మహబూబ్‌నగర్‌లోని అర్బన్ ఎకో పార్కులో నాటిన భారీ వృక్షాలు
హైదరాబాద్ : వంద సంవత్సరాల చరిత్ర కలిగిన భారీ వృక్షాలను ట్రాన్స్ లొకేషన్ ద్వారా కెసిఆర్ అర్బన్ ఎకో పార్కుకు తరలించి.. నాటించినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంత్రి చొరవతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్, వట ఫౌండేషన్ సహకారంతో ట్రాన్స్‌లొకేషన్ చేపట్టినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో అధునాతన వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్న వంద సంవత్సరాలపైన చరిత్ర ఉన్న నాలుగు వృక్షాలను ట్రాన్స్ లొకేషన్ ద్వారా కెసిఆర్ అర్బన్ ఎకో పార్కుకు తరలించి ఏర్పాటు చేశారు.
అర్బన్ ఎకో పార్కులో నాటిన వృక్షాలను మంత్రి పరిశీలించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహకారంతో వృక్షాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుంచి పెకిలించి అలాగే తీసుకెళ్లి ఎకో పార్క్ లో నాటించామని మంత్రి వెల్లడించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్, రాఘవలకు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు నేతృత్వంలో వృక్షాలను రీ ట్రాన్స్లోకేషన్ చేసి అర్బన్ ఎకో పార్క్ లో నాటించడంలో కృషి చేసిన ఈఈ విజయభాస్కర్, ఇంజనీరింగ్ అధికారులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో డిసిసిబి ఉపాధ్యక్ష్యులు కొరమోని వెంకటయ్య, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షలు రాజేష్ ఉన్నారు.