Tuesday, November 26, 2024

అఫ్ఘాన్ మహిళల హాహాకారాలు!

- Advertisement -
- Advertisement -

ప్రపంచ మానవాళికి నాయకత్వం వహిస్తున్నామంటూ నిత్యం నీతులు చెప్పే అనేక అంతర్జాతీయ వేదికలు, పలు దేశాల కూటములు, పలు దేశాధినేతలు తమ కళ్లెదుటే గతం 20 నెలలకు పైగా అఫ్ఘానిస్తాన్‌లో మహిళలు, బాలికలు బానిసత్వం కన్నా హీనమైన జీవనాన్ని గడుపుతుంటే ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటు. ఆగస్టు 2021లో కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, మహిళలు, బాలికల హక్కులను గౌరవిస్తామని తాలిబాన్లు మొదట వాగ్దానం చేసినప్పటికీ అఫ్ఘానిస్తాన్‌లో నేడు వారి పరిస్థితి ఎంత దారుణంగా క్షీణిస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇస్లాం అనుసరించే దేశాల్లో సహితం అంత కర్కశంగాలేదు. తాలిబన్లు బహిరంగ వేదికల నుండి మహిళలు, బాలికల ఉనికిని పూర్తిగా తొలగించే స్పష్టమైన లక్ష్యంతో కొత్త, కొత్త ఆంక్షలను ప్రవేశపెడుతూనే ఉన్నారు.

గత 20 ఏళ్లలో అఫ్ఘాన్ మహిళలు సాధించిన పురోగతిని ఇప్పుడు రద్దు చేసినట్లవుతుంది. పునరుత్పత్తి హక్కుల నుండి పాఠశాల నమోదు వరకు, పాలనలో పాల్గొనడం నుండి లేబర్ మార్కెట్ యాక్సెస్ వరకు మహిళలు సాధించుకున్న స్వాతంత్య్రాలను ఇప్పుడు తిరిగి కోల్పోవలసి వస్తున్నది. వాస్తవానికి అఫ్ఘాన్ మహిళలు ప్రపంచంలోనే ప్రగతి కాముకులుగా పేరొందారు. అక్కడ తాలిబన్ల నిరంకుశ పాలన ప్రారంభం కావడానికి ముందు 1990వ దశాబ్దం ప్రారంభంలో అఫ్ఘానిస్తాన్‌లో 40 శాతం మంది వైద్యులు మహిళలు. పాఠశాల ఉపాధ్యాయుల్లో 70 శాతం, యూనివర్సిటీ ప్రొఫెసర్లలో 60 శాతం, యూనివర్శిటీ విద్యార్థుల్లో దాదాపు సగం మంది మహిళలు కూడా ఉన్నారు. ఇదంతా ఇప్పుడు దారుణంగా మారిపోయింది. నేడు మహిళా అక్షరాస్యత 14 శాతం మాత్రమే. గతంలో 1996- 2001 మధ్య తాలిబన్ల పాలనలో అనుసరించిన అత్యంత తిరోగమన విధానాల ఫలితంగా వారి పరిస్థితి దారుణంగా మారింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల కాలంలో మహిళలు కొంతమేరకు కోలుకుంటున్న సమయంలో ఇప్పుడు 20 నెలలుగా తిరిగి నెలకొన్న తాలిబన్ల పాలనలో తిరిగి చీకటి యుగం వైపు పయనిస్తున్నారు.

తాలిబాన్ విధానాలు మహిళలు, బాలికలను వారి జీవితంలోని దాదాపు అన్ని అంశాలలో మరింత అణచివేతకు దారితీస్తున్నాయి. అఫ్ఘానిస్తాన్‌లో బాలికలు, మహిళలను విస్తృతంగా, క్రమబద్ధంగా లొంగదీసుకోవడం వారి మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలను ఉల్లంఘించడమే అవుతుంది. రాజకీయ, ప్రభుత్వ రంగాలలోని కాకుండా ఆధునిక విద్యకు కూడా వారిని దూరం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలకు మించి చదువుకోలేని దుస్థితి ఏర్పడింది. విశ్వవిద్యాలయంలో చదువును కొనసాగించకుండా నిరోధించడంతో పాటు వారి వృత్తిపరమైన అవకాశాలను సహితం పరిమితం చేశారు. లింగ -ఆధారిత హింస నుండి బయటపడిన వారికి మద్దతు ఇచ్చే సంస్థాగత ఫ్రేమ్ వర్క్‌ను రద్దు చేశారు. చివరకు ఒంటరిగా ప్రయాణించడంపై కూడా ఆంక్షలు పెట్టారు. కఠినమైన దుస్తుల కోడ్ మహిళల పట్ల చూపుతున్న వివక్షకు పరాకాష్ఠ.
‘నైతిక నేరాలు’ చట్రంలో నిర్బంధాలకు గురిచేస్తున్నారు. అసమ్మతి తెలిపిన మహిళలు చట్టవిరుద్ధమైన అరెస్టులు, చిత్రహింసలు, ఇతర దుష్ప్రవర్తనను ఎదుర్కొన్నారు. ఒక విధంగా సామాజిక జీవనం నుండి వారిని వెలివేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. వారిని రెండో తరగతి పౌరులుగా మార్చారు. లింగ సమానత్వం, మహిళల హక్కులపై దశాబ్దాల పురోగతి కేవలం నెలల్లో అక్కడ తుడిచిపెట్టుకుపోయిందని యుఎన్ మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ పరిపాలనలో మహిళలకు కేబినెట్ పదవులు లేవు. పైగా, మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా రద్దు చేయడంతో పాటు రాజకీయ భాగస్వామ్యానికి మహిళల హక్కును సమర్థవంతంగా తొలగించారు. అవసరమైన సందర్భాల్లో తప్ప తమ ఇళ్లలోనే ఉండాలని ఆంక్షలు విధిస్తూ, ఒకవేళ వెళ్ళవలసి వస్తే మగతోడు ఉండాల్సిందే అని స్పష్టం చేశారు.

మహిళలకు విద్యాబోధన చేయడం ఇస్లాంకు విరుద్ధమని, హిజాబ్ ధరించడం ఇప్పుడు అవసరమని తాలిబాన్లు విశ్వసిస్తున్నారు. మగ సంరక్షకుడు లేకుండా మహిళలు పనికి వెళ్లలేరు లేదా స్వేచ్ఛగా ప్రయాణించలేరని భావిస్తున్నారు. తాలిబాన్ల ఆధీనంలోకి వచ్చినప్పటి నుండి లక్షలాది మంది బాలికలు, యువతులు పాఠశాలకు దూరమయ్యారు. ప్రజల ఒత్తిడి కారణంగా కొన్ని ప్రావిన్సులలో బాలికల కోసం కొన్ని పాఠశాలలు పునఃప్రారంభించినా దేశంలోని చాలా పాఠశాలలు మూసివేశారు. ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం 20% మంది అబ్బాయిలతో పోలిస్తే 45% కంటే ఎక్కువ మంది బాలికలు తాము పాఠశాలకు వెళ్లడం లేదని చెప్పారు. అందుకు ఆర్థిక సవాళ్లు, బాలికల విద్య పట్ల సమాజ వైఖరి వంటి అడ్డంకుల కారణం అవుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల కారణంగా 26 శాతం మంది అఫ్ఘాన్ బాలికలు మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారని ఒక అధ్యయనం తెలిపింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్ధిక దురవస్థల కారణంగా బాల్య వివాహాలు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒక నివేదిక ప్రకారం కుటుం బం ఆర్ధిక దుస్థితి కారణంగా తాము బాల్య వివాహాలకు గురికావలసి వచ్చిన్నట్లు చెప్పిన బాలల్లో 88 శాతం మంది బాలికలే ఉన్నారు.

మరోవంక, ఉద్యోగాలు మానివేసి ఉగ్రవాదులను వివాహం చేసుకోమని వత్తిడులు కూడా చేస్తున్నారు. తమ ప్రాంతాల్లో 15 ఏళ్ళు పైబడిన యువతులు, 45 ఏళ్ళ లోపు వయస్సు గల విధవల జాబితాలు తయారు చేయమని ముల్లాలను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ విధమైన బలవంతపు వివాహాలకై వత్తిడి తెస్తున్నారు. తాలిబన్ల తీవ్రమైన ఆంక్షలు, మహిళలు, బాలికల హక్కులపై చట్టవిరుద్ధమైన అణచివేతలను లింగ వేధింపులను మానవాళికి వ్యతిరేకంగా అంతర్జాతీయ చట్టం ప్రకారం సాధ్యమయ్యే నేరాలుగా పరిశోధించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ ఓ ఉమ్మడి నివేదికలో పేర్కొన్నాయి.

‘మహిళలపై తాలిబాన్ల యుద్ధం: అఫ్ఘానిస్తాన్‌లో లింగ వేధింపుల మానవత్వంపై నేరం’ పేరుతో విడుదల చేసిన నివేదికలో అఫ్ఘానిస్తాన్‌లోని మహిళలు, బాలికల హక్కులపై తాలిబన్ల క్రూరమైన ఆంక్షలు, జైలు శిక్ష, బలవంతంగా అదృశ్యం వంటి వాటిపై వివరణాత్మక విశ్లేషణను అందజేస్తుంది. అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితిపై కొనసాగుతున్న దర్యాప్తులో అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ప్రాసిక్యూటర్లు లింగ హింసకు సంబంధించిన మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాన్ని కూడా చేర్చాలని వారు సూచించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తాలిబాన్లను న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి సార్వత్రిక అధికార పరిధిని లేదా ఇతర చట్టబద్ధమైన మార్గాలను ఉపయోగించాలని అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాలకు పిలుపిచ్చాయి. ‘తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, అఫ్ఘానిస్తాన్ మహిళలు, బాలికల హక్కులపై కఠినమైన ఆంక్షలు విధించారు. ఎటువంటి సందేహం లేదు: ఇది మహిళలపై యుద్ధం – వారిని ప్రజా జీవితం నుండి నిషేధించారు; విద్యను అందుబాటులో లేకుండా నిరోధించారు. వారిని పని నుండి నిషేధించారు. స్వేచ్ఛగా కదలకుండా అడ్డుకుంటున్నారు.ఈ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అణచివేతకు గురిచేస్తున్నారు. ప్రతిఘటించినందుకు జైలులో, అదృశ్యమై, హింసకు గురవుతున్నారు.

ఇవి వ్యవస్థీకృతంగా, విస్తృతంగా, క్రమబద్ధంగా ఉన్న అంతర్జాతీయ నేరాలు’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లామర్డ్ పేర్కొన్నారు. అఫ్ఘానిస్తాన్‌లో హింస నుండి పారిపోతున్న మహిళలు, బాలికలను అంతర్జాతీయ రక్షణ అవసరమయ్యే శరణార్థులుగా ఎందు కు పరిగణించబడాలనే అంశంపై చట్టపరమైన అంచనాను కూడా ఈ నివేదిక అందిస్తుంది. న్యాయం, జవాబుదారీతనం, మానవాళికి వ్యతిరేకంగా జరిగిన లింగ హింసకు వ్యతిరేకంగా జరిగే నేరాలకు నష్టపరిహారాన్ని నిర్ధారించడానికి అవసరమైన బలమైన ప్రతిస్పందనకు పునాది వేయడానికి ఐక్యరాజ్యసమితి నిపుణులు, మహిళా హక్కుల సంఘాలు ఇప్పటికైనా నిర్దుష్టమైన కార్యాచరణను చేపట్టాలి. వచ్చే అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశాలలో అఫ్ఘానిస్తాన్‌లో మహిళలు, బాలికల స్థితిగతులపై, మానవ హక్కుల పరిస్థితులపై చర్చలు జరుగనున్నాయి. అఫ్ఘానిస్థాన్‌లో లింగ హింస, ఇతర సంబంధిత నేరాలపై అంతర్జాతీయ సమాజాన్ని మేల్కొల్పి, నిర్దుష్టమైన కార్యాచరణకు పురికొల్పే విధంగా చేసేందుకు పౌర సమాజ ఉద్యమకారులకు ఇదొక్క మంచి అవకాశం కాగలదు.

ఈ సందర్భంగా అఫ్ఘానిస్తాన్‌లో మానవ హక్కుల పరిస్థితులపై స్పెషల్ రాపోర్టర్ పరిధిని పునరుద్ధరించాలి. మరింత బలోపేతం చేసి అంతర్జాతీయ చట్టం ప్రకారం నేరాలను పరిశోధించి, స్వతంత్ర అంతర్జాతీయ జవాబుదారీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. తమ నేరాలకు తాలిబన్లను జవాబుదారీతనం కావించడం ద్వారా, అంతర్జాతీయ చట్టం ప్రకారం తగు విచారణను ఎదుర్కొనేటట్లు చేయడం ద్వారా వారి దుర్మార్గాలకు బలవుతున్న ఆఫ్ఘాన్ మహిళలు, బాలికలకు తగు న్యాయం కావించాలని అంతర్జాతీయ న్యాయ నిపుణుల కమిషన్ సెక్రటరీ జనరల్ శాంటియాగో ఎ. కాంటన్ స్పష్టం చేశారు. ఇంతగా వేధింపులకు గురవుతున్నా, మొత్తం ప్రపంచం, ప్రపంచ నేతలు నిస్సహాయంగా, నిస్సత్తువుగా ప్రేక్షక పాత్రకు పరిమితమవుతున్నా అఫ్ఘాన్ మహిళలు మాత్రం తాలిబన్ల అకృత్యాలకు, కర్కశ వేధింపులకు లొంగిపోవడం లేదు. నిత్యం వారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఆంక్షలను, అణచివేతలు లెక్కచేయకుండా తమ గొంతెత్తి అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొన్ని పట్టణ ప్రాంతాలలో మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో సహితం నిత్యం నిరసనలకు దిగుతున్నారు. ఒక విధంగా వారి స్థైర్యం, సాహసం విస్మయం కలిగిస్తోంది.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News