భారత స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఏకైక ఆదివాసీ వీరనారి రాణీ మా గైడిన్ల్యూ. ఆదివాసీల జీవనవిధానాన్ని కాపాడటానికి తెల్లదొరల ఆయుధాలకు ధైర్యంగా ఎదురు నిలిచిన ధీర వనిత. నాగజాతిలోని రాంగ్ మోయీతెగకు చెందిన రాణిమా దేశం గర్వించదగ్గ గొప్పపోరాట యోధురాలు. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా ఆమె ప్రదర్శించిన పోరాటపటిమ, ధైర్యసాహసాలు త్యాగం అసమానం.మణిపూర్ పశ్చిమ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామంలో 1915, జనవరి 26న జన్మించారు. తొలిసారిగా బ్రిటిష్ ఆర్మీకి అండగా మెసపొటేమియా యుద్ధంలో పాల్గొన్నారు.ఇండియాలో తెల్లవాళ్ల ఆగడాలను ప్రత్యక్షంగా చూసిన ఆమె ఆర్మీకి వెంటనే రాజీనామా చేసి బయటికొచ్చారు. లిసి హరాకా అనే ఉద్యమ సంస్థను ప్రారంభించారు. తెల్లవాళ్ళను దేశం నుంచి తరిమి కొట్టాలన్నదే ఆ సంస్థ లక్ష్యం. రాణీమా గైడిన్ల్యూ 17 ఏళ్ల ప్రాయంలోనే ఉద్యమ నాయకత్వాన్ని చేపట్టారు.
అతిచిన్న వయసులోనే ఆమె సాయుధ బలగాలను సిద్ధం చేసుకున్నారు. తన పోరాట స్థావరాన్ని బరాక్ నది సమీపానికి మార్చారు. ఉద్యమంలో పాల్గొన్న గిరిజన, గిరిజనేతర గ్రామాలపై తెల్లోళ్లు విరుచుకుపడ్డారు. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయినా వాళ్లంతా ధైర్య సాహసాలతో రాణీమా నాయకత్వంలో బ్రిటిష్ వాళ్లను ఎదిరించి స్వాతంత్య్ర పోరాటాన్ని కొనసాగించారు. ఆదివాసీలపై విదేశీ సంస్కృతి ప్రభావం పడకుండా కాపాడింది. అందుకే మణిపూర్ ప్రజలు ఆమెను దేవతలతో సమానంగా చూసేవారు. ‘రాణీమా’ అని పిలుచుకునేవారు. నాగ స్వతంత్ర దళం బ్రిటిష్ అస్సాం రైఫిల్స్‌పై దాడి చేసింది. కానీ, నాగాల ఆయుధాలైన కత్తి, డాలు, బాణం ఆంగ్లేయుల ఆధునిక ఆయుధాల ముందు నిలవలేకపోయాయి. వేలమంది నాగాలు వీర మరణం పొందారు. తర్వాత రాణిమా ఉత్తర మణిపూర్, నాగాల కేంద్ర స్థానమైన కోహిమాలో పర్యటిస్తూ సాయుధ బలగాలను కూడగట్టుకున్నారు. అసోం రైఫిల్స్ ‘హంగ్రమ్’ అనే ప్రాంతం లో కట్టెలతో ఒక కోటను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాణీమా కూడా గట్టి నిర్ణయం తీసుకున్నారు. ‘ఇక విజయమో వీరస్వర్గమో’ తేల్చుకోవాలనే తెగింపుతో పాలోమీ గ్రామ సమీపంలో ఆమె కూడా ఒక కోటను నిర్మించుకున్నారు.
ఆ స్థావరాన్ని కనిపెట్టిన బ్రిటిష్ సైన్యం అకస్మాత్తుగా దాడికి దిగారు. బ్రిటిష్ సైన్యం ఆధునిక ఆయుధాల దాటికి మరోసారి నాగాలకు ఓటమి తప్పలేదు. రాణీమాను అస్సాం రైఫిల్స్ అదుపులోకి తీసుకొని. తొలుత కోహిమాకు, ఆ తర్వాత ఇంపాల్ జైలుకు తరలించారు. తన సోదరుడు జో ధోనాంగ్ మాదిరిగానే రాణిమా గైడిన్ల్యూ కు బ్రిటిష్ ప్రభుత్వం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఆమె ముఖ్యమైన యవ్వాన జీవితమంతా 14 ఏళ్లపాటు చెరసాలలోనే గడిచింది. అయినా హరాకా ఉద్యమం ఏం తగ్గలేదు. అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన తర్వాత గిరిజన తెగల సంక్షేమం కోసం ఛత్తీస్‌గఢ్ అఖిల భారతీయ వనవాసీ కళ్యాణాశ్రమానికి అనుబంధంగా పనిచేశారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అసోం కి వచ్చినప్పుడు రాణీమా దేశభక్తిని మెచ్చుకున్నారు. ఆమెను విడుదల చేయించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో మంతనాలు జరిపారు. దేశానికి ఆమె చేసిన సేవలకుగాను 1972లో తామ్రపత్రంతో, 1982లో ‘పద్మభూషణ్’ తో సత్కరించారు. ఆమె శత జయంతి (1915-2015) సందర్భంగా భారత ప్రభుత్వం ప్రత్యేక నాణెన్ని విడుదల చేసింది. పోరాటాన్ని జీవితంగా భావిం చి సమరం సాగించిన రాణీ మా గైడిన్ల్యూ ధైర్యసాహసాలతో కూడిన పోరాట చరిత్ర దేశవ్యాప్తంగా భారతీయులందరికీ మరి ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి స్ఫూర్తి.