Monday, December 23, 2024

కవిత్వంతో ఆకాశయానం

- Advertisement -
- Advertisement -

కవిత్వం, జీవితం వేర్వేరు కాదని ఈ కవి (ముకుంద రామారావు) నమ్మకం. ఇతను గొప్ప సంపన్నుడు. చేతుల్లో అనేకానేక వస్తువులు, రూపాలు సిద్ధంగా వుంటాయి. సుదీర్ఘ ప్రయాణంలో సున్నితత్వం, సూటితనం, సరళతలు ఇతను సంపాదించుకున్న ఆస్తిపాస్తులు. ఒక మామూలు వస్తువును జీవితంతో ముడివేసి తాత్వికత స్థాయిని చేరుకోవడంలో ముందుంటారు. వర్తమానం మీద గతం తాలూకు ముద్రలు చెరిగిపోకుండా తాజా కవిత్వాన్ని పండించడంలో ఈ కవి ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేం.
2014లో ఊపిరి పోసుకున్న కవితా సంపుటి ‘ఆకాశయానం’. పైన చెప్పుకున్న విలక్షణతలన్నీ నింపుకున్న సంపుటి. జీవితాన్ని వ్యాఖ్యానించడానికి అవకాశం ఉన్న చోటల్లా తాజాగా ఓ వాక్యాన్ని నిర్మించడంలో ఈ కవి కనబర్చిన నేర్పు సంపుటిలో అనేక చోట్ల తారసపడుతుంది.విమాన ప్రయాణం వంకతో ఎంత తాత్వికతను జోడించి మన ముందు వాక్యమై కురిసారో చూడండి.

‘రాకపోకల జీవితం
జాగ్రత్తలు భయాలు సలహాలు
సందేహాల సంగమం కదా
ఎక్కడికి ఎలా చేరాలన్నా
తప్పించుకోలేనివి
తప్పనివి ప్రయాణాలు.’
(ఆకాశయానం. పేజీ: 29)
‘వీడ్కోలు బాధాకరమే
అయినా ఎల్లకాలం ఎవరుండి పోతారు
ప్రేమ ముఖ్యం ఎంత దగ్గరున్నా దూరమైనా’
(నిశ్శబ్దానికి అటు ఇటు. పేజీ: 31)

ఎల్లకాలం ఎవరూ ఉండరు అనేది ఎవరైనా చెప్పే మాటే. ప్రేమ ముఖ్యం ఎంత దగ్గరున్నా దూరమైనా అని చెప్పడానికి మాత్రం జీవితాన్నీ మనిషినీ అమితంగా ప్రేమించే ముకుంద రామారావు లాంటి కవి కావాలి.
‘మట్టిలో కలిసిపోయిన
పూవుల మరణాల్లా
కనిపించే జీవితాల కంటే
కనబడని జీవితాల నిశ్శబ్దాలే ఎక్కువ’
(పుస్తకాలు. పేజీ:34)
ఇంత చిక్కని వాక్యం రాయడానికి అతన్ని ప్రేరేపించిన వస్తువేమిటో తెలుసా, పుస్తకాలు. అద్దం అనే సాదాసీదా వస్తువును అడ్డం పెట్టుకొని కవి చెప్పిన మాట ఇది:
‘శుభ్రపరిస్తే తప్ప
దేహంలోని ఆత్మలానే
అద్దంలో శరీరం’

(అద్దం. పేజీ:18)

జీవితం మరణం ఒకదానికి మరొకటి పూరకాలు. ఈ చేదు వాస్తవికతను చెబుతూ ఏమన్నారో పరిశీలించండి:
‘మరణం జీవితాన్ని
జీవితం మరణాన్ని
గాఢ ప్రేమికుల్లా
హత్తుకోవాలనే చూస్తాయేమో’
(మరణానికి ముందు మరణాలు. పేజీ: 26)
ఎంతో సరళంగా దాదాపు వచనమైపోతున్నట్టు వుండే వాక్యాల్లోనూ కవిత్వమై బయటపడతారు. ఈ వాక్యాలు చదవండి:
‘ప్రవేశ ద్వారాలు
నిష్క్రమణ ద్వారాలు ఎప్పుడూ చూడలేదు
అదృశ్యంగా ఎలా చేరతానో
ఎలా బయటపడతానో నాకూ తెలీదు
ఎవరికీ తెలియకుండా రహస్యంగా
దృశ్యంలో భాగమవడమే నాకు తెలుసు’

(పోగొట్టుకున్నవే ఎక్కువ. పేజీ: 20)
చివరి పంక్తులు కవితను నిలబెట్టడం పాఠకుడి దృష్టి నుండి దాటిపోదు. ఏం రాసినా మనిషి మీద కవిది తరగని ప్రేమ. మతం పేరిట, దేవుడి పేరిట మానవ బాంబులుగా మారుతున్న మనిషినీ సమాజాన్ని ఇలా ఆక్షేపిస్తున్నారు:
‘కనిపించని దేవుడు మాత్రం
ఎవరికీ దొరకని తీవ్రవాది
మానవబాంబుల సృష్టకర్త’
(సూత్రధారి తీవ్రవాది ఒకడేనా? పేజీ:16)
‘ఒకే ఆకాశం కింద
కిటికీ బయటా లోపలా
ముక్కలైన ప్రపంచలో ముడుచుకుని
నువ్వూ నేనే

బతికినన్నాళ్ళూ నీదినాదని’ (నీది నాదని. పేజీ:12)
ఎంత వయస్సు మీదపడ్డా కొత్తదనం చేయి వీడని పసిపిల్లాడు కవి. మామూలు దృశ్యాలు అనేకం తాజాగా కనిపిస్తాయి ఈ సంపుటిలో. కొన్ని కవితావాక్యాల్ని చూద్దాం:
‘సూర్యకాంతిని హత్తుకుని రాళ్ళ మీద తలబాదుకుంటున్న ఇంద్రధనుస్సు’ (నయాగరా). జలపాతాన్ని రాళ్ళ మీద తల బాదుకుంటున్న ఇంద్రధనుస్సు అని చెప్పిన కవి ఎవరైనా ఉన్నారా? ‘కిరణాల్ని పట్టుకుని/ కనుమరుగయే వరకూ/ ఎగరేసుకుంటున్న గాలిపటం/సూర్యుడు’ (చలదృశ్యాలు) అనీ – ‘నదులూ సముద్రాలన్నింటిలో/ రోజుకొక వేషంలో / మునిగి తేలుతున్న/చంద్రుడు’ అనీ రాసిన కవి కూడా నాకు తెలిసి ఎవరూలేరు. ‘మానవారణ్యాల సుడిగాలికి /నేల రాలుతున్న కన్నీటి బొట్లు చెట్లు’ (వెలుగుపువ్వు విచ్చుకున్నాక..). ఇక్కడ గమనింపుతో కూడిన తాజాదనం వాక్యాన్ని గాఢతతో నింపడాన్ని చూడొచ్చు. ‘మూలన పడున్న/ ముసలి కుక్కలా/ ఆ ఇల్లు’ (పాతింట్లో ఒంటరి ముసలాయన). వర్షం దారాలకు/ తోలుబొమ్మలా వేలాడుతూ/ అనాదిగా నర్తిస్తోంది భూమి/ నగ్నంగా/ ధైర్యంగా/ఆశగా’ (వర్షం). ‘కలల్ని, జ్ఞాపకాల్ని/ తల కింద మడిచి ఉంచిన/మరో మెదడు/దిండు’ (పోగొట్టుకున్నవే ఎక్కువ). వస్తువుల మీద రాసిన కవిత్వాన్ని కాస్త చిన్నచూపు చూస్తున్న అస్థిత్వ ఉద్యమాల కాలంలో దిండును ఇంత గొప్పగా కవిత్వం చేశాక, ఎవరైనా మాట్లాడ్డానికి ఏముంటుంది?
కొన్ని కవితలలో కొత్తదనం గంభీరతతో కలిసి పాఠకుడిని మరో స్థాయికి తీసుకుపోతుంది.

‘ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇంటి సముద్రానికి
కాళ్ళనది తీసుకుపోతోంది’ (నా ధన్యవాదాలు నన్ను విముక్తున్ని చేస్తాయా?)
‘ఎన్ని వసంతాల్ని చూడడానికి పుట్టానో
పుట్టినచోటే చావటానికి నేను చెట్టుని కాదు’
(నా ధన్యవాదాలు నన్ను విముక్తున్ని చేస్తాయా?)
65 పేజీలు మాత్రమే ఉన్న ‘ఆకాశయానం’ సంపుటిలో ‘నిద్రపోని ఒక రాత్రి’, ‘మరణానికి ముందు మరణాలు’, ‘నిశ్శబ్దానికి అటు ఇటు’, ‘నేను నేనైన నేను’ , ‘పాతింట్లో ఒంటరి ముసలాయన’, ‘నిద్రరాని ఒక రాత్రి’ వంటి కవితలు దృశ్యాలు దృశ్యాలుగా కవితావస్తువును పరిచయం చేస్తూ మనసు మీద గాఢమైన ముద్ర వేస్తాయి.
‘నా వరకూ నాకు
అక్షరాల్ని మూటకట్టుకుని
వాక్యాల్ని కప్పుకుని
నిశ్శబ్దంగా కనుమరుగవాలని ఉంది’ అని కవి తన ఆశను వినమ్రంగా వెలిబుచ్చినా, వాస్తవానికి ఈ కవి చిరంజీవి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News