ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు చేరిక
మూసినది లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు: ఎండీ దానకిషోర్
హైదరాబాద్: తెలంగాణ గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలమండలి అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని మూసినదిలోకి విడుదల చేశారు. ఈసందర్భంగా జలమండలి ఎండీ దానకిషోర్ మాట్లాడుతూ జలశయానికి నీరు పోటెత్తడంతో ఇప్పటివరకు మూడు గేట్లను ఒక అడుగు వరకు ఎత్తివేశామన్నారు. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగత్త్రగా మూసినది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. బోర్డు సిబ్బంది మూసి నదికి ఇరువైపులా ఎప్పటికప్పడు పరిస్దితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరూ అటువైపుగా వెళ్లొద్దని సూచించారు.
అంతేగాకుండా నగరంలోని దాదాపుగా అన్ని మ్యాన్‌హోల్‌లకు సేప్టీగ్రిల్‌తో పాటు, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎర్ర జెండాలు (రెడ్‌ప్లాగ్) ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నగరంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు తిరుగుతున్నాయన్నారు. రాబోయే మరో రెండు రోజుల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిన సందర్భంలో పరిస్దితిలను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లను, అధికార యంత్రాంగాలతో పాటు, జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులను ఆదేశించారు. హిమాయత్‌సాగర్ రిజ్వాయర్‌కు మొత్తం 17 గేట్లు ఉన్నాయని, గత ఏడాది అక్టోబర్ 14న జలాశయానికి 25వేల క్యూసెక్కుల నీరు పోటెత్తడంతో 13 గేట్లు ఎత్తి దిగువన ఉన్న మూసిలోకి వదిలారు.