అహ్మదాబాద్‌లో ఘోర సంఘటన
అహ్మదాబాద్: నిర్మాణంలో ఉన్న ఒక భవనం లిఫ్టు కూలిపోవడంతో లిఫ్టులో పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు 13వ అంతస్తు నుంచి కిందపడి మరణించగా మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం ఉదయం ఈ ఘోరం జరిగింది. గుజరాత్ యూనివర్సిటీకి సమీపంలో నిర్మాణంలో ఒక భవనంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కార్మికులను పైకి తీసుకెళుతున్న లిఫ్టు ఏడవ అంతస్తు నుంచి కూలిపోయిందని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. అయితే. లిఫ్టు లోపల ఫ్లోర్‌కూ ఊతంగా నిలిచే రాడ్లు కూలిపోవడంతో కార్మికులు 13వ అంతస్తు నుంచి కిందపడి మరణించారని పోలీసులు అనంతరం వెల్లడించారు. లిఫ్టులోపల పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు కిందపడిన వెంటనే మరణించగా, ఐదవ అంతస్తులో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు అదుపు కోల్పోయి కింద పడిపోయారని, వీరిలో ఒకరు మరణించగా మరొకరు తీవ్ర గాయాలపాలై అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఎసిపి ఎల్‌బి జలా తెలిపారు.