మన తెలంగాణ/హైదరాబాద్: భర్తను హతమార్చిన కేసులో భార్యకు జీవిత ఖైదు శిక్ష పడింది. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. దీంతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సంతపల్లి గ్రామానికి చెందిన బసవరేఖకు ఈ శిక్ష పడింది. ఈ మేరకు రాచకొండ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం, బండారి శ్రీను మేనమామ బిడ్డ బసవరేఖను పెళ్లి చేసుకున్నాడు. వారికి కూతురు, కొడుకు సంతానం. అయితే, భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నదని శ్రీను తరుచూ అనుమానించేవాడు. మద్యపానానికీ బానిసయ్యాడు. ఈ విషయమై వారి మధ్య గొడవలు జరిగేవి. బసవరేఖను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు.
అలాగే 2020 ఫిబ్రవరి 23న వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో శ్రీను ఓ పోల్ పై పడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని బసవరేఖ ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. వారు శ్రీను, బసవరేఖ, వారి పిల్లలను తమ వెంట తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత రాత్రి నిద్రలేచిన శ్రీను పిల్లలను తీసుకుని తమ ఇంటికి బయల్దేరే ప్రయత్నం చేశాడు. పిల్లలను తీసుకెళ్లకుండా బసవరేఖ అడ్డుకుంది. ఈ క్రమంలోనే గొడవ ముదిరింది. శ్రీనును నెట్టేయడంతో గోడకు గుద్దుకుని కిందపడిపోయాడు. అప్పుడు బసవరేఖ దిండును తీసుకువచ్చి ముఖంపై ఉంచి ఊపిరాడకుండా చేసింది. శ్రీను మరణించాడు. బండారి శ్రీను అన్న నరసింహా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోచంపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. సాక్ష్యాధారలు కలెక్ట్ చేసుకుని చార్జిషీట్ ఫైల్ చేశారు. సోమవారం కోర్టు విచారిస్తూ దోషిగా తేల్చి జీవిత ఖైదు శిక్షను బవసరేఖకు విధించింది. రూ. 10వేల జరిమానా విధించింది.