రజలకు దూరమవటం, బలహీనపడటం జరిగింది. కాంగ్రెస్‌తో సహా అవన్నీ చెల్లా చెదురుకావటం మొదలైంది. ఒకవైపు ఈ క్రమం జరుగుతుండగా మరొకవైపు 1990 ప్రాంతంలో ఆర్ధిక సంస్కరణలు అనే పెను తుఫాను ఒకటి మొదలైంది. అది వ్యక్తులు, నాయకులు, పార్టీలు సంస్థల ప్రాపంచిక దృక్పథాన్ని గణనీయంగా ప్రభావితం చేయసాగింది. దాని పర్యవసానంగా వ్యక్తుల జీవిత లక్షాలు, కోరికలు, మానసికతలు, ప్రవర్తనలు కూడా వారికి తెలిసి కొంత, తెలియకనే కొంత మారంటం, వారు తమ వెనుకటి ఆలోచనలను, సిద్ధాంతాలను మార్చుకుని సరికొత్త మార్గాలలోకి వెళ్లటం మొదలైంది. అపుడిక ఎవరు, ఎప్పుడు ఎక్కడ ఉంటారో,అక్కడ ఉండేది ఎంత కాలమో ఎవరికీ, తెలియని పరిస్థితి ఒకటి క్రమంగా రూపు తీసుకున్నది.
ఇందుకు దోహదం చేసిన మరొక ముఖ్యమైన పరిణామం బాబ్రీ మసీదును కేంద్రంగా చేసుకుని సాగిన రాజకీయం. అది ఆర్థిక సంస్కృరణల కన్నాముందే మొదలై, అప్పటి నుంచి మూడు దశాబ్ధాలు గడిచిన తర్వాత కూడా నేటికీ కొనసాగుతున్నది. ఆర్థికంపై పరిపాలనపై దాని నికరమైన ప్రభావం ఏమున్నా లేకపోయినా, రాజకీయాలపై, సమాజంపై పెనుమార్పులను తెచ్చిపెట్టింది. ఆ మార్పులు కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలన్నింటిపై కనిపించాయి. చివరకు వామపక్షాలపై కూడా. వారు వరుసగా 34 సంవత్సరాలు పాలించిన బెంగాల్‌లో, తమ అధికారం పోగానే తమ శ్రేణులు పెద్ద ఎత్తున బిజెపిలోకి వెళ్లటం ఇందుకు తార్కాణం.
అందువల్ల ఈ పరిణామాలన్నింటి ప్రభావాలు కూడా వ్యక్తులపై, పార్టీలపై పడటానికి, ప్రస్తుతం మనం చర్చిస్తున్న విధంగా ఇతర పార్టీలు బలహీన పడటానికి, విలువల పతనానికి, పార్టీల విచ్ఛిన్నతలకు సంబంధిం ఉంది. ఈ రోజున అందరూ రాజకీయాధికార సాధన, ధన సంపాదనలన్నదే ఏకైక థ్యేయంగా మారి, ఈ విధంగా అబద్ధాలు, ఆరోపణలు దూషణలు చేసుకోవటానికి మూలాలు ఇంత వరకు చెప్పకున్న వాటిలో ఉన్నాయి. మనమంతా చిన్నపుడు చీమా చీమా ఎందుకు కుట్టావనే కథ చదువుకున్నాము. అది, పసిపాపను ఒక చీమ కుట్టటంతో మొదలై వెనుకకు పోతూపోతూ, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని ఆ చీమ ప్రశ్నించే వరకు వెళుతుంది. ఈ అబద్ధాలు, ఆరోపణలు, దూషణల కథ కూడా అంతే.
ఇదంతా అంతిమంగా భారతదేశం, ప్రజలు, ప్రజాస్వామ్యం చేసుకున్న దురదృష్టంగా తేలుతుంది. మనకు మొత్తం ప్రపంచంలోనే మహత్తరమైన ఉద్యమాలు, పోరాటాల, త్యాగాల ఫలితంగా వలస పాలన నుంచి స్వాతంత్రం లభించింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఈ సువిశాల దేశంలోని అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాల ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేసారు. అన్ని ప్రాంతాలు, అందరు ప్రజల ఆకాంక్షలను, భవిష్యత్ స్వప్నాలను ప్రతి ఫలిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాము. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా స్వామ్యమంటారు. కాని, స్వాతంత్య్రం సాధించుకున్న75 సంవత్సరాల తర్వాత మనది ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్యం మాత్రం కాలేదు.
అందుకు విరుద్ధంగా, ప్రపంచ ప్రజాస్వామ్యాలలో ఇండియా ర్యాంకు ఈ రోజున 105కు పతనమైంది. ఎన్నకైన నియంతృత్వమనే అపఖ్యాతిని తెచ్చుకుంది. పైన చెప్పుకున్నట్లు అబద్ధపు ఎన్నకల ప్రచారాలు శృతిమించటం, గతంలో ఎన్నడూలేని స్థాయిలో ఆరోపణలు, దూషణలు ఈ పతనానికి ప్రతి ఫలనాలే. ఈ స్థితిని నాయకులు పార్టీలు మార్చబోవటం లేదు. ఆ బాధ్యత ప్రజలది, యువతరానిది, చదువుకున్న వారిదే. వారు చొరవ తీసుకుంటే, చైతన్యంలో కొరత ఏమీ లేని సాధారణ ప్రజలు తప్పక వారి వెంట నడుస్తారు.
టంకశాల అశోక్
9848191767