Monday, December 23, 2024

ఆ నరహంతకుడికి యావజ్జీవ శిక్ష

- Advertisement -
- Advertisement -

నువ్వంటే నాకిష్టం లేదన్న పాపానికి ఆ అమ్మాయిని చిత్ర హింసలు పెట్టాడు ఓ నరరూప రాక్షసుడు. సర్జికల్ బ్లేడ్లతో ఇష్టం వచ్చినట్లు ఆమెను పొడిచి చంపాడు. ఇంతటి కిరాతకానికి పాల్పడిన ఆ హంతకుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్ హైదరాబాద్ లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. అతనికి సోషల్ మీడియా ద్వారా తపస్వి అనే అమ్మాయి పరిచయమైంది. ఆమె చిన అవుటపల్లిలోని  ఓ డెంటల్ కాలేజీలో బీడీఎస్ చదువుతోంది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. దాంతో ఇద్దరూ కలసి 2021లో విజయవాడ సమీపంలోని గన్నవరంలో అద్దెకు గది తీసుకుని ఉండసాగారు.

కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. తపస్వి గది ఖాళీ చేసి, స్నేహితురాలి వద్దకు వెళ్లిపోయింది. అయినా జ్ఞానేశ్వర్ ఊరుకోకుండా, తనను పెళ్లి చేసుకోవాలని తపస్విని ఒత్తిడి చేయసాగాడు. దీనిపై ఆమె నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా జ్ఞానేశ్వర్ బుద్ధి మారలేదు. 2022 డిసెంబర్ 5న సర్జికల్ బ్లేడ్లను కొనుగోలుచేసి, తపస్వి ఉంటున్న గదికి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. నువ్వంటే నాకిష్టం లేదని తపస్వి తేల్చి చెప్పడంతో రగిలిపోయిన జ్ఞానేశ్వర్ సర్జికల్ బ్లేడ్లతో దాడి చేసి ఆమెను ఇష్టం వచ్చినట్లు పొడిచాడు. తాను కూడా పొడుచుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈలోగా తపస్వి రూమ్ మేట్ కేకలు వేయడంతో స్థానికులు జ్ఞానేశ్వర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఈ కేసులో గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్ధసారథి సోమవారం తీర్పు చెబుతూ నిందితుడు జ్ఞానేశ్వర్ కి 6 వేల రూపాయల జరిమానాతోపాటు యావజ్జీవ శిక్ష విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News