హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు. నేడు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఈనెల 10వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 4, 5 రోజుల్లో దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తాంధ్ర తీరం చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లోని ఆవర్తనం నుంచి దక్షిణ కేరళ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని అధికారులు వివరించారు. తిరోగమన నైరుతి పవనాలు బుధవారం వాయువ్య భారతదేశంలోని కొన్ని భాగాల నుంచి తిరోగమనం అయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.