Monday, December 23, 2024

పెన్షన్లతో వికలాంగుల జీవితాల్లో వెలుగులు

- Advertisement -
- Advertisement -
  • దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే..
  • భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వికలాంగుల పెన్షన్‌లతో వారి జీవితాల్లో వెలుగులు నింపారని భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వికలాంగులకు అదనంగా రూ.1000 పెన్షన్ పెంపుదల పంపిణీ కార్యక్రమాన్ని భూపాలపల్లిలోని ఇల్లందు క్లబ్ హౌస్‌లో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా, వికలాంగుల సంస్థ చైర్‌పర్సన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డితో కలిసి ముఖ్య అతిధిగా భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు.

పెరిగిన పెన్షన్‌లతో దివ్యాంగుల కుటుంబాల్లో నూతన వెలుగులు నిండాయని, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దివ్యాంగులకు సంక్షేమ భవనం ఏర్పాటు చేసుకున్నామన్నారు. పెరిగిన రూ.4016 పెన్షన్‌లతో నియోజకవర్గంలో దాదాపు 5319 మంది దివ్యాంగులకు రూ.21,361,104లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. అవిటితనం దేహానికి తప్ప మనసుకు కాదని, ప్రభుత్వపరమైన సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ప్రత్యేక రాయితీ కల్పిస్తుందన్నారు. ముసలవ్వలకు ఆసరా పెన్షన్‌లతో సిఎం కెసిఆర్ వారికి పెద్ద కొడుకుగా మారాడన్నారు.

కళ్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడపిల్లకు ఓ అన్నగా నిలుస్తున్నాడన్నారు. ఒక వైపు సంక్షేమం మరొ వైపు అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని, ఒక వైపు జీవనోపాధికి భరోసా కల్పిస్తూ మరొక వైపు ఆసరా పెన్షన్ రూపంలో వారి జీవితానికి ఆర్థిక భరోసా అందిస్తున్న సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర దివ్యాంగుల సమాజం తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

దివ్యాంగుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా గడిచిన తొమ్మిది ఏళ్లలో పదివేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత సిఎం కెసిఆర్‌ది అన్నారు. పెరిగిన ఆసరా పెన్షన్ రాష్ట్రవ్యాప్తంగా 5లక్షలకు పైగా లబ్దిదారులైన దివ్యాంగులకు మరింత ఆర్థిక భరోసా అందిస్తుందని తెలిపారు. సంపద పెంచుతా, పేదలకు పంచుతానన్న నినాదంతో రాష్ట్ర పాలన మొదలుపెట్టిన కెసిఆర్ ఆ క్రమంలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాల రూపంలో అన్ని వర్గాలకు ఆర్థిక లబ్దిని అందజేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. దేశంలో 16 రాష్ట్రాలలో రూ.1వెయ్యి పెన్షన్ అందిస్తున్నారని, 5 రాష్ట్రాల్లో రూ.2లోపు పెన్షన్ ఇస్తున్నారని, కానీ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనంతగా అత్యధిక పెన్షన్ రూ.4016 అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు.

అధికారంలోకి రాగానే అన్ని చేస్తామని మాటలు చెప్పుకుంటు నాయకులు వస్తారని, వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించాలన్నారు. వికలాంగులకు కావాల్సిన ట్రై సైకిల్, బ్యాటరీ వాహనాలను రానున్న రోజుల్లో నావంతుగా అందించేలా చర్యలు తీసుకుంటానని, అన్ని రంగాలను సమ దృష్టితో ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్‌గౌడ్, జడ్పి వైస్ చైర్మన్ శోభ రఘుపతిరావు, మున్సిపల్ చైర్మన్ వెంకట్రాణి సిద్దు, మేకల సంపత్, ఎంపిపి లావణ్య, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, సర్పంచ్‌లు, డిఆర్‌డిఓ అధికారి పురుషోత్తం, సురేష్, సోమయ్య, దివ్యాంగులు నీలాంబరం, నరసయ్య, సంపత్, మండలంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News