మిగతా ఆరు స్థానిక ఎంఎల్‌సి స్థానాల బరిలో 26 మంది
ప్రలోభాలు, క్యాంపు రాజకీయాలపై ప్రత్యేక దృష్టి
ప్రతి ఫిర్యాదునూ పరిశీలిస్తున్నాం, మొత్తం 37 పోలింగ్ స్టేషన్లలో 5326 మంది ఓటర్లు : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయెల్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంఎల్‌సి ఎన్నికలలో ఓటర్లు కరోనా నియమాలు పాటిస్తూ తమ ఓటు హక్కును స్వచ్ఛందoగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఈక్రమంలో ఎంఎల్‌సి స్థానాలు ఏకగ్రీవమైన జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఎత్తేశామని స్పష్టం చేశారు. మిగతా ఐదు జిల్లాలోని 6 స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఖమ్మం, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్‌లోని ఆరు స్థానాలకు 26 మంది పోటీలో ఉండగా, 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈక్రమంలో ఐదు జిల్లాల్లో 5,326 మంది ఓటర్లు ఉన్నారని, కొవిడ్ నిబంధనలకు లోబడి ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తామని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఓటర్లకు క్యాంపులు నిర్వహించడం నేరమని, క్యాంపు రాజకీయాలపై ఫిర్యాదులొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శశాంక్ గోయల్ స్పష్టం చేశారు.
ఈక్రమంలో నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.. కాగా ఆదిలాబాద్ జిల్లాలో 1, నల్లగొండ 1, మెదక్ 1, ఖమ్మం 1, కరీంనగర్ జిల్లాలో 2 ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నికలు డిసెంబర్ 10న జరగనున్నాయన్నారు. కాగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర జరిగిన ఘటన పై కలెక్టర్ దగ్గర నివేదిక తెప్పించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్టు ఆయన వివరించారు. ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభాలుకు గురి చేసే వారిపై, క్యాంప్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అభ్యర్థుల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై విచారణ చేపట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని తెలిపారు.రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో భాగంగా 12 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇందులో నాలుగు జిల్లాలోని ఆరు ఎంఎల్‌సి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ప్రకటించారు.
ఓటర్లు, పోలింగ్ స్టేషన్ల వివరాలు
స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల సంబంధించిన వివరాలను చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ మీడియాకు వెల్లడించారు. ఆదిలాబాద్ 8 పోలింగ్ స్టేషన్లు మొత్తం 937 ఓటర్లు ఉన్నారన్నారు. ఆదిలాబాద్‌లో ఒక్కో స్థానానికి ఇద్దరూ అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. కరీంనగర్‌లో 8 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 1324 ఓటర్లు ఉన్నారు. 2 ఎంఎల్‌సి స్థానాలకు 10 మంది బరిలో ఉన్నట్టు తెలిపారు. మెదక్ 9 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 1026 ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. నల్గొండలో 8 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 1271 ఓటర్లు ఉన్నారని, ఒక్కో స్థానానికి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. ఖమ్మం 4 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 768 ఓటర్లు ఉన్నారని, ఒక్కో స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. మొత్తంగా 5,326 ఓటర్లు 37 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
క్ర.సం. జిల్లా ఎంఎల్‌సిల సంఖ్య బరిలో నిలిచిన సంఖ్య
1. కరీంనగర్ 2 10
2. నల్గొండ 1 07
3. ఆదిలాబాద్ 1 02
4. ఖమ్మం 1 04
5. మెదక్ 1 03