మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకారిణి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధినేత్రి ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్య మయన్మార్ కోసం ఉద్యమిస్తూ సైనిక జుంటా ప్రభుత్వం అన్యాయంగా అత్యధిక కాలం నిర్బంధంలో కొనసాగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ‘ఆమె నేటికీ నిర్బంధమే ఒక జీవితంగా జీవిస్తున్నారు’ అని పేర్కొనవచ్చు. అయితే ఇటీవల సైనిక జుంటా ప్రభుత్వం బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఆంగ్ సాన్ సూకీకి క్షమాభిక్షగా జైలు శిక్షను ఆరు సంవత్సరాలు తగ్గించడం ద్వారా స్వల్ప ఊరటని కలిగించింది అని చెప్పవచ్చు. ఈ రకంగా క్షమాభిక్ష కింద ఆమెపై ఉన్న అయిదు కేసులు రద్దు చేయబడ్డాయి.ఆమె మీద మరో14 కేసులు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే 33 ఏళ్ల జైలు శిక్షలో 6 ఏళ్ళు క్షమాభిక్ష కింద రద్దు కాగా మిగతా 27ఏళ్ల పాటు ఆమె ఇంకా జైలు జీవితాన్ని గడపాల్సి ఉండడం విచారకరం.
తన తండ్రి ఆంగ్ సాన్ నుండి ఉద్యమ వారసత్వాన్ని స్వీకరించి పలు నిర్బంధాలు అధిగమించి ప్రజా గొంతుకగా మయన్మార్‌లో ‘ప్రజాస్వామ్య సాధన’కు ఉద్యమించిన 77 ఏళ్ల ఆంగ్ సాన్ సూకీకి జీవిత కాలం నిర్బంధం విధించడం అమానవీయం. ఆమె జైలు నిర్బంధాన్ని ఆమ్నెస్టీ సహా పలు సంస్థలు బాహాటంగా వ్యతిరేకించడం గమనార్హం. సైనిక జుంటా ప్రభుత్వం మొదటగా సూకీని 1989 జులై 20 నాడు గృహ నిర్బంధం గావించి 1995 జూలై 10 నాడు స్వల్ప ఆంక్షలతో విడుదల చేశారు. మరోసారి జుంటా ప్రభుత్వం సూకీని 2000 సెప్టెంబర్ 23 నుండి 2002 మే 5 వరకు గృహా నిర్బంధంలో ఉంచి 19 నెలల తర్వాత 2002 మే 6 నాడు ఐక్యరాజ్యసమితి జరిపిన చర్చల ఫలితంగా విడుదల చేసింది. కొంతకాలం తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఆమెని అరెస్ట్ చేసి రంగూన్‌లోని ఇన్సేన్ జైలులో బంధించి 2003లో గృహ నిర్బంధానికి పంపిం ది. 2005 నవంబర్ 28 నాడు సూకీ గృహ నిర్బంధాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపి 2009 ఆగస్టు 11 నాడు దోషిగా నిర్ధారించారు. ఆమెకి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధింపబడిననూ అంతర్జాతీయ సమాజం వత్తిడి దృష్ట్యా దాదాపు సగం శిక్ష పూర్తి అయ్యాక 2010 నవంబర్ 13 నాడు సూకీ గృహ నిర్బంధం నుండి విడుదలయ్యారు.
సూకీ 1989 నుండి 2010 మధ్య గల 21 సంవత్సరాలలో మొత్తంగా 15 ఏళ్ళ పాటు గృహ నిర్బంధంలో కొనసాగారు. 1990 తర్వాత 2016 లో తిరిగి బహుళ పార్టీ ఎన్నికలు దేశంలో తొలిసారిగా స్వేచ్ఛగా జరుగగా నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ 86% సీట్లు గెలుపొంది చరిత్రాత్మక విజయాన్ని సాధించిననూ సూకీ దేశ అధ్యక్షురాలు కాలేకపోయారు.మరోసారి 2020 నవంబర్ 8 నాడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డి) మెజారిటీ సీట్లను గెలుచుకుని విజయం సాధించింది. 2021 ఫిబ్రవరి 1న కొత్తగా ఎన్నిక అయిన పార్లమెంట్ మొదటి సెషన్‌ని నిర్వహించాల్సిన ఆ రోజున సైన్యం అన్యాయంగా అధికారాన్ని హస్తగతం చేసుకొని సూకీని అరెస్ట్ చేసింది.సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆమెని పదవి నుండి తొలగించారు. అప్పటి నుండి సూకీని నిర్బంధంలోనే ఉంచి కేసులు మోపుతున్నారు.
2021 ఏప్రిల్ 1 నాడు సూకీపై అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా ప్రకటించారు.2021 డిసెంబర్ 6 నాడు సూకీకి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2022 జనవరి 10 నాడు మిలిటరీ కోర్టు మరో ఆరోపణపై వాకీ- టాకీలను స్వంతం చేసుకోవడం, కరోనా నియమాలను ఉల్లంఘించడం వంటి అనేక ఆరోపణలపై అదనంగా నాలుగు సంవత్సరాల శిక్ష విధింపబడింది. 2022 ఏప్రిల్ 27 నాడు అవినీతి ఆరోపణలపై జుంటా కోర్ట్ ఆమెకు అయిదు సంవత్సరాల జైలు శిక్షని విధించింది. 2022 ఆగస్ట్ 15 నాడు మరో నాలుగు అవినీతి ఆరోపణలపై దోషిగా తేల్చారు. దేశద్రోహం, అవినీతి తదితర ఆరోపణలపై సూకీకి 17 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
2022 సెప్టెంబర్ 2నాడు ఎన్నికల్లో జరిగిన అవినీతికేసులో సూకీకి మరో మూడేళ్ళ పాటు శిక్షను విధిస్తూ సైనిక కోర్టు తీర్పుని వెలువరించింది. ఆమెపై అన్యాయంగా మోపబడిన నేరాలకు శిక్షలు అనుభవించడానికి ఆమె జీవిత కాలం కూడా సరిపోదు అనేది యదార్థ సత్యం. అందువల్ల సైనిక జుంటా ప్రభుత్వం మానవతా దృక్పథంతో సూకీని నిర్బం ధం నుండి విముక్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోహింగ్యాల సమస్యలపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కోవడం మినహాయిస్తే మిగతా అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలలో సూకీ ప్రజాస్వామికంగా వ్యవహరించారు. ‘నిర్బంధమే ఆంగ్ సాన్ సూకీ ఆచూకి’ అనే దానికి తార్కాణంగా నిలిచి కళ్ళ ముందు కదలాడుతున్న ఆంగ్ సాన్ సూకీపై జీవితకాల నిర్బంధాన్ని ఎత్తివేసే దిశగా అంతర్జాతీయంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనది.
-జెజెసిపి బాబూరావు,
9493319690